త్రిదళాధిపతిగా అనిల్‌ చౌహాన్‌

భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61) నియమితులయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తదుపరి

Published : 29 Sep 2022 06:36 IST

విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌కు దక్కిన కీలక పదవి

దిల్లీ: భారత నూతన త్రిదళాధిపతి (సీడీఎస్‌)గా విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ (61) నియమితులయ్యారు. రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ ఆయన పదవిలో కొనసాగుతారని తెలిపింది. సీడీఎస్‌ హోదాలో.. దేశ మిలిటరీ వ్యవహారాల కార్యదర్శిగానూ ఆయన విధులు నిర్వర్తించనున్నారు. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ గత ఏడాది డిసెంబరులో హెలికాప్టర్‌ ప్రమాదంలో కన్నుమూసినప్పటి నుంచి త్రిదళాధిపతి పదవి ఖాళీగా ఉన్న సంగతి గమనార్హం.

విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ అపార అనుభవశాలి. దాదాపు 4 దశాబ్దాల తన కెరీర్‌లో అనేక హోదాల్లో పనిచేశారు. ఆయన ఉత్తరాఖండ్‌లో 1961 మే 18న జన్మించారు. మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలో గల జాతీయ డిఫెన్స్‌ అకాడమీ, దేహ్రాదూన్‌లోని భారత మిలిటరీ అకాడమీల్లో చదువుకున్నారు. 1981లో సైన్యంలోని 11 గోర్ఖా రైఫిల్స్‌లో చేరడంతో సర్వీసు ప్రారంభమైంది. గత ఏడాది మేలో ఈస్టర్న్‌ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నప్పుడు పదవీ విరమణ చేశారు. ప్రస్తుతం జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ డోభాల్‌ నేతృత్వంలోని జాతీయ భద్రతామండలి సచివాలయం (ఎన్‌ఎస్‌సీఎస్‌)లో సైనిక సలహాదారుడిగా చౌహాన్‌ ఉన్నారు. పదవీ విరమణ పొందిన ఓ త్రీస్టార్‌ అధికారి.. ఫోర్‌స్టార్‌ హోదా (సీడీఎస్‌గా)లో క్రియాశీల సర్వీసులో తిరిగి చేరడం ఇదే తొలిసారి కానుంది. ‘ఆఫ్టర్‌మాథ్‌ ఆఫ్‌ ఎ న్యూక్లియర్‌ అటాక్‌’ పేరుతో చౌహాన్‌ రాసిన పుస్తకం 2010లో ప్రచురితమైంది. 11 గోర్ఖా రైఫిల్స్‌ రెజిమెంటల్‌ సెంటర్‌ చరిత్ర కూడా ఆయన రాశారు. ఈస్టర్న్‌ కమాండ్‌లో దీర్ఘకాలంపాటు సేవలందించిన అనిల్‌ చౌహాన్‌కు చైనా వ్యవహారాల నిపుణుడిగా పేరుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని