పీఎఫ్‌ఐ వెనక.. ప్రొఫెసర్‌.. టెకీ.. మాజీ లైబ్రేరియన్‌

ఈ.ఎం.అబ్దుల్‌ రహిమాన్‌.. ఓ మాజీ లైబ్రేరియన్‌. ఇలాంటి సాధారణ ఉద్యోగం చేసిన వ్యక్తిని పెద్దగా అనుమానించాల్సిందేమీ ఉండదు. కానీ గతవారం పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై

Published : 29 Sep 2022 05:53 IST

వీళ్లే ఈ అతివాద ఇస్లామిక్‌ సంస్థ  కీలక నేతలు

దిల్లీ: ఈ.ఎం.అబ్దుల్‌ రహిమాన్‌.. ఓ మాజీ లైబ్రేరియన్‌. ఇలాంటి సాధారణ ఉద్యోగం చేసిన వ్యక్తిని పెద్దగా అనుమానించాల్సిందేమీ ఉండదు. కానీ గతవారం పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై దేశవ్యాప్తంగా జరిగిన దాడుల్లో ఈ కేరళ వాసి కూడా అరెస్టయ్యారు. కారణం.. మాజీ లైబ్రేరియనని కాదు.. భారత ప్రభుత్వం నిషేధించిన స్టూడెంట్స్‌ ఇస్లామిక్‌ మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇండియా (సిమి) మాజీ అధ్యక్షుడని. 2006లో ఆవిర్భవించిన పీఎఫ్‌ఐ.. ఇంతింతై వటుడింతై.. చాప కింద నీరులా దేశమంతా విస్తరించడం వెనక.. ఇలాంటి మాజీ సిమి నేతలతో పాటు చాలా మంది కీలక పాత్ర పోషించారు. వారెవరంటే..

ఒ.ఎం.ఎ. సలాం (పీఎఫ్‌ఐ ఛైర్మన్‌)
పూర్వాశ్రమంలో కేరళ రాష్ట్ర విద్యుత్‌ బోర్డు ఉద్యోగి. పీఎఫ్‌ఐతో సంబంధాలు బయటపడటంతో ఉద్యోగం పోయింది. పీఎఫ్‌ఐ ఫ్రంటల్‌ ఆర్గనైజేషన్‌.. రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌తోనూ సలాంకు సంబంధాలు ఉన్నాయి.

అనీస్‌ అహ్మద్‌ (జాతీయ ప్రధానకార్యదర్శి)
పీఎఫ్‌ఐ సైబర్‌ కార్యకలాపాల విస్తరణలో అనీస్‌ది కీలక పాత్ర. ఓ అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్‌ సంస్థలో పనిచేశారు. సదరు కంపెనీ ఇటీవల ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటే అహ్మద్‌.. మీడియా, న్యూస్‌ఛానళ్లలో తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కనిపిస్తారు.

పి. కోయా (జాతీయ కార్యనిర్వాహక మండలి సభ్యుడు)
నిషేధిత సిమిలో క్రియాశీలక సభ్యుడు. కళాశాల ప్రొఫెసర్‌. ఇస్లామిక్‌ భావజాలాన్ని వ్యాప్తి చేసే కోజికోడ్‌లోని ‘ఇస్లామిక్‌యూత్‌ సెంటర్‌’ డైరెక్టర్‌. అయితే ఈ సంస్థ చేయాల్సిన పని మానేసి.. ముస్లిం యువతలో ఛాందసవాదాన్ని, ఉగ్రవాద మనస్తత్వాన్ని  ప్రేరేపిస్తోందన్నది కేంద్ర ఏజెన్సీల అభియోగం.

అఫ్సర్‌ పాషా (జాతీయ కార్యదర్శి)
వ్యాపారవేత్త. పీఎఫ్‌ఐ ఆవిర్భావం నుంచి సభ్యుడు

ఈ.ఎం.అబ్దుల్‌ రహిమాన్‌ (జాతీయ ఉపాధ్యక్షుడు)
కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కోచి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌లో మాజీ లైబ్రేరియన్‌. ఈయన వెనుక చాలా కథ ఉంది. గతంలో నిషేధిత సిమి అధ్యక్షుడు. పీఎఫ్‌ఐలో ప్రభావవంతమైన నేత. సంస్థ నిర్ణయాల్లో కీలక పాత్రధారి.

అబ్దుల్‌వాహిత్‌ (జాతీయ కార్వనిర్వాహక మండలి సభ్యుడు)
బెంగళూరులోని శివాజీనగర్‌ కచ్చిమెమెన్‌ వర్గానికి చెందిన వ్యక్తి. పీఎఫ్‌ఐలో ఆరంభం నుంచి ఉన్నారు. ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థకు అధిపతి

మినారుల్‌ షేక్‌ (బెంగాల్‌ అధ్యక్షుడు)
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ముస్లిం విద్యార్థులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తారు. అదే సమయంలో బెంగాల్‌లో పీఎఫ్‌ఐ కార్యకలాపాలనూ పర్యవేక్షిస్తారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని