సంక్షిప్త వార్తలు (24)

ఇస్రో శాస్త్రవేత్త ఎ.కె.అనిల్‌ కుమార్‌ అంతర్జాతీయ వ్యోమగామ సమాఖ్య (ఐఏఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేస్తున్నారు. ఐఏఎఫ్‌లో

Updated : 30 Sep 2022 08:48 IST

ఐఏఎఫ్‌ ఉపాధ్యక్షుడిగా ఇస్రో శాస్త్రవేత్త

ఈనాడు, బెంగళూరు: ఇస్రో శాస్త్రవేత్త ఎ.కె.అనిల్‌ కుమార్‌ అంతర్జాతీయ వ్యోమగామ సమాఖ్య (ఐఏఎఫ్‌) ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ఇస్ట్రాక్‌) అసిస్టెంట్‌ డైరెక్టరుగా పని చేస్తున్నారు. ఐఏఎఫ్‌లో 72 దేశాలకు చెందిన 433 మంది సభ్యులున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక వినిమయానికి ఐఏఎఫ్‌ కృషి చేస్తుందని ఇస్రో ప్రకటించింది.


మూర్ఛ రకాలను గుర్తించే అల్గారిథమ్‌
ఐఐఎస్‌సీ, ఎయిమ్స్‌ రూపకల్పన

ఈనాడు, బెంగళూరు: మూర్ఛ రకాలను గుర్తించేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈఈజీ(ఎలక్ట్రో ఎన్సీపాలోగ్రామ్స్‌)ను వర్గీకరించే అల్గారిథమ్‌ను బెంగళూరుకు చెందిన భారతీయ విజ్ఞాన సంస్థ(ఐఐఎస్‌సీ), ఎయిమ్స్‌(రుషికేష్‌) నిపుణులు సంయుక్తంగా అభివృద్ధి చేశారు. మెదడు నుంచి స్వల్పకాలంలో వెల్లడయ్యే విద్యుత్తు సంకేతాల తీవ్రతను బట్టి మూర్ఛ సమస్యను గుర్తిస్తారు. ఇందుకోసం ఈఈజీ విధానాన్ని అనుసరించినా లోతుగా అధ్యయనం చేసేంత సమయంతో పాటు సంకేతాలు ఉండవు. పైగా మూర్ఛల్లోని రకాలను (ఫోకల్‌, జనరల్‌ ఎపిలెప్సీ) గుర్తించేందుకు పాత విధానం సహకరించదని ఐఐఎస్‌సీ ఎక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌(డీఈఎస్‌ఈ) అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఆచార్య హార్దిక్‌ పాండ్య తెలిపారు. తాము రూపొందించిన అల్గారిథమ్‌లతో మెదడు నుంచి వెల్లడయ్యే సంకేతాల డీకోడింగ్‌లను మూర్ఛ రకాలను గుర్తించేందుకు వీలుపడుతుందన్నారు. 88 మంది మెదడు సంకేతాలను 45 నిమిషాల పాటు వర్గీకరించి అధ్యయనం చేశామని చెప్పారు. సంకేతాల క్యుములేటివ్‌ స్పైక్‌ వేవ్‌ కౌంట్‌ ద్వారా సాధారణ, ఫోకల్‌, జనరలైజ్డ్‌, ఆబ్‌సెన్స్‌ వంటి నాలుగు రకాల సంకేతాలను రికార్డు చేసి తీవ్రతల ఆధారంగా మూర్ఛలకు చికిత్స చేసేందుకు వీలుంటుందని డీఈఎస్‌ఈ పీహెచ్‌డీ విద్యార్థి రతిన్‌ జోషి చెప్పారు.


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు మూడేళ్ల జైలు

భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: నకిలీ పత్రాలు సమర్పించి 2001లో రూ.1.5 కోట్ల రుణం తీసుకున్న కేసులో ఒడిశాలోని కటక్‌ జిల్లా బరాబటి నియోజకవర్గం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, మెట్రో బిల్డర్‌ సంస్థ యజమాని మహమ్మద్‌ ముఖిమ్‌కు భువనేశ్వర్‌ ప్రత్యేక విజిలెన్స్‌ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2001లో ఒడిశా గ్రామీణ గృహ నిర్మాణ అభివృద్ధి కార్పొరేషన్‌ నుంచి ఈ రుణం తీసుకున్నట్లు కోర్టు తీర్పులో పేర్కొంది. కార్పొరేషన్‌ అధ్యక్షుడిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి వినోద్‌ కుమార్‌, మెట్రో బిల్డర్‌ సంస్థకు చెందిన ఇద్దరు ఉద్యోగులకు ఇదే శిక్ష ఖరారు చేసి, రూ.50,000 జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు శిక్ష పొడిగించాలని ఆదేశించింది. అప్పట్లో నకిలీ పత్రాలతో రుణం తీసుకున్నట్లు తెలియడంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ విభాగం దర్యాప్తు ప్రారంభించి వాస్తవమని తేలడంతో కోర్టులో కేసు నమోదు చేసింది. గురువారం  కోర్టు తీర్పు వెలువరించింది.


‘ఉచిత కండోమ్‌’ వ్యాఖ్యపై వివరణివ్వండి

దిల్లీ, పట్నా: విద్యార్థినులతో అభ్యంతరకరంగా మాట్లాడడంపై బిహార్‌ ఐఏఎస్‌ అధికారిణి హర్‌జోత్‌ కౌర్‌ను జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) గురువారం వివరణ కోరింది. ‘ప్రభుత్వం ఉచితంగా ఎన్నో ఇస్తోంది.. మాకు రుతు రుమాళ్లు(శానిటరీ నాప్‌కిన్స్‌) ఇవ్వలేదా?’ అన్న ఓ విద్యార్థినితో ‘ఇలాగే ఇచ్చుకొంటూ పోతే రేపు మీరు నిరోధ్‌(కండోమ్స్‌)లు కూడా ఉచితంగా అడుగుతారు’ అంటూ బిహార్‌ మహిళా అభివృద్ధి సంస్థ ఎండీ హర్‌జోత్‌ కౌర్‌ పట్నాలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హర్‌జోత్‌ కౌర్‌పై తగిన చర్య తీసుకుంటామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌ తెలిపారు.


‘జ్ఞానవాపి’ కాల పరీక్షపై హిందూ పిటిషనర్‌ అభ్యంతరం

వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు- శృంగార్‌ గౌరీ ప్రాంగణ వివాదం కేసులో శివలింగానికి కాల పరీక్ష(కార్బన్‌ డేటింగ్‌) నిర్వహించాలన్న ప్రతిపాదనపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ముస్లింల తరఫు న్యాయవాదితో పాటు హిందూ పిటిషనర్లలో ఒకరు కూడా ఈ ప్రతిపాదనను వారణాసి కోర్టులో గురువారం వ్యతిరేకించారు. ఈ మేరకు అఫిడవిట్లను దాఖలు చేశారు. అటువంటి పరీక్ష వల్ల శివలింగానికి శాశ్వత నష్టం కలిగే ప్రమాదం ఉందని హిందూ పిటిషనర్‌ రాఖీ సింగ్‌ అభిప్రాయపడ్డారు. అయితే, ముస్లింల పక్షం న్యాయవాది వాదన అందుకు భిన్నంగా ఉంది. ఈ వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వులో ఉంచుతూ అక్టోబరు 7వ తేదీకి వాయిదా వేసింది.


మద్రాస్‌ హైకోర్టు సీజేగా ఒరిస్సా ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు

దిల్లీ: ఒరిస్సా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.మురళీధర్‌ను అదే హోదాలో మద్రాస్‌ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌ నేతృత్వంలోని కొలీజియం సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.  దీంతోపాటు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై బుధవారం నాటి సమావేశంలో జస్టిస్‌ లలిత్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌   సంజయ్‌కిషన్‌ కౌల్‌ చర్చించారు.


మైసూరు ధగధగ

కర్ణాటక సాంస్కృతిక నగరి.. మైసూరు దసరా సంబరాల్లో మునిగి తేలుతోంది. నవరాత్రులూ వేడుకలు కొనసాగనుండగా, గురువారం నగరమంతా విద్యుద్దీపాలతో కళకళలాడింది. రాజమందిరం కాంతులీనుతున్న వేళ.. పర్యాటకుల సందడి వర్ణనాతీతం.

- న్యూస్‌టుడే, మైసూరు


సకాలంలో చికిత్స చేయించుకోకే గుండెపోటు

ఈనాడు, బెంగళూరు: గుండె సమస్య ఉందని తెలిసినా సకాలంలో చికిత్స తీసుకోకపోవడం, జీవనశైలిని మార్చుకోకపోవడం గుండెపోటును వేగంగా ఆహ్వానించేందుకు కారణమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక రాష్ట్ర వైద్య నివేదికల ప్రకారం 2021-22 ఏడాదిలో గుండెపోటుతో మృతి చెందిన వారిలో 70 శాతం సకాలంలో చికిత్స తీసుకోకపోవడమేనని పేర్కొన్నారు. ‘హైపర్‌ టెన్షన్‌ హార్ట్‌ ఎటాక్‌’ అంశంపై నిర్వహించిన జాతీయ సదస్సులో వైద్యులు ఈ వివరాలను వెల్లడించారు. బెంగళూరుకు చెందిన న్యూబర్గ్‌ డయాగ్నస్టిక్స్‌ సంస్థ గురువారం ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ సదస్సులో ముంబయికి చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ వివేక్‌ మహాజన్‌ మాట్లాడుతూ.. ‘రక్తపోటు ఉన్నవారు తీసుకునే ఔషధాలు కూడా గుండెపోటుకు దారితీస్తాయి. అధిక ఆహారం, క్రమశిక్షణ లేని జీవన విధానం, ఆహారంలో కూరగాయల కొరత వంటివి రక్త ప్రసరణ వ్యవస్థను దెబ్బతీస్తాయి’ అని చెప్పారు. న్యూబర్డ్‌ క్లినికల్‌ ఇమేజింగ్‌ మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అజిత్‌ మాట్లాడుతూ లక్షణాలు ఉన్నా లేకున్నా నిర్దిష్ట వయసు దాటిన తర్వాత వైద్య పరీక్షలు అవసరం. 40 ఏళ్లు దాటిన తర్వాత నిద్ర, ఆహారం, శారీరక వ్యాయామం వంటివి తప్పక పాటించాలి’ అని సూచించారు.


చట్టం చేయడం సులభం సమాజాన్ని ఒప్పించడం కష్టం : సుప్రీం

దిల్లీ: సమాజంలో మార్పులకు కొంత సమయం పడుతుందనీ, ఒక చట్టాన్ని తీసుకురావడం సులభమే అయినా దాంతో మారేలా సమాజాన్ని ఒప్పించడం కష్టమని సుప్రీంకోర్టు పేర్కొంది. విడాకులకు సంబంధించిన కేసులపై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం ఈ వ్యాఖ్య చేసింది. వివాహాన్ని రద్దు చేయాల్సిందిగా కోరుతూ దంపతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు వారిని కొంతకాలం నిరీక్షింపజేయడానికి కుటుంబ న్యాయస్థానాలకు పంపించకుండా రాజ్యాంగంలోని 142వ అధికరణం కింద అధికారాలను ఉన్నత న్యాయస్థానాలు ఉపయోగించుకునేందుకు విస్తృత కొలమానాలు ఏమిటనే అంశంపై వాదనల్ని ధర్మాసనం ఆలకించింది. దేశంలో వివాహాల్లో కుటుంబ పాత్ర కీలకమని పేర్కొంది.  

అక్రమ సంబంధాలతో జీవితాలు నాశనం..

అక్రమసంబంధాలకు పాల్పడే సైనిక అధికారులకు వ్యతిరేకంగా క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు ఓ యంత్రాంగాన్ని సైనిక బలగాలు ఏర్పరచుకోవాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అక్రమ సంబంధాలను నేరంగా పరిగణించే భారత శిక్షా స్మృతిలో ఉన్న సెక్షన్‌ 497 చెల్లదంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ ప్రవాస భారతీయుడు జోసెఫ్‌ వేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా గురువారం జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

‘జల్లికట్టు’పై నవంబరు 22 నుంచి విచారణ

సంప్రదాయ జల్లికట్టు, ఎద్దుల బండి పోటీలకు అనుమతి కల్పించే తమిళనాడు, మహారాష్ట్ర చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై నవంబరు 22 నుంచి జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ్‌ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ ధర్మానసంలోని ఇతర సభ్యులు.

ఆకలి చావుల వివరాలు ఇవ్వండి

దేశంలో ఆకలితో, పోషకాహార లోపంతో చనిపోయినవారి వివరాలు సమర్పించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. సామాజిక వంటశాలల పథకాన్ని అమలు చేయడానికి ఉన్న ప్రణాళిక గురించి కూడా నివేదించాలని జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాల ధర్మాసనం గురువారం అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) మాధవి దివాన్‌కు తెలిపింది. ఇదివరకు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం అడిగామనీ, దీనిని క్రోడీకరించి తగిన నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఏఎస్‌జీ కోరారు. ఆ మేరకు విచారణను నవంబరు 3వ తేదీకి వాయిదా వేశారు. ఆకలితో ఎవరూ చనిపోకుండా చూసేలా కేంద్రాన్ని ఆదేశించాలంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారిస్తోంది.


చైనా రుణ యాప్‌ ఖాతాలపై ఈడీ పంజా

దిల్లీ: చైనా నియంత్రిత రుణ యాప్‌ల హవాలా లావాదేవీలపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా ఖాతాల్లోని ఆన్‌లైన్‌ చెల్లింపుల తాలూకు రూ.9.82 కోట్ల నిధులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) స్తంభింపజేసింది. ఈ విధంగా ఈడీ నిధులను స్తంభింపజేయడం ఇది రెండోసారి. ఈ నెల ప్రారంభంలో ఏకంగా రూ.46.67 కోట్ల నిధులను ఈడీ స్తంభింపజేసింది. ఇవి కొన్ని వ్యాపార సంస్థలకు చెందిన నిధులుగా అధికారులు పేర్కొన్నారు.


5జీ పనితీరును టన్నెల్‌ నుంచి పరీక్షించనున్న ప్రధాని మోదీ

దిల్లీ: వేగంగా సమాచారాన్ని చేరవేసే అత్యాధునిక 5జీ సర్వీసులను ప్రధాని మోదీ అక్టోబరు 1న ప్రారంభించనున్నారు. దిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ఈ కార్యక్రమం అనంతరం ఈ సేవల పనితీరును ఆయన ఓ భూగర్భ టన్నెల్‌ నుంచి పరీక్షిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి. సెక్టర్‌ 25, ద్వారకాలో దిల్లీ మెట్రో నిర్మిస్తున్న స్టేషన్‌కు చెందిన టన్నెల్‌ దీనికి వేదిక కానుందని సమాచారం.


భగత్‌సింగ్‌కు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించండి

భారత్‌, పాక్‌లకు స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి

లాహోర్‌: స్వాతంత్య్ర సమర యోధుడు భగత్‌సింగ్‌ సమున్నత ప్రాణ త్యాగాన్ని, అసాధారణ ధైర్య సాహసాలను సముచిత రీతిలో సత్కరించేలా ఆయనకు అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించాలని పాకిస్థాన్‌కు చెందిన ఓ స్వచ్ఛంద సంస్థ విజ్ఞప్తి చేసింది. అమరవీరుడి 115వ జయంతి సందర్భంగా లాహోర్‌ హైకోర్టు ఆవరణలో బుధవారం భగత్‌సింగ్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఓ స్మారక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ ప్రభుత్వాలకు ఈ సూచన చేసింది.


గంగానదిలోకి క్రోమియం వ్యర్థాల నిరోధానికి సత్వర చర్యలు తీసుకోండి

యూపీ ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశం

దిల్లీ: కాన్పుర్‌ జిల్లాలోని చర్మశుద్ధి కర్మాగారాల నుంచి గంగానదిలోకి యథేచ్ఛగా వదిలేస్తున్న క్రోమియం పూరిత వ్యర్థాలను అడ్డుకునేందుకు సత్వర చర్యలను చేపట్టాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) ఆదేశించింది. దీనికి సంబంధించిన నివేదికను తమ ముందుంచాలని కోరింది. ఈ సమస్యపై కొంత పురోగతి ఉన్నప్పటికీ..ఇంకా మురుగు కాల్వలు, సాధారణ మురుగుశుద్ధి కేంద్రాల నుంచి గంగా నదిలోకి విచ్చలవిడిగా కాలుష్యం ప్రవహిస్తోందని జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోకపోవడం కారణంగానే సమస్య కొనసాగుతోందని వ్యాఖ్యానించింది.  


తొలి, మలి సీడీఎస్‌లు ఉత్తరాఖండ్‌ వారే!

దేహ్రాదూన్‌: నూతన త్రివిధ దళాధిపతి (సీడీఎస్‌)గా లెఫ్టినెంట్‌ జనరల్‌(రిటైర్డ్‌) అనిల్‌ చౌహాన్‌ నియమితులు కావడంతో ఉత్తరాఖండ్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తొలి సీడీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన జనరల్‌ బిపిన్‌ రావత్‌ ఇదే రాష్ట్రానికి చెందిన వారు కాగా అనిల్‌ చౌహాన్‌ది కూడా ఉత్తరాఖండ్‌ కావడం.. అంతేకాకుండా వారిద్దరిది ఒకే జిల్లా (పౌరి) అవడం విశేషం. రావత్‌, ఆయన భార్య గతేడాది డిసెంబరులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాగా నూతన సీడీఎస్‌గా అనిల్‌ చౌహాన్‌ శుక్రవారం బాధ్యతలు చేపట్టనున్నారు.


పెరిగిన ఎయిర్‌ ట్రాఫిక్‌తో పైలట్లలో అలసట

దిల్లీ: దేశంలో పెరుగుతున్న ఎయిర్‌ ట్రాఫిక్‌, విస్తరిస్తున్న విమానయాన సంస్థలతో పైలట్లు అలసటకు గురవుతున్నారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిశ్శబ్ద ప్రమాదం లాంటి ఈ సమస్యపై తక్షణం దృష్టి సారించాలని సీనియర్‌ కెప్టెన్లు, పైలట్ల బృందాలు కోరుతున్నాయి. విధుల నిర్వహణకు సంబంధించి పరిమిత వేళలు తదితర నిబంధనలు ఉన్నప్పటికీ.. అలసట తగ్గించేలా మరింత శాస్త్రీయ దృక్పథం అవసరమని పలువురు సీనియర్‌ కెప్టెన్లు అభిప్రాయపడుతున్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న భారత విమానయాన రంగానికి ‘అలసట’ అన్నది ఆందోళనకరమైన అంశమని వీరు చెబుతున్నారు. 


మిశ్రమ పదార్థాల వైఫల్య ముప్పు అంచనాకు నూతన పద్ధతులు

ఈనాడు, గువాహటి: వైమానిక, ఆటోమొబైల్‌ రంగాల్లో వినియోగించే మిశ్రమ పదార్థాలు (కాంపోజిట్‌ మెటీరియల్స్‌) విఫలమయ్యేందుకు ఉన్న ముప్పును ముందుగానే గుర్తించే సరికొత్త విధానాలను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)-గువాహటికి చెందిన మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ నెల్సన్‌ ముత్తు నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధి చేసింది. ఆయా పదార్థాల వైఫల్య అవకాశాలను అంచనా వేసేందుకు ఈ బృందం మెషీన్‌ లెర్నింగ్‌ టూల్స్‌తో పాటు అత్యంత ఆదరణ పొందిన కొన్ని నమూనా పద్ధతుల (శాంప్లింగ్‌ టూల్స్‌)ను వినియోగించినట్లు ఐఐటీ వర్గాలు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. మాంటే కార్లో సిమ్యులేషన్‌ వంటి బహుముఖ అంచనాల పద్ధతి ద్వారా వచ్చే ఫలితాలను మరింత మెరుగుపరిచేందుకు వీరి ఆవిష్కరణలు దోహదపడతాయని భావిస్తున్నారు.


1 నుంచి ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయాలు

దిల్లీ: గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలు సమీపిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్లను విక్రయానికి పెట్టింది. 22వ విడత ఎలక్టోరల్‌ బాండ్ల విక్రయాలు అక్టోబర్‌ 1 నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఎస్‌బీఐకి చెందిన 29 అధీకృత శాఖల్లో అక్టోబర్‌ 1 నుంచి 10వ తేదీ వరకు ఈ బాండ్లను కొనుగోలు చేయొచ్చని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.


మృతదేహాల అప్పగింతలో తారుమారు!

పేర్లు ఒకేలా ఉండటంతో పొరపాటు

ముంబయి: ఒకే సమయంలో, ఒకే పేరు, దాదాపు ఒకే వయసున్న ఇద్దరు రోగులు మృతిచెందడంతో... వారి శవాలు తారుమారయ్యాయి! అంత్యక్రియలకు ముందు బంధువులు గుర్తించి, వాటిని మార్చుకోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలోని రాయ్‌గఢ్‌ జిల్లా అలీబాగ్‌కు చెందిన రమాకాంత్‌ పాటిల్‌(62) రక్తపోటు, మధుమేహం కారణంగా ఎంజీఎం ఆసుపత్రిలో చేరి, అక్కడే మృతిచెందాడు. పన్వేల్‌కు చెందిన రమా పాటిల్‌(66) మూత్రపిండాలు, కాలేయ సమస్యతో అదే ఆసుపత్రిలో చేరి, పరిస్థితి విషమించడంతో కన్నుమూశాడు. గురువారం రెండు కుటుంబాల వారు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసుకున్నారు. తీరా చూస్తే మృతదేహాలు వేర్వేరుగా, గడ్డాలు భిన్నంగా ఉన్నాయి. ఆసుపత్రి వర్గాలకు ఫోన్‌చేస్తే, వారు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో రెండు కుటుంబాల వారు మళ్లీ ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని, మృతదేహాలను మార్చుకోవాల్సి వచ్చింది.


భద్రతా మండలిని పునర్‌వ్యవస్థీకరించాల్సిందే: జైశంకర్‌

వాషింగ్టన్‌: భద్రతా మండలిని పునర్‌వ్యవస్థీకరించడం తేలికైన విషయం కాకపోయినప్పటికీ.. ఆ ప్రక్రియను నిరవధికంగా వాయిదావేస్తూ ఉండటం సరికాదని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.  అమెరికా పర్యటనను ముగించుకొని స్వదేశానికి బయలుదేరడానికి ముందు వాషింగ్టన్‌లో విలేకర్లతో పలు అంశాలపై ఆయన మాట్లాడారు.


67 అశ్లీల వెబ్‌సైట్‌లపై కేంద్రం కొరడా

దిల్లీ: ఇంటర్నెట్‌లో 67 అశ్లీల వెబ్‌సైట్‌లను వెంటనే మూసేయాలని ఇంటర్నెట్‌ సేవలు అందించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2021లో జారీ చేసిన కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకుంది. ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలతోపాటు పుణె ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 63 వెబ్‌సైట్లను, ఉత్తరాఖండ్‌ హైకోర్టు ఆదేశాల ఆధారంగా 4 వెబ్‌సైట్‌లను బ్లాక్‌ చేయాలని తన ఆదేశాల్లో స్పష్టం చేసింది.


విత్తన ప్రయోగశాలల నివేదిక ఫీజు రూ.10 నుంచి రూ.వెయ్యికి పెంపు

ఈనాడు, దిల్లీ: విత్తనాలను విశ్లేషించి నివేదిక అందించేందుకు ప్రయోగశాలలు తీసుకునే ఫీజును కేంద్ర వ్యవసాయ శాఖ రూ.10 నుంచి రూ.వెయ్యికి పెంచింది. ఈ మేరకు 1968 విత్తన నిబంధనలను సవరిస్తూ గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.


మాంసం కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌
ఆసుపత్రి పాలైన 50 మంది కార్మికులు

అలీగఢ్‌: రోరావర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని అల్‌ దువా మాంసం కర్మాగారంలో గురువారం అమ్మోనియా గ్యాస్‌ లీకై సుమారు అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వీరిలో అస్వస్థతకు గురైన సుమారు 50 మందిని చికిత్స కోసం స్థానిక జైన్‌ వైద్య కళాశాలలో చేర్చారు. దీనిపై దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్‌ ఇందర్‌ విక్రమ్‌ సింగ్‌ వెల్లడించారు.


శ్రీనగర్‌లో ఉగ్రవాది అరెస్ట్‌

అంసార్‌ గజవత్‌ - ఉల్‌ - హింద్‌ (ఏజీహెచ్‌) ముఠాకు చెందిన ఉగ్రవాది జునైద్‌ అహ్మద్‌ పరేను భద్రతాదళాలు గురువారం అరెస్టు చేశాయి. శ్రీనగర్‌లోని పాల్‌పోరా ప్రాంతంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో ఇతను పట్టుబడ్డాడు. పోలీసులు, సైన్యం సంయుక్తంగా ఏర్పాటుచేసిన చెక్‌ పాయింటు కన్నుగప్పి వరి పొలాల్లో నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా, వెంటపడి నిర్బంధంలోకి తీసుకొన్నారు.  


రూ.13 కోట్ల విలువైన కొకైన్‌తో చిక్కిన బొలీవియా మహిళ

బ్రెజిల్‌ దేశం నుంచి 3.2 కిలోల కొకైన్‌ను తెస్తున్న బొలీవియా మహిళను ఎన్సీబీ అధికారులు ముంబయి విమానాశ్రయంలో గురువారం పట్టుకున్నారు. కొకైన్‌ను లోహపు అచ్చులు, నల్లని తారు రూపంలోకి మార్చి గోవాకు తరలించేందుకు ముంబయి మీదుగా వెళ్తుండగా నిందితురాలు చిక్కింది. ఆ సరకు విలువ రూ.13 కోట్లు ఉంటుందని అంచనా. నిందితురాలు వెల్లడించిన వివరాలతో గోవాలో సరకు కోసం వేచి ఉన్న నైజీరియన్‌ దేశస్థుడిని అధికారులు అరెస్టు చేశారు.


చిత్రవార్త

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని