జాతీయ మహిళా కమిషన్‌ తొలి అధ్యక్షురాలు జయంతి పట్నాయక్‌ కన్నుమూత

ఒడిశా కాంగ్రెస్‌ నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్‌ భార్య జయంతి పట్నాయక్‌(90) కన్నుమూశారు. జయంతి బుధవారం రాత్రి అనారోగ్యానికి

Published : 30 Sep 2022 03:26 IST

భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: ఒడిశా కాంగ్రెస్‌ నాయకురాలు, దివంగత ముఖ్యమంత్రి జె.బి.పట్నాయక్‌ భార్య జయంతి పట్నాయక్‌(90) కన్నుమూశారు. జయంతి బుధవారం రాత్రి అనారోగ్యానికి గురవడంతో భువనేశ్వర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆమె మృతిచెందినట్లు ప్రకటించారు. గంజాం జిల్లా అస్కా పట్టణంలో 1932 ఏప్రిల్‌ 7న జన్మించిన జయంతి 1953లో జె.బి.పట్నాయక్‌ను వివాహం చేసుకున్నారు. బ్రహ్మపుర, కటక్‌ల నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభకూ ప్రాతినిధ్యం వహించారు. పి.వి.నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో 1992లో ఏర్పాటైన జాతీయ మహిళా కమిషన్‌కు తొలి అధ్యక్షురాలిగా విశిష్ట సేవలందించారు. జయంతి గొప్ప రచయిత్రి. పలు ఒడియా మాస, పక్ష, వార పత్రికలకు సంపాదకురాలిగా పనిచేశారు. ప్రముఖ కవి కె.ఎం.మున్షీ సంస్కృతంలో రచించిన పౌరాణిక గ్రంథం ‘కృష్ణావతారం’ను ఒడియాలోకి అనువదించారు. జయంతి మృతికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్లు గణేశీలాల్‌, బిశ్వభూషణ్‌ హరిచందన్‌, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సంతాపం తెలిపారు. పూరీలోని స్వర్గద్వారంలో గురువారం ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని