పుదుచ్చేరిలో తీవ్రమవుతున్న విద్యుత్తు సమ్మె

విద్యుత్తుశాఖ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా ఆ శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెతో పుదుచ్చేరిలో పరిస్థితి రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆదివారానికి సమ్మె అయిదో రోజుకు చేరింది.

Published : 03 Oct 2022 06:12 IST

విద్యుత్తు శాఖ ప్రైవేటీకరణపై ఉద్యోగుల నిరసనలు

సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో అవస్థలు

విధులకు హాజరుకాకుంటే ఎస్మా ప్రయోగం: తమిళిసై

పారామిలటరీ దళాలు రానున్నాయి: హోంమంత్రి నమశ్శివాయం

చెన్నై, న్యూస్‌టుడే: విద్యుత్తుశాఖ ప్రైవేటీకరణ ప్రయత్నాలకు నిరసనగా ఆ శాఖ ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెతో పుదుచ్చేరిలో పరిస్థితి రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఆదివారానికి సమ్మె అయిదో రోజుకు చేరింది. మరమ్మతులు జరగక, రోజువారీ నిర్వహణ సాగక పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్తు కోత కొనసాగుతోంది. శనివారం రాత్రి పుదుచ్చేరిలోని పలు చోట్ల విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యమంత్రి రంగస్వామి, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారిక నివాసమైన రాజ్‌నివాస్‌కూ విద్యుత్తు కోత తప్పలేదు. ఉద్యమకారులు ఉప విద్యుత్తు కేంద్రాల్లో సరఫరా కనెక్షన్లను తొలగించడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే ప్రభుత్వ అధికారులు పనులు చేపట్టి, అరగంట తర్వాత సరఫరాను పునరుద్ధరించారు.

మరోవైపు విద్యుత్తు కోతలకు నిరసనగా ప్రజలు ఆందోళనలకు దిగుతున్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు పారామిలటరీ దళాలు రానున్నాయని పుదువై హోం శాఖ మంత్రి నమశ్శివాయం తెలిపారు. ఉప విద్యుత్తు కేంద్రాల్లో లైన్‌ను తొలగించినట్లు తెలియడంతో మంత్రి దాదాపు పది కేంద్రాలను పరిశీలించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. ప్రస్తుతం పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. అయిదుగురిపై పోలీసు కేసు నమోదైందన్నారు. మొత్తం 16 ఉప విద్యుత్తు కేంద్రాలు, కార్యాలయాల్లో పోలీసు భద్రత ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు. పుదుచ్చేరిలో నిరవధిక సమ్మెలో పాల్గొన్న విద్యుత్తుశాఖ సిబ్బంది తిరిగి విధులకు వెళ్లకుంటే ఎస్మా ప్రయోగం తప్పదని ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హెచ్చరించారు. సమ్మె చేయడం తప్పన్నారు. కృత్రిమ విద్యుత్తుకోత సృష్టించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని