సంక్షిప్త వార్తలు(10)

కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ కొనసాగించాలా వద్దా అన్నది అక్టోబరు 12న

Updated : 29 Sep 2022 06:39 IST

నోట్ల రద్దుపై వ్యాజ్యాలను అక్టోబరు 12న పరిశీలిస్తాం
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం

దిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016 నవంబరులో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ కొనసాగించాలా వద్దా అన్నది అక్టోబరు 12న పరిశీలిస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం బుధవారం తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అంశం విచారణార్హతపై జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని ధర్మాసనం సందేహం వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని ఒక అధ్యయన అంశంగా పరిగణించేటట్లయితే అక్టోబరు 12న ఈ కేసును పరిశీలిస్తామని తెలిపింది. ఈ అంశానికి విచారణార్హత లేదని కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా అభిప్రాయపడ్డారు. అయితే, ఒక అధ్యయన అంశంగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న సభ్యులుగా ఉన్నారు.

 


విచారణకు సహకరించండి
కిరణ్‌బేడీకి దిల్లీ హైకోర్టు సూచన

ఈనాడు, దిల్లీ: దిల్లీ రోహిణీలోని వీరేంద్రదేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంపై కేసు విచారణకు సహాయపడాలని ఐపీఎస్‌ మాజీ అధికారి కిరణ్‌బేడీకి దిల్లీ హైకోర్టు సూచించింది. వీరేంద్రదేవ్‌ దీక్షిత్‌ ఆశ్రమంలో బందీగా ఉన్న తమ కుమార్తె సంతోష్‌ రూపను విడిపించాలని కోరుతూ నిజామాబాద్‌కు చెందిన దుంపల రాంరెడ్డి, మీనావతి దంపతులతో పాటు పలువురు దిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.  విచారించిన కోర్టు గత ఏప్రిల్‌లో ఆశ్రమంపై పర్యవేక్షణకు ఐపీఎస్‌ మాజీ అధికారి కిరణ్‌ బేడీ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఆశ్రమం పనితీరుపై సదరు కమిటీ నివేదికను సమర్పించింది. తాజాగా దిల్లీ హైకోర్టు విచారణ సందర్భంగా కిరణ్‌బేడీ తరఫు న్యాయవాది హాజరుకాలేదు. విచారణ అంశం కిరణ్‌బేడీకి తెలిసి ఉండకపోవచ్చని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను అక్టోబరు పదో తేదీన చేపడతామని, ఆ రోజు విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది.


ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా
మాట్లాడే హక్కు మంత్రులకు ఉంటుందా?

దిల్లీ: ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు...సమష్టి నిర్ణయానికి కట్టుబడి ఉండాలా? ప్రభుత్వ విధానానికి భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించవచ్చా? పదవుల్లో ఉన్న వీరు వాక్‌ స్వాతంత్య్రం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను విశేషాధికారంగా పొందగలరా? వారికి ఎటువంటి పరిమితులు ఉంటాయి అనే అంశాలను రేకెత్తిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ధర్మాసనం నవంబరు 15కు వాయిదా వేసింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసు విచారణను చేపట్టింది. రాజ్యాంగ అధికరణం 19(1)(ఎ)లో పేర్కొన్న వాక్‌, భావ ప్రకటన స్వేచ్ఛలను ఒక్కో కేసు వారీగా చూడాల్సి ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ధర్మాసనంలో జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్న సభ్యులుగా ఉన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో 2016లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఓ ‘రాజకీయ కుట్ర’ అని, తమ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసే యత్నమని అప్పటి రాష్ట్ర మంత్రి, సమాజ్‌వాదీ పార్టీ నేత ఆజంఖాన్‌ అభివర్ణించారు. దీనిపై బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


గడప వద్దకే రేషన్‌ పథకం చట్టవిరుద్ధం
కలకత్తా హైకోర్టు తీర్పు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రారంభించిన ‘దువారే’ రేషన్‌ (గడప వద్దకే రేషన్‌) పథకం చట్టవిరుద్ధమని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్‌ అనిరుద్ధ రాయ్‌, జస్టిస్‌ చిత్తరంజన్‌ సౌయర్‌లతో కూడిన డివిజిన్‌ బెంచ్‌ ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలోని రేషన్‌ డీలర్లలో ఒక వర్గం గతేడాది ఆగస్టులో కలకత్తా హైకోర్టులో పిటిషను దాఖలు చేసింది. ఇంటింటికీ వెళ్లి రేషన్‌ పంపిణీ చేయడం సాధ్యం కాదనేది వీరి వాదన. అలా చేసేందుకు మౌలిక సదుపాయాలు లేవని డీలర్లు కోర్టులో వాదించారు. దిల్లీలోనూ ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించి, కోర్టు ఆదేశాలతో రద్దు చేసినట్లు తెలిపారు. డీలర్ల వాదనను జస్టిస్‌ అమృత సిన్హా తోసిపుచ్చారు. కరోనా పరిస్థితుల్లో ప్రజలకు ఈ పథకం ఎంతో ఉపయోగపడిందని ఆమె అభిప్రాయపడ్డారు. సింగిల్‌ జడ్జి బెంచ్‌ ఉత్తర్వులపై డీలర్లు అప్పీలుకు వెళ్లారు. ‘ఇంటింటికీ రేషన్‌ పథకం కేంద్ర ఆహార భద్రతా చట్టానికి విరుద్ధం. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని బలవంతంగా అమలు చేస్తోంది. కొన్నిసార్లు జరిమానా విధించి మరీ అమలు చేస్తున్నారు’ అని డీలర్లు వాదించారు. దీంతో ‘దువారే’ పథకం చట్టవిరుద్ధమని డివిజన్‌ బెంచ్‌ స్పష్టం చేసినట్లు పిటిషనర్‌ షేక్‌ అబ్దుల్‌ మజీద్‌ తెలిపారు.

- ఈటీవీ భారత్‌


చట్టసభల్లో ఓటుకు ముడుపుల కేసు..

దర్యాప్తు నుంచి ప్రజాప్రతినిధులు రక్షణ పొందగలరా?
సుప్రీంకోర్టులో నవంబరు 15న విచారణ

దిల్లీ: అసెంబ్లీ/పార్లమెంటులో ప్రసంగించడానికి లేదా ఓటు వేయడానికి ముడుపులు తీసుకున్నారనే నేరారోపణల దర్యాప్తు నుంచి ఎమ్మెల్యేలు/ఎంపీలు రక్షణ పొందగలరా? అనే వివాదంపై వ్యాజ్యాన్ని నవంబరు 15న చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు బుధవారం తెలిపింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం ఈ కేసును విచారించనుంది. దాదాపు మూడు దశాబ్దాల క్రితం జేఎంఎం ముడుపుల వ్యవహారం దేశాన్ని కుదిపేసింది. 1993లో పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని విశ్వాస పరీక్షలో గట్టెక్కించేందుకు కొందరు ఎంపీలు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. చట్టసభల్లో కార్యకలాపాలకు సంబంధించి ప్రజాప్రతినిధులకు రక్షణ ఉంటుందని అప్పట్లో సుప్రీంకోర్టు తీర్పు నిచ్చింది. అయితే, 2012లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓ అభ్యర్థికి ఓటు వేయడం కోసం ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు వచ్చిన జేఎంఎం ఎమ్మెల్యే సీతా సోరెన్‌(శిబు సోరెన్‌ కుమార్తె)పై కేసు నమోదు చేయాలని ఝార్ఖండ్‌ హైకోర్టు 2014లో ఆదేశాలిచ్చింది. దీనిని ఆమె సుప్రీంలో సవాల్‌ చేశారు.


తమిళిసై తండ్రికి ఇంటిని కేటాయించిన తమిళనాడు సర్కార్‌

చెన్నై, న్యూస్‌టుడే: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తండ్రికి తమిళనాడు ప్రభుత్వం ఇంటిని కేటాయించింది. తమిళిసై తండ్రి కుమరి అనంతన్‌ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. తమిళనాడు గృహ నిర్మాణ బోర్డు ఆయనకు చెన్నై అన్నానగర్‌ డివిజన్‌లోని ఉన్న రెవెన్యూ క్వార్టర్లలో ఇంటిని కేటాయించింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తగా అనంతన్‌ వివరణ ఇచ్చారు. తనకు సొంత ఇల్లు లేదని, తక్కువ పింఛనుతోనే అద్దె ఇంట్లో ఉన్నానని తెలిపారు.


ఐఏఎస్‌, ఐపీఎస్‌లను ఇవ్వండి
రాష్ట్రాలను కోరిన కేంద్రం

దిల్లీ: కేంద్ర డెప్యుటేషన్‌కు మీ పరిధిలోని మరింతమంది ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌వోలను అందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను బుధవారం కోరింది. అలాగే అవినీతికి పాల్పడే, అసమర్థ ఉద్యోగులను ఏరిపారేయడంలో తమకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. వివిధ సంస్కరణలపై చర్చించేందుకు రాష్ట్రాల ముఖ్యకార్యదర్శుల వార్షిక సమావేశం దిల్లీలో జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం పై విజ్ఞప్తి చేసింది.


వివాహం రద్దుకు సుప్రీంకోర్టుకున్న విస్తృత అధికారంపై వాదనలు ప్రారంభం

దిల్లీ: విడాకులు కోరుతున్న దంపతులకు వారి మధ్య తలెత్తిన విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకునే అవకాశం ఇవ్వకుండా వాటిని మంజూరు చేయడానికి సర్వోన్నత న్యాయస్థానికున్న విశేషాధికారాలపై బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగ అధికరణం 142 ప్రకారం ఈ అంశంలో సుప్రీంకోర్టుకు విస్తృత అధికారాలున్నాయి. భార్య, భర్త ఇద్దరూ విడాకులు కోరుకుంటే వాటిని మంజూరు చేయడం సబబే. అయితే, వారిద్దరిలో ఏ ఒక్కరికైనా విడాకులు తీసుకోవడం ఇష్టం లేకపోతే తగిన సమయం ఇవ్వకుండా న్యాయస్థానం తన విశేషాధికారంతో వాటిని ఇవ్వడం సమంజసమేనా? అది సంపూర్ణ న్యాయం అందజేయడం కిందకే వస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. విడాకుల కోసం చెబుతున్న కారణాల్లో ఆశ్చర్యపరిచే విషయాలతో పాటు చాలా అల్పమైన అంశాలు కూడా ఉంటున్నాయని తెలిపింది. భాగస్వాముల్లో అమాయకులైన వారు నష్టపోయే సందర్భాలు కూడా ఉంటున్నాయని పేర్కొంది. గురువారం కూడా వాదనలు కొనసాగుతాయి.


హత్యాచార నిందితుడికి విధించిన మరణ శిక్ష రద్దు

బాధితులకు న్యాయం చేయాలనే తొందరలో అన్యాయంగా ఒకరిని శిక్షించడానికి న్యాయస్థానం ఒప్పుకోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడికి కింది కోర్టులు విధించిన మరణ దండనను బుధవారం రద్దు చేసింది. జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పు నిచ్చింది. అత్యంత హేయమైన నేరం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ ఉత్తర్‌ప్రదేశ్‌ పోలీసుల దర్యాప్తు తప్పుల తడకగా ఉందని ఆక్షేపించింది.


ఐపీఎస్‌ అధికారి సతీశ్‌చంద్రకు సుప్రీంలో ఎదురుదెబ్బ

ఇశ్రాత్‌ జహాన్‌ ఎన్‌కౌంటర్‌ కేసు దర్యాప్తులో సీబీఐకి సహకరించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సతీశ్‌చంద్ర వర్మను విధుల నుంచి తొలగిస్తూ కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. ఈ వ్యవహారంలో సత్వరం జోక్యం చేసుకోవాలన్న పిటిషనర్‌ వినతిని దిల్లీ హైకోర్టు ఇప్పటికే తిరస్కరించిన సంగతిని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ హృశికేష్‌ రాయ్‌ల ధర్మాసనం గుర్తుచేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టేందుకు విముఖత వ్యక్తం చేసింది. అదే న్యాయస్థానంలో విచారణ పూర్తయ్యేవరకు వేచి చూడాలని సూచించింది.


300 పాత కేసుల్ని విచారించనున్న సుప్రీం

ఏళ్లుగా విచారణకు నోచుకోకుండా మూలనపడ్డ 300 అత్యంత పాత కేసులను సుప్రీంకోర్టు త్వరలో బయటకు తీయనుంది. వచ్చే నెల 11 నుంచి వాటిపై విచారణ చేపట్టనుంది. 1979లో నవభారత్‌ ఫెర్రాయ్‌ అలాయ్స్‌ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం దాఖలు చేసిన సివిల్‌ అప్పీలు కూడా ఈ జాబితాలో ఉంది.


సీబీఐ పిటిషన్‌తో తేజస్వి యాదవ్‌కు సమన్లు

దిల్లీ: ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషను (ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఇచ్చిన బెయిలు రద్దు చేయాలన్న సీబీఐ పిటిషనుతో దిల్లీ కోర్టు బిహార్‌ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌కు బుధవారం సమన్లు జారీ చేసింది. ప్రతివాది తరఫు న్యాయవాది స్పందన తెలియజేసేందుకు తగిన గడువిస్తూ.. అక్టోబరు 18న తేజస్వి వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావలసిందిగా ప్రత్యేక జడ్జి (సీబీఐ) గీతాంజలి గోయల్‌ సమన్లలో కోరారు.


సింగపూర్‌ వెళ్లేందుకు లాలూకు అనుమతి

వైద్యచికిత్స నిమిత్తం సింగపూర్‌ వెళ్లేందుకు అనుమతించాలని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ పెట్టుకున్న దరఖాస్తుకు దిల్లీ కోర్టు బుధవారం ఆమెదం తెలిపింది. అక్టోబరు 10 - 25 తేదీల మధ్య ఈ పర్యటనకు ప్రత్యేక జడ్జి (సీబీఐ) గీతాంజలి గోయల్‌ అనుమతించారు.


40 వేలకు క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదు కావడం.. కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కారణంగా క్రియాశీలక(యాక్టివ్‌) కేసులు 40 వేలకు దిగొచ్చాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40,979 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు.. గత 24 గంటల్లో 3,615 మంది కొవిడ్‌ బారిన పడగా.. 22 మంది మృతి చెందారు.


అన్యాయంపై నిరసన గళమే భగత్‌సింగ్‌కు నిజమైన నివాళి

ఫీజులను అమాంతం 400% వరకూ పెంచడంపై అలహాబాద్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు మండిపడుతున్నారు. వారిది ధర్మాగ్రహం. అసమానతలు, అన్యాయంపై పోరాడిన విప్లవకారుడు భగత్‌సింగ్‌ స్ఫూర్తి వారిలో కనిపిస్తోంది. పేద తల్లిదండ్రులు తమ పిల్లల కోసం భారీ ఫీజులను ఎక్కడి నుంచి తెచ్చి కడతారు? ఖరీదైన విద్యకు వ్యతిరేకంగా విద్యార్థులు వినిపిస్తున్న గళమే ఆయనకు నిజమైన నివాళి.

- ప్రియాంకా గాంధీ


దేశ భద్రతలో రాజీ పనికిరాదు

దేశ ఐక్యత, సమగ్రతలను ధ్వంసంచేసే దృష్టితో శాంతికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తున్న పీఎఫ్‌ఐపై ప్రభుత్వం చర్య తీసుకోవడం అభినందనీయం. దేశ భద్రత విషయంలో ఎలాంటి ఉదాసీనతకూ, రాజీకీ తావు ఉండకూడదు.

- వసుంధర రాజె


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts