డిసెంబరు వరకు ఉచిత బియ్యం

పేదలకు ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన డిసెంబరు వరకు కొనసాగనుంది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో

Published : 29 Sep 2022 05:53 IST

గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన గడువు పొడిగింపు

పండగల నేపథ్యంలో మోదీ కేబినెట్‌ కీలక నిర్ణయం

కేంద్ర ఉద్యోగులకు 4% డీఏ పెంపు

ఈనాడు, దిల్లీ: పేదలకు ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు ఉద్దేశించిన ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన డిసెంబరు వరకు కొనసాగనుంది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. దసరా, మిలాద్‌-ఉన్‌-నబీ, దీపావళి, ఛట్‌పూజ, గురునానక్‌ జయంతి, క్రిస్మస్‌లాంటి పండగలు వరుసగా రాబోతున్న నేపథ్యంలో గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజనను పొడిగించాలని నిర్ణయించినట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖల మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌ తెలిపారు. ఈ 3 నెలల్లో 80 కోట్లమంది లబ్ధిదారులకు 122 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలను అందించనున్నామని, ఇందుకోసం ప్రభుత్వం రూ.44,762 కోట్లు ఖర్చుచేయనుందని వెల్లడించారు. ఇప్పటివరకు ఆరు విడతల్లో రూ.3.45 లక్షల కోట్లతో 1,121 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆహారధాన్యాలను పేదలకు అందజేసినట్లు పేర్కొన్నారు. మొత్తంగా ఏడు దశల్లో కలిపి ఈ పథకం కోసం రూ.3.91 లక్షల కోట్లను కేంద్రం ఖర్చుపెట్టినట్లవుతుందన్నారు. ఆహార భద్రత చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి వ్యక్తికీ గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన కింద నెలకు 5 కేజీల ఆహారధాన్యాలు అందిస్తారు.


ఉద్యోగులకు పెరిగిన డీఏ

కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు డీఏను 4% మేర పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జులై 1 నుంచి అమల్లోకి వస్తుంది. దీనివల్ల 41.85 లక్షలమంది కేంద్ర ఉద్యోగులు, 69.76 లక్షల మంది పింఛనుదారులకు లబ్ధి చేకూరనుంది. తాజా పెంపుతో ఏటా ప్రభుత్వంపై రూ.12,852 కోట్ల అదనపు భారం పడుతుందని అనురాగ్‌ ఠాకుర్‌ తెలిపారు.


రైల్వే సిబ్బందికి 78 రోజుల వేతనం బోనస్‌

రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీపికబురు అందించింది. దసరా నేపథ్యంలో 78 రోజుల వేతనాన్ని వారికి బోనస్‌గా ఇచ్చేందుకు కేబినెట్‌ అంగీకారం తెలిపింది. ఉత్పాదకత ఆధారంగా దాన్ని అందజేయనున్నారు.


3 ప్రధాన స్టేషన్ల అభివృద్ధికి ఆమోదం

కొత్త దిల్లీ, అహ్మదాబాద్‌, ముంబయి (ఛత్రపతి శివాజీ మహరాజ్‌ టెర్మినస్‌) రైల్వేస్టేషన్లను రూ.60 వేల కోట్లతో అభివృద్ధి చేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ప్రస్తుతం రూ.10 వేల కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. దిల్లీ స్టేషన్‌ను మూడున్నరేళ్లలో; ముంబయి, అహ్మదాబాద్‌ స్టేషన్లను రెండున్నరేళ్లలో పునర్‌అభివృద్ధి చేయాలన్నది తమ లక్ష్యమని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ అభివృద్ధి పనులతో దిల్లీ, అహ్మదాబాద్‌ రైల్వేస్టేషన్లలో 15 ఎకరాల చొప్పున, ముంబయి స్టేషన్‌లో 5.50 ఎకరాల అదనపు స్థలం అందుబాటులోకి వస్తుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని