ఈ శతాబ్దం మనదే..

‘ఇప్పుడు నడుస్తున్నది భారత్‌ శతాబ్దమ’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాల ఫలాలను చేజార్చుకున్న దేశం..ప్రస్తుత ఆధునిక సమాచార సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు దానికి నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 02 Oct 2022 06:55 IST

ప్రపంచంలోనే అత్యంత చౌకగా డేటానందిస్తున్నాం

పల్లెల్లోనూ వినియోగం పెరుగుతోంది

5జీ సేవల ప్రారంభ కార్యక్రమంలో ప్రధాని మోదీ

ఈనాడు, దిల్లీ: ‘ఇప్పుడు నడుస్తున్నది భారత్‌ శతాబ్దమ’ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తొలి మూడు పారిశ్రామిక విప్లవాల ఫలాలను చేజార్చుకున్న దేశం..ప్రస్తుత ఆధునిక సమాచార సాంకేతిక విప్లవాన్ని అందిపుచ్చుకోవడంతో పాటు దానికి నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

దిల్లీలోని ప్రగతి మైదాన్‌లో శనివారం నిర్వహించిన 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌లో ‘5జీ టెక్నాలజీ సేవల’ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన పారిశ్రామిక దిగ్గజాలను, సాంకేతిక నిపుణులనుద్దేశించి ప్రసంగించారు. ‘5జీ అనంతమైన అవకాశాలకు వారధి. 2జీ, 3జీ, 4జీ సాంకేతికతలు అందుబాటులోకి వచ్చినప్పుడు ఇతర దేశాలపై ఆధారపడింది. 5జీ సేవల ప్రారంభ సమయంలో సొంత పరిజ్ఞానాన్ని ఉపయోగించి టెలికాం ప్రపంచం ముందు సరికొత్త ప్రమాణాలను ఉంచుతోంద’ని మోదీ తెలిపారు.

అతిపెద్ద విజయం డిజిటల్‌ ఇండియా
‘డిజిటల్‌ ఇండియా అన్నది కేవలం ప్రభుత్వ పథకం కాదు. దేశాభివృద్ధికి సంబంధించిన పెద్ద విజన్‌ అది. సాంకేతికతను ప్రజల వద్దకు తీసుకెళ్లి వారి జీవితాలను సులభతరం చేయడమే దీని లక్ష్యం. 2014వరకు 100% మొబైల్స్‌ని దిగుమతి చేసుకొన్న దేశం మనది. మేం అధికారంలోకి వచ్చాక ప్రోత్సాహకాలివ్వడంతో మొబైల్‌ తయారీ పరిశ్రమల సంఖ్య 200కి మించింది. ఫోన్ల తయారీలో ప్రపంచంలో రెండో స్థానానికి చేరాం. ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. ఎనిమిదేళ్ల క్రితం దేశంలో బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులు 6 కోట్ల మంది కాగా ఇప్పుడు వారి సంఖ్య 80 కోట్లకు మించింది. ఇంటర్నెట్‌ కనెక్షన్లు 25 కోట్ల నుంచి 85 కోట్లకు చేరాయి. ఆప్టికల్‌ ఫైబర్‌ కనెక్షన్‌ ఉన్న గ్రామ పంచాయతీల సంఖ్య 100 నుంచి 1.70 లక్షలకు చేరింది. ‘అందరికీ ఇంటర్నెట్‌’ లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోంది. ఒకప్పుడు ఉన్నత వర్గాలకే పరిమితమైన డిజిటల్‌ లావాదేవీలను ఇప్పుడు నిరుపేదలూ చేయగలుగుతున్నారు. ప్రపంచంలో చౌకైన డేటా మన దేశంలోనే లభిస్తోంది. ఇదివరకు ఒక జీబీ డేటా ధర రూ.300 ఉండేది. ఇప్పుడది రూ.10కి లభిస్తోంది. ప్రతి వ్యక్తీ నెలకు 14 జీబీ డేటా సగటున ఉపయోగిస్తున్నారు. 2014లో దీని ధర నెలకు రూ.4,200 కాగా ఇప్పుడది రూ.125కి లభిస్తోంది. అంటే ప్రతి ఒక్కరికీ డేటాపై నెలకు రూ.4వేలు ఆదా అవుతోంది. మా ప్రభుత్వ ప్రయత్నాల వల్లే ఇది సాధ్యమైంది. 5జీలో ప్రతి భారతీయుడికి ఒక అవకాశం, ఒక సవాల్‌, ఒక కల, ఒక సంకల్పం దాగి ఉంది. అందువల్ల 5 రోజుల పాటు జరిగే ఈ మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రదర్శించే 5జీ టెక్నాలజీని యువత అంతా వచ్చి చూడాల’ని మోదీ పిలుపునిచ్చారు.

తొలుత ప్రధాని మోదీ 5జీ టెక్నాలజీ స్టాల్స్‌ని సందర్శించి సాంకేతికతను అడిగి తెలుసుకున్నారు. రిలయన్స్‌ జియోఛైర్మన్‌ ఆకాశ్‌ అంబానీ...ఆయనకు జియో 5జీ సేవల సామర్థ్యం గురించి వివరించారు. వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని స్వీడన్‌లో వాహనాన్ని నడిపి ఆధునిక సాంకేతిక విశిష్టతను పరీక్షించారు. వర్చువల్‌, 3డీ విధానంలో పలు రాష్ట్రాల విద్యార్థులతో మాట్లాడారు.

కార్యక్రమంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా కంపెనీల అధిపతులు ముఖేష్‌ అంబానీ, సునీల్‌ మిత్తల్‌, కుమార మంగళం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

13 నగరాల్లో 5జీ సేవలు
మన దేశంలో తొలుత 13 నగరాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అందులో హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చండీగఢ్‌, చెన్నై, దిల్లీ, గాంధీనగర్‌, గురుగ్రామ్‌, జామ్‌నగర్‌, కోల్‌కత్తా, లఖ్‌నవూ, ముంబయి, పుణేలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని