భారత సంతతి కెన్యా దేశస్థుడిని హాజరు పరచరేం?

కెన్యా, బ్రిటన్‌లలో ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగిఉన్న భారత సంతతికి చెందిన కెన్యా పౌరుడు పెర్రీ కాన్సగ్రాను న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతోపాటు అతని వద్ద ఉన్న మైనర్‌ కుమారుడిని విడిపోయిన భార్యకు అప్పగించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.

Updated : 03 Oct 2022 06:10 IST

 ఈ విషయంలో ఏం చర్యలు తీసుకున్నారు?

సీబీఐని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

దిల్లీ: కెన్యా, బ్రిటన్‌లలో ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగిఉన్న భారత సంతతికి చెందిన కెన్యా పౌరుడు పెర్రీ కాన్సగ్రాను న్యాయస్థానంలో ప్రవేశపెట్టడంతోపాటు అతని వద్ద ఉన్న మైనర్‌ కుమారుడిని విడిపోయిన భార్యకు అప్పగించడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిందితుడికి రాజ్‌కోట్‌లో ఉన్న రెండు ఆస్తులపై ఇతరులకు ఎవరికైనా హక్కులు ఉన్నాయా? లేదా? అనేది అక్టోబరు 8వ తేదీలోపు తెలపాలంటూ అక్కడి రిజిస్ట్రార్‌ ఆఫ్‌ అష్యురెన్స్‌ను ఆదేశించింది. తన వద్ద నున్న కుమారుడిని విడిపోయిన భార్యకు అప్పగించడంలో మోసానికి పాల్పడటం, సుప్రీంకోర్టుకు హాజరవకపోవడాన్ని కోర్టు ధిక్కరణ కింద పరిగణించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు.లలిత్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహలతో కూడిన ధర్మాసనం గత జులై 11న కాన్సగ్రాను దోషిగా ప్రకటించింది. కెన్యాలోని భారత రాయబార కార్యాలయం, కేంద్ర సంస్థల సహాయాన్ని తీసుకుని కాన్సగ్రాతోపాటు అతని మైనర్‌ కుమారుడిని కోర్టులో ప్రవేశపెడతామంటూ హామీ ఇచ్చిన విషయాన్ని కోర్టు శుక్రవారం సీబీఐకి గుర్తుచేసింది. నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టడానికి సంబంధించి వివరాలను అక్టోబరు 8వ తేదీలోపు సమర్పిస్తామని సీబీఐ తరఫు న్యాయవాది రాజత్‌ నాయర్‌ కోర్టుకు విన్నవించారు. సీబీఐ అందించే నివేదికను పరిశీలించిన తరువాత ఈ కేసుకు సంబంధించిన శిక్షను ఖరారు చేస్తామంటూ సుప్రీంకోర్టు విచారణను అక్టోబరు 10వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని