దీదీ పాటల్లో రాముడి సాక్షాత్కారం: ప్రధాని

‘మన్‌ కీ అయోధ్య తబ్‌ తక్‌ సూనీ, జబ్‌ తక్‌ రామ్‌ నా ఆయే (శ్రీరాముడి సాక్షాత్కారం కాకపోతే, అయోధ్య లాంటి ఈ మనసు శూన్యమే) వంటి కీర్తనలు పాడిన లతా మంగేష్కర్‌ పాటల్లో ఈ దేశ

Published : 29 Sep 2022 05:53 IST

అయోధ్యలో ‘లతా చౌక్‌’ ప్రారంభం

అయోధ్య : ‘మన్‌ కీ అయోధ్య తబ్‌ తక్‌ సూనీ, జబ్‌ తక్‌ రామ్‌ నా ఆయే (శ్రీరాముడి సాక్షాత్కారం కాకపోతే, అయోధ్య లాంటి ఈ మనసు శూన్యమే) వంటి కీర్తనలు పాడిన లతా మంగేష్కర్‌ పాటల్లో ఈ దేశ ప్రజలు శ్రీరాముణ్ని చూస్తారు. అయోధ్యలో ఓ కూడలికి దీదీ పేరు పెట్టడం ద్వారా ఆ పవిత్రస్థలంతో ఆమెకు శాశ్వత బంధం ఏర్పరచిన ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నా’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయోధ్యలో నిర్మించిన ‘లతా చౌక్‌’ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ దివంగత గాయని జయంతి సందర్భంగా బుధవారం కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ కూడలిలో 40 అడుగుల పొడవు, 12 మీటర్ల ఎత్తు ఉన్న పద్నాలుగు టన్నుల వీణను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా రికార్డు చేసిన ఓ సందేశాన్ని ప్రధాని పంపించారు. ‘రామచరిత మానస్‌’లోని ఓ పద్యాన్ని   ఉటంకిస్తూ రాముడి కంటే ముందు భక్తులు చేరుకుంటారని అనడానికి ఇది నిదర్శనమని మోదీ అన్నారు. ‘సంగీత సరస్వతికి ప్రతీకగా వీణ ప్రతిష్ఠించాం. ఈ కూడలిలోని కొలనులో ఉన్న 92 పాలరాతి తామరలు లతాజీ జీవితంలోని వివిధ దశలను ప్రతిబింబిస్తాయి’ అని ప్రధాని వివరించారు. సరయూ నదీతీరంలో ‘లతా మంగేష్కర్‌ చౌరాహా’ పేరిట రూ.7.9 కోట్ల అంచనావ్యయంతో ఈ కూడలిని అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు. వీణను ప్రముఖ శిల్పి రామ్‌ సుతార్‌ రూపొందించారు. ఈ కార్యక్రమంలో లతామంగేష్కర్‌ కుటుంబసభ్యులు పాల్గొని భావోద్వేగానికి గురయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని