PFI: పీఎఫ్‌ఐపై వేటు

దేశ భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని పేర్కొంటూ ఇస్లామిక్‌ సంస్థ.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతో పాటు.. దాని అనుబంధ సంస్థలనూ చట్ట

Published : 29 Sep 2022 06:41 IST

దాని అనుబంధ సంస్థలపైనా ఐదేళ్ల నిషేధం

వాటితో దేశభద్రతకే ముప్పు

ఉత్తర్వుల్లో కేంద్ర హోంశాఖ

ఐసిస్‌తోనూ సంబంధాల ప్రస్తావన

వేటును స్వాగతించిన భాజపా

ఆరెస్సెస్‌ సంగతేంటన్న విపక్షాలు

ఈనాడు - దిల్లీ

దేశ భద్రతకు ప్రమాదకరంగా పరిణమిస్తోందని పేర్కొంటూ ఇస్లామిక్‌ సంస్థ.. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)పై కేంద్రం ఐదేళ్ల నిషేధం విధించింది. పీఎఫ్‌ఐతో పాటు.. దాని అనుబంధ సంస్థలనూ చట్ట విరుద్ధ సంస్థలుగా ప్రకటించింది. ఇందులో రిహాబ్‌ ఇండియా ఫౌండేషన్‌, క్యాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా, ఆల్‌ ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌, నేషనల్‌ కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ ఆర్గనైజేషన్‌, నేషనల్‌ ఉమన్స్‌ ఫ్రంట్‌, జూనియర్‌ ఫ్రంట్‌, ఎంపవర్‌ ఇండియా ఫౌండేషన్‌, రిహాబ్‌ ఫౌండేషన్‌ కేరళ ఉన్నాయి. వీటిపైనా ఐదేళ్ల నిషేధం కొనసాగుతుందని పేర్కొంది. ఈ మేరకు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 1967లోని సెక్షన్‌ 3(1) ఆధారంగా మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ సంస్థలన్నీ బయటికి సామాజిక, ఆర్థిక, విద్యా, రాజకీయ సంస్థల్లా కనిపించినప్పటికీ రహస్యంగా సమాజంలోని ఒక వర్గంపై అతివాద ఎజెండాను అమలు చేస్తున్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ నిర్మాణ వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపింది. 2006లో ఆవిర్భవించిన పీఎఫ్‌ఐపై దేశవ్యాప్తంగా పలు కేసులు ఉన్నాయి. ఆ సంస్థ ఉగ్ర,ఆర్థిక కార్యకలాపాలపై చాన్నాళ్ల నుంచి కేంద్ర సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. గత వారంలో దేశవ్యాప్తంగా పీఎఫ్‌ఐ కార్యాలయాలు, నేతలపై 15 రాష్ట్రాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు నిర్వహించి.. వందమందికి పైగా ఆ సంస్థ కీలక నేతలను, మద్దతుదారులను అరెస్టు చేసింది.

వేటు ఎందుకంటే..

* ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ ఇరాక్‌ అండ్‌ సిరియా (ఐసిస్‌), అల్‌ఖైదా తదితర అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో పాటు.. జమాత్‌-ఉల్‌-ముజాహిదీన్‌ బంగ్లాదేశ్‌తోనూ పీఎఫ్‌ఐకు సంబంధాలు ఉన్నాయి.

* కేరళలో సంజిత్‌, నందు, బిబిన్‌, అభిమన్యు, ప్రవీణ్‌ నెట్టారు, తమిళనాడుకు చెందిన వి.రామలింగం, శశికుమార్‌, కర్ణాటకలో శరత్‌, ఆర్‌.రుద్రేష్‌, ప్రవీణ్‌ పూజారి, అనే వ్యక్తుల హత్యల్లో ఈ సంస్థకు ప్రమేయం ఉంది.

* పీఎఫ్‌ఐ పదాధికారులు, శ్రేణులు దేశ, విదేశాల నుంచి బ్యాంకు, హవాలామార్గాల్లో నిధులను సమీకరిస్తున్నారు. అంతిమంగా ఈ నిధులను భారత్‌లో చట్టవ్యతిరేక కార్యకలాపాలకోసం  వినియోగిస్తున్నారు.

* రహస్య శిక్షణ శిబిరాలు నిర్వహించి.. అందులో శిక్షణ పొందిన వ్యక్తులను ఇస్లాంకు శత్రువుగా భావించే సమూహాలపై దాడులు, హింసకు పాల్పడేలా ప్రేరేపిస్తోంది.

* భారత్‌లో ముస్లింలకు రక్షణ లేదని, వారు హింసకు గురవుతున్నారని దుష్ప్రచారం చేస్తూ ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది.

* పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో ఈ సంస్థ పాత్ర ఉంది.

మావోయిస్టులపైనా వేటేశారు... మార్పొచ్చిందా
పీఎఫ్‌ఐపై నిర్ణయాన్ని భాజపా స్వాగతించింది. దేశభద్రత, హితాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని భాజపా సీనియర్‌ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీ అన్నారు. పీఎఫ్‌ఐపై దర్యాప్తు చేసినట్లే ఆరెస్సెస్‌నూ విచారించాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూప్రసాద్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. నిషేధం పరిష్కారం కాదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. గాంధీ హత్య తర్వాత ఆరెస్సెస్‌పై మూడుసార్లు నిషేధం విధించినా.. ఆ సంస్థ మారలేదని, మావోయిస్టులపై వేటుతోనూ ఫలితాలు రాలేదని చెప్పారు. మెజారిటీ, మైనారిటీ సంబంధం లేకుండా అన్నిరకాల మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతామని కాంగ్రెస్‌ స్పందించింది. యూపీ, అస్సాం, మహారాష్ట్ర సహా భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలు కేంద్ర నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రధాని, హోంమంత్రి మరో సర్జికల్‌ స్ట్రైక్‌ చేశారని నిషేధంపై ఆలిండియా బార్‌ అసోషియేషన్‌ వ్యాఖ్యానించింది.


గుంటూరులో పీఎఫ్‌ఐ కార్యాలయం సీజ్‌

గుంటూరు (పట్నంబజారు), న్యూస్‌టుడే: గుంటూరు చౌత్రాసెంటర్‌లోని పీఎఫ్‌ఐ కార్యాలయాన్ని బుధవారం అధికారులు సీజ్‌ చేశారు. ఇటీవల ఇక్కడి కార్యాలయంపై ఎన్‌ఐఏ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి వారు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్‌ఐని నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో... పోలీసు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు బుధవారం గుంటూరు తూర్పు ఇన్‌ఛార్జి తహసీల్దార్‌ ఎస్‌.ఎం.కె.రిజ్వాన్‌, లాలాపేట సీఐ ప్రభాకర్‌లు కార్యాలయానికి సీలు వేశారు.


‘నిషేధం’ నిర్ణయానికి మద్దతివ్వం: అసదుద్దీన్‌ ఒవైసీ

అబిడ్స్‌, న్యూస్‌టుడే: పీఎఫ్‌ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇవ్వబోమని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టంచేశారు. ఈ మేరకు బుధవారం వరుస ట్వీట్లు చేసిన ఒవైసీ.. దారుస్సలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతోనూ మాట్లాడారు. ‘ఉపా’ను కఠినతరం చేయడానికి గతంలో కాంగ్రెస్‌ హయాంలో సవరణ చేశారని.. దాన్ని మరింత క్రూరంగా మార్చడానికి భాజపా పాలనలో చట్టాన్ని సవరించినప్పుడు కాంగ్రెస్‌ కూడా మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రజాస్వామ్యవాదులు గుర్తుచేసుకోవాలని కోరారు. పీఎఫ్‌ఐని నిషేధించడం కాదు.. ఖాజా అజ్మీరీ దర్గాపై బాంబు పేలుళ్లు జరిపిన దోషులతో సంబంధం కలిగి ఉన్న సంస్థలపై నిషేధం ఎందుకు విధించడం లేదని ప్రశ్నించారు. ఎవరైనా కొందరు వ్యక్తులు నేరాలకు పాల్పడితే ఆ సంస్థ మొత్తాన్ని నిషేధించడం సరికాదని.. ఒకరిని దోషిగా నిర్ధారించడానికి కేవలం ఒక సంస్థతో అనుబంధం మాత్రమే సరిపోదని గతంలో సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఈ రకమైన క్రూర నిషేధం ప్రమాదకరమని.. ఇది తమ అభిప్రాయాన్ని చెప్పాలనుకునే ముస్లింలపై నిషేధం లాంటిందని ఆందోళన వ్యక్తంచేశారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts