మాజీ ఎమ్మెల్యే హోదా తొలగింపు అధికారం స్పీకర్‌కు లేదు

చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకునే శాసనసభ స్పీకర్‌కు వారికి ‘మాజీ ఎమ్మెల్యే’ హోదా లేకుండా చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా పదవీకాలం అనంతరం లభించే

Published : 29 Sep 2022 05:53 IST

బిహార్‌ శాసనసభ్యుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు

దిల్లీ: చట్టసభల సభ్యుల అనర్హతపై నిర్ణయం తీసుకునే శాసనసభ స్పీకర్‌కు వారికి ‘మాజీ ఎమ్మెల్యే’ హోదా లేకుండా చేసే అధికారం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తద్వారా పదవీకాలం అనంతరం లభించే పింఛను, ఇతరత్రా ప్రయోజనాలను అందుకోకుండా అడ్డుకోలేరని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం బుధవారం బిహార్‌కు చెందిన నలుగురికి ‘మాజీ ఎమ్మెల్యే’ల హోదాను పునరుద్ధరించింది. 2014లో అప్పటి బిహార్‌ అసెంబ్లీ స్పీకర్‌ ఉదయ్‌ నారాయణ్‌ చౌధరి నలుగురు జేడీయూ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంతో పాటు వారికి ‘మాజీ ఎమ్మెల్యే’ హోదాను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వారు పింఛను, ఇతర ప్రయోజనాలు పొందే హక్కును కోల్పోయారు. అనర్హతకు గురైన జ్ఞానేంద్రకుమార్‌ సింగ్‌, రబీంద్రరాయ్‌, నీరజ్‌ కుమార్‌ సింగ్‌, రాహుల్‌కుమార్‌లు స్పీకర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ  పట్నా హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ముందు పిటిషన్‌ దాఖలు చేయగా మధ్యంతర ఉత్తర్వు ద్వారా ఉపశమనం లభించింది. అయితే, డివిజన్‌ బెంచ్‌ ప్రతికూలమైన నిర్ణయాన్ని వెలువరించడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ మధ్యంతర ఆదేశాలు వచ్చాయి. రాజ్యాంగ అధికరణం 10 కల్పించిన అధికారాల ప్రకారం...సభాపతికి ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అధికారం మాత్రమే ఉంటుందని, వారికి మాజీ ఎమ్మెల్యే హోదా లేకుండా చేయలేరని సీజేఐ జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం బుధవారం తీర్పునిచ్చింది. వారికి మాజీ ఎమ్మెల్యే హోదాను పునరుద్ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని