నగరాలు దేశ గమ్యాన్ని రూపొందిస్తాయి

‘మరో పాతికేళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు నగరాలే దోహదం చేస్తాయి. దేశ గమ్యాన్ని ఇవి రూపొందిస్తాయి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల గుజరాత్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని రెండోరోజు శుక్రవారం అహ్మదాబాద్‌ నగర ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

Published : 01 Oct 2022 06:05 IST

వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని

అహ్మదాబాద్‌: ‘మరో పాతికేళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారేందుకు నగరాలే దోహదం చేస్తాయి. దేశ గమ్యాన్ని ఇవి రూపొందిస్తాయి’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రెండు రోజుల గుజరాత్‌ రాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని రెండోరోజు శుక్రవారం అహ్మదాబాద్‌ నగర ర్యాలీలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాలానుగుణంగా జంట నగరాలను కూడా అభివృద్ధి చేయాలన్నారు. తొలుత గాంధీనగర్‌ - ముంబయి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సెమీ - హైస్పీడ్‌ రైలుకు మోదీ పచ్చజెండా ఊపారు. ఆ తర్వాత అహ్మదాబాద్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. ఉదయం 10.30 గంటలకు గాంధీనగర్‌లో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును జెండా ఊపి ప్రారంభించిన మోదీ.. అదే రైలెక్కి అహ్మదాబాద్‌ దాకా (దాదాపు 30 కి.మీ.) ప్రయాణించారు. ఈ ప్రయాణంలో రైల్వే ఉద్యోగుల కుటుంబాలు, మహిళా పారిశ్రామికవేత్తలు, యువతతో ప్రధాని ముచ్చటించారు. అహ్మదాబాద్‌ నగరంలోని కాలుపుర్‌ రైల్వేస్టేషనులో దిగిన ప్రధాని థల్‌తేజ్‌ - వస్త్రల్‌ మెట్రో రైలు ప్రాజెక్టు మొదటిదశను ప్రారంభించారు. ఆ తర్వాత గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో కలిసి థల్‌తేజ్‌ స్టేషను దాకా మెట్రో రైలులోనూ ప్రధాని ప్రయాణించారు.

దేశంలో మూడో వందేభారత్‌ రైలు

గుజరాత్‌, మహారాష్ట్ర రాజధాని నగరాల మధ్య నడిచే ఈ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు దేశంలో మూడవది. గతంలో న్యూదిల్లీ - వారణాసి మార్గంలో తొలి రైలును.. న్యూదిల్లీ - శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా మార్గంలో రెండో వందేభారత్‌ రైలును ప్రారంభించారు.


అంబులెన్సుకు దారి కోసం రోడ్డు పక్కన ఆగిన కాన్వాయ్‌

హ్మదాబాద్‌లో ర్యాలీ ముగిసిన అనంతరం గాంధీనగర్‌లోని రాజ్‌భవన్‌కు మోదీ బయలుదేరారు. మార్గమధ్యంలో 85 ఏళ్ల వృద్ధ రోగిని తీసుకువెళుతున్న అంబులెన్సుకు దారి ఇచ్చేందుకుగాను ప్రధాని కాన్వాయ్‌ రోడ్డు పక్కన కాసేపు ఆగింది. ఈ అసాధారణ సంఘటన తాలూకు వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. గుండెపోటుతో బాధపడుతున్న  వ్యక్తిని తాము క్షేమంగా ఆసుపత్రికి చేర్చినట్లు 108 అంబులెన్సు పైలట్‌ అర్జున్‌ పాలా ‘ఈటీవీ భారత్‌’కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని