సంక్షిప్త వార్తలు(16)

ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు ఓ ఎడతెగని సమస్యగా సుప్రీంకోర్టు పేర్కొంది. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతిక విధానాలైన శాటిలైట్‌ మ్యాపింగ్‌, జీయో ఫెన్సింగ్‌ వంటివాటిని వినియోగించుకోవడం ఎంతైనా అవసరమని తెలిపింది.

Updated : 01 Oct 2022 06:45 IST

అక్రమ నిర్మాణాలు ఓ ఎడతెగని సమస్య
ఆధునిక సాంకేతికతల సాయంతో వాటిని అడ్డుకోవాలి: సుప్రీంకోర్టు

దిల్లీ: ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలు ఓ ఎడతెగని సమస్యగా సుప్రీంకోర్టు పేర్కొంది. వీటిని ఎప్పటికప్పుడు గుర్తించి అడ్డుకోవడానికి ఆధునిక సాంకేతిక విధానాలైన శాటిలైట్‌ మ్యాపింగ్‌, జీయో ఫెన్సింగ్‌ వంటివాటిని వినియోగించుకోవడం ఎంతైనా అవసరమని తెలిపింది. అధికార యంత్రాంగం నిరంతరంగా నిఘా ఉంచి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకాలతో కూడిన ధర్మాసనం సూచించింది. దేశ రాజధాని ప్రాంతం దిల్లీలో అక్రమ నిర్మాణాల విషయమై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధునిక సాంకేతికతలను వినియోగించి అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలపై స్థాయీ నివేదికను సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. అందుకు నాలుగు వారాల గడువునిచ్చింది.  

ముందస్తు నిర్బంధం.. వ్యక్తిగతస్వేచ్ఛపై దాడి  

ముందస్తు నిర్బంధం.. వ్యక్తిగత స్వేచ్చపై తీవ్రమైన దాడి అని సుప్రీంకోర్టు పేర్కొంది. 2021, నవంబరు 12 త్రిపుర ప్రభుత్వం జారీ చేసిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాల ధర్మాసనం శుక్రవారం ఈ వ్యాఖ్యలు చేసింది.  


నాలుగు రాష్ట్రాల్లో అంతరిక్ష వారోత్సవాలు.. హాజరుకానున్న గవర్నర్లు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్ష కార్యక్రమాలను సామాన్యుల చెంతకు చేరవేసేందుకు వీలుగా ఏటా నిర్వహించే ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలను తిరుపతి జిల్లాలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) ఆధ్వర్యంలో ఈనెల 4 నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. షార్‌లో ఈనెల 4న తమిళనాడు గవర్నర్‌ కేఎన్‌ రవి వీటిని ప్రారంభిస్తారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 5న ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, పుదుచ్చేరిలో 7న తెలంగాణతోపాటు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్‌ తమిళిసై, ఒడిశాలోని కటక్‌లో 12న అక్కడి గవర్నర్‌ గణేశిలాల్‌ ప్రారంభించనున్నారు. వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విజయవాడ, శ్రీహరికోట, పుట్టపర్తి, తమిళనాడులోని వేలూరు, ఒడిశాలోని కటక్‌, పుదుచ్చేరిలోని కరైకల్‌లో నిర్వహిస్తారు.  ఈ సందర్భంగా ప్రదర్శన, ఫిలిం షో, సదస్సులు, విద్యార్థులకు క్విజ్‌, డ్రాయింగ్‌, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులిస్తారు.


విద్యార్థినిని మరిచి.. తాళం వేశారు

బులంద్‌శహర్‌: రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని తరగతి గదిలోనే వదిలేసి, తాళం వేసుకుపోయిన ఘటన యూపీలో 8 మంది సస్పెన్షనుకు దారి తీసింది. బులంద్‌శహర్‌లో గురువారం ఈ దారుణం జరిగింది.  బ్లాకు స్థాయి యూనియన్‌ ఎన్నిక ఉన్నందున టీచర్లు  తాళం వేసుకుపోవడంతో పొరపాటు జరిగింది.  ఈ ఘటనలో పాఠశాల హెడ్‌ మాస్టరుతో సహా 8 మందిని అధికారులు సస్పెండు చేశారు.


వైరస్‌కు వైరస్‌తోనే కట్టడి

దిల్లీ: కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌ను కట్టడి చేయడానికి ఆ సూక్ష్మజీవినే సాధనంగా ఉపయోగించుకునే వినూత్న విధానాన్ని అమెరికాలోని ‘ద స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌’ శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. ఇందుకోసం వారు ఎన్‌ఎంటీ5 అనే సరికొత్త ఔషధాన్ని కనుగొన్నారు. కరోనాలో కొత్తగా వస్తున్న వేరియంట్లపైనా ఇది సమర్థంగా పనిచేసే అవకాశం ఉందని వివరించారు. ఎన్‌ఎంటీ5లో రెండు కీలకమైన లక్షణాలు ఉన్నాయి. 1. ఇది వైరస్‌ ఉపరితలంపై ఉన్న ఒక రంధ్రాన్ని గుర్తించి, దానికి అంటుకోవడం. 2. నైట్రోగ్లిజరిన్‌ను ఉపయోగించుకొని మానవుల్లోని ఏసీఈ2 గ్రాహకాన్ని తాత్కాలికంగా రసాయనపరంగా మార్చివేయడం. కరోనా వ్యాప్తి కట్టడికి ఈ రెండు లక్షణాలు బాగా ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. తొలుత ఈ మందు.. కరోనా వైరస్‌పై రసాయన పూతను వేస్తుంది. ఫలితంగా అది మానవ ఏసీఈ2 రెసెప్టార్‌ను తాత్కాలికంగా మార్చేస్తుంది. మన కణాల్లోకి ప్రవేశించడానికి ఈ భాగాన్నే వైరస్‌ ఉపయోగించుకుంటుంది. ఈ మందును కలిగిన వైరస్‌ తన సమీపానికి వస్తే కణంలోకి ప్రవేశించే మార్గాన్ని ఈ రెసెప్టార్‌ మూసేస్తుంది. దగ్గరకు రాకుంటే తన పని తాను చేసుకుపోతుంది.


లాలాజల ప్రొటీన్లతో రొమ్ము క్యాన్సర్‌ గుర్తింపు

దేహ్రాదూన్‌: ప్రాణాంతక రొమ్ము క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఉపయోగపడే నూతన విధానాన్ని ఐఐటీ రూర్కీ పరిశోధకులు అభివృద్ధిపరిచారు. లాలాజల గ్రంథిలో ఉండే మూడు ప్రొటీన్ల ఆధారంగా...శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించిన ట్రిపుల్‌ నెగటివ్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌(టీఎన్‌బీసీ)ను గుర్తించవచ్చని తేల్చారు. ఈ క్యాన్సర్‌కు సంబంధించిన బయో సూచికలను లాలాజలంలో పసిగట్టే విధానాన్ని తమ పరిశోధక బృందం అభివృద్ధిచేసినట్లు ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలిపింది. రొమ్ము క్యాన్సర్‌ బాధితుల్లో లాలాజల గ్రంథి పనితీరు, దానిలోని ప్రొటీన్ల తీరుతెన్నుల్లోనూ మార్పులు వస్తున్నట్లు పేర్కొంది. ఈ వైరుధ్యాలనే బయో సూచిక ద్వారా గుర్తించి వ్యాధిని నిర్ధారించవచ్చని వివరించింది.


అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై కాల్పుల కేసులో.. యూపీ సర్కారుకు ‘సుప్రీం’ నోటీసులు

ఈనాడు, దిల్లీ: తన వాహనంపైకి కాల్పులు జరిపిన కేసులో నిందితులకు బెయిలివ్వడాన్ని సవాల్‌ చేస్తూ హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్‌పై ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌పై ప్రభుత్వ స్పందన తెలియజేయాలని ఆదేశించింది. తన వాహనంపై ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాపుర్‌లో ఈ ఏడాది ఫిబ్రవరి 3న కాల్పులు జరిపిన ఇద్దరు నిందితులకు అలహాబాద్‌ హైకోర్టు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణ మురారి ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఒవైసీ తరఫు న్యాయవాది వాదనలు.. వినిపిస్తూ బాధితుని (ఒవైసీ) వాదనలు వినకుండానే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడం సరికాదన్నారు. వాదనలు విన్న ధర్మాసనం నిందితులకు బెయిల్‌ ఇచ్చిన అంశాన్ని హైకోర్టు పునఃపరిశీలించాలని కోరాలా.. వద్దా.. తెలియజేయాలంటూ ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. విచారణను నవంబరు 11వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితులకు ఆరు నెలల క్రితం తుపాకీ ఇచ్చిన ఆలీమ్‌కు బెయిల్‌ ఇవ్వడాన్ని సవాల్‌ చేస్తూ ఒవైసీ దాఖలు చేసిన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆరు నెలల క్రితం తుపాకీ అందజేసిన వ్యక్తికి నేరంతో సంబంధం ఉందని ఎలా చెబుతారని ధర్మాసనం ప్రశ్నించింది.


కర్బన ఉద్గారాలను తగ్గించే సిమెంటు
ఆవిష్కరించిన ఐఐటీ మద్రాస్‌

వడపళని, న్యూస్‌టుడే: కర్బన ఉద్గారాలను తక్కువగా వెలువరించే కొత్త సిమెంటు ఉత్పత్తిని ఐఐటీ మద్రాస్‌ కనుగొంది. స్విస్‌ ఏజెన్సీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేషన్‌తో కలిసి దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇది సాధారణ సిమెంటుతో పోల్చితే తయారీలో కర్బన ఉద్గారాలను 40% తగ్గిస్తుందని చెప్పారు. 20% విద్యుత్తు ఆదా అయ్యేలా ఈ లైమ్‌స్టోన్‌ కాన్సిన్డ్‌ క్లే సిమెంటును తీసుకొచ్చామని ఐఐటీ మద్రాస్‌ పరిశోధకులు తెలిపారు. సుస్థిరమైన కాంక్రీటు ప్రమాణాలతో ఈ సిమెంటు రూపొందించామని ఐఐటీ మద్రాస్‌ డీన్‌ మను సంతానం అన్నారు. ఐఐటీ-దిల్లీ, దిల్లీకి చెందిన తారా సంస్థ, క్యూబాకు చెందిన సెంట్రల్‌ యూనివర్సిటీ మార్టఅర్బ్యూ ఆఫ్‌ లాస్‌విలాస్‌ తదితరులతో కలిసి పనిచేశామని వివరించారు.


రైలు ప్రయాణికుల వద్ద రూ.1.75 కోట్ల స్వాధీనం

చెన్నై, న్యూస్‌టుడే: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు రైలు ప్రయాణికుల నుంచి రూ.1.75 కోట్ల నగదును తమిళనాడు ప్రొహిబిషన్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అన్నానగర్‌ ప్రొహిబిషన్‌ పోలీసులు శుక్రవారం ఉదయం చెన్నై పెరంబూర్‌ రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణించిన ఇద్దరి బ్యాగులను తనిఖీ చేయగా రూ.1.75 కోట్ల నగదు కనిపించింది. తగిన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని చెంబియం పోలీసులకు అప్పగించారు. దర్యాప్తులో... ఆ ఇద్దరూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అభిషేక్‌ (22), సూరజ్‌ (22) అని తెలిసింది. నగల వ్యాపారం చేస్తున్నారని, వాటి కొనుగోలు కోసం చెన్నైలోని షావుకారుపేటకు వెళ్లేందుకు వచ్చారని సమాచారం.


సముద్రపు నీటిలో నవరాత్రి బొమ్మలు

వడపళని, న్యూస్‌టుడే: నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సముద్రంలోపల నీటిలో బొమ్మల ప్రదర్శన ఏర్పాటైంది. వీజీపీకి చెందిన కళాకారుల బృందం సముద్ర జీవరాశులకు హాని కలగకుండా బొమ్మలను అలంకరించారు. 50 రకాలైన బొమ్మలను ఏడు వరుసల్లో అలంకరించారు. దీనిని తమిళనాడు పర్యాటక మంత్రి ఎం.మదివానన్‌ ప్రారంభించారు. సముద్రపు నీటిలో బొమ్మలు పాడవకుండా అమర్చడం ఇదే మొదటిసారని వీజీపీ గ్రూపు సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్‌ రవిదాస్‌ పేర్కొన్నారు.


జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ లేకుండా భారత పటం!
థరూర్‌ మేనిఫెస్టోలో ఫొటోపై దుమారం

దిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన శశి థరూర్‌ శుక్రవారం విడుదల చేసిన తన మేనిఫెస్టోలో భారతదేశ పటాన్ని తప్పుగా చూపించడంతో తీవ్ర దుమారం చెలరేగింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శాఖలు విస్తరించి ఉన్నతీరును తెలియజేసేలా ఓ పటాన్ని ఆయన చూపించారు. అందులో జమ్మూ-కశ్మీర్‌, లద్దాఖ్‌ ప్రాంతాలు లేకపోవడం కలకలం సృష్టించింది. థరూర్‌ తీరుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన థరూర్‌.. బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తప్పును సరిదిద్దుకొని.. సరైన పటాన్ని తిరిగి మేనిఫెస్టోలో పొందుపరిచారు.


40 వేల దిగువకు క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కొత్తగా 3,947 కేసులు నమోదయ్యాయని, 18 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,45,87,307కు, మరణాల సంఖ్య 5,28,629కి చేరినట్లు వెల్లడించింది. క్రియాశీలక కేసులు 39,583కు తగ్గినట్లు పేర్కొంది. రికవరీ రేటు 98.73 శాతానికి పెరిగిందని వివరించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 1.23 శాతం, వారంవారీ పాజిటివిటీ రేటు 1.44 శాతంగా ఉన్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 218.52 కోట్ల టీకా డోసులు వేసినట్లు తెలిపింది.


ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జమ్మూ-కశ్మీర్‌ ఆర్మీ ర్యాలీలో విధ్వంసానికి కుట్ర

శ్రీనగర్‌: సైనికుల నియామక ర్యాలీ ‘అగ్నివీర్‌’ను లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నించిన ఇద్దరు జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులను ఎదురుకాల్పుల్లో భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జమ్మూ-కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదులు ఉన్నారని నిఘా విభాగం అందించిన సమాచారం మేరకు ఉదయం యెడిపొర ప్రాంతంలో భద్రతా దళాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారని ఉత్తర కశ్మీర్‌ జిల్లా ఎస్పీ రయీస్‌ భట్‌ తెలిపారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారని పేర్కొన్నారు. అగ్నివీర్‌ ర్యాలీలోచేరే యువకులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్రపన్నారని తెలిపారు.


దేశద్రోహం కేసులో షర్జిల్‌ ఇమామ్‌కు బెయిల్‌

దిల్లీ: దేశద్రోహం కేసులో 31 నెలల పాటు కస్టడీలో ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి షర్జిల్‌ ఇమామ్‌కు శుక్రవారం దిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 2019లో నిందితుడు చేసిన ప్రసంగాల కారణంగా జామియా నగర్‌లో అల్లర్లు జరిగాయన్నది పోలీసుల అభియోగం. ఈ కేసులో ఊరట లభించినా.. షర్జిల్‌ జైల్లోనే గడపాల్సి ఉంటుంది. దిల్లీ అల్లర్లకు సంబంధించి మరో 2 కేసుల్లో అతనికి ఇంకా బెయిల్‌ లభించలేదు.


కోర్టు ఉన్నది మీ ప్రచారం కోసం కాదు
ఈవీఎంలపై వ్యాజ్యం కొట్టివేత

దిల్లీ: కోర్టు ఉన్నది ఎవరు పడితే వాళ్లు వచ్చేసి ప్రచారం పొందడానికి కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈవీఎంలపై మధ్యప్రదేశ్‌ జనవికాస్‌ పార్టీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేస్తూ జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల వ్యవస్థను 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఎన్నికల కమిషన్‌ పర్యవేక్షిస్తుందని, ఈవీఎంలు కొన్ని దశాబ్దాలుగా వాడుకలో ఉన్నాయని తెలిపింది. ఈ పార్టీ పిటిషన్‌ను గతంలో మధ్యప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసింది. ఎన్నికల ఫలితాలతో రాని గుర్తింపు.. వ్యాజ్యాలు వేయడం ద్వారా తెచ్చుకోవాలని ఈ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఉందని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. పిటిషనర్‌కు రూ.50వేల జరిమానా విధించారు.


భారత మత్స్యకారులను అరెస్టు చేసిన పాక్‌

ఇస్లామాబాద్‌: అక్రమంగా తమ సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారంటూ భారత్‌కు చెందిన 16 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అరెస్టు చేసింది. వారి నుంచి రెండు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. వీటిని కరాచీ రేవుకు తరలించినట్లు వెల్లడించారు. అరెస్టయిన మత్స్యకారులను అక్కడి పోలీసులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.


దేశమంతటా ఏకరూప మనోవర్తి విధానం ఉండాలి
సుప్రీంలో భాజపా నాయకురాలు షాజియా ఇల్మీ పిటిషన్‌

దిల్లీ: విడాకులు పొందిన మహిళలకు మత, వైయక్తిక చట్టాల(పర్సనల్‌ లా)తో ప్రమేయం లేని ఏకరూప మనోవర్తి విధానాన్ని రూపొందించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ అంశంలో దేశమంతటికీ వర్తించేలా ప్రామాణీకరించిన ఏకరూప ఉమ్మడి స్మృతి(యూసీసీ) ఉండాలని భాజపా నాయకురాలు షాజియా ఇల్మీ తన పిటిషన్‌లో అభిలషించారు. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ జె.కె.మహేశ్వరీల ధర్మాసనం ముందుకు శుక్రవారం ఈ వ్యాజ్యం రాగా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఉన్న ఇదే తరహా పిటిషన్లతో జత చేస్తున్నట్లు న్యాయమూర్తులు తెలిపారు. భారత రాజ్యాంగం, అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా... లింగ, మత భేదాలకు తావివ్వని, దేశ పౌరులందరికీ ఏకరూప మనోవర్తి, వారసత్వ, దత్తత, వివాహ వయసు, విడాకుల విధానం ఉండాలంటూ న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ 2020లో అయిదు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలంటూ సెప్టెంబరు 5న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు వారాల గడువునిచ్చింది.

జనాభా నియంత్రణపై నోటీసులిచ్చేందుకు నిరాకరణ

జనాభా పెరుగుదలను నియంత్రించడం కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సమాజంలో ఎల్లప్పుడూ కొన్ని వివాదాలు తలెత్తుతుంటాయని, వాటన్నిటినీ పరిష్కరించుకోవడం కోసం నేరుగా కోర్టులను ఆశ్రయించడం తగదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ జె.బి.పార్ధివాలా ధర్మాసనం తెలిపింది. ఈ అంశంపై దృష్టి సారించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి సూచించడం జరిగిందని, అంతటితో న్యాయస్థానం బాధ్యత పూర్తయ్యిందన్నారు. ఈ పిటిషన్‌పై ఒక దశలో విచారణను ముగిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అయితే, అక్టోబరు 11వ తేదీకి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని