మన వైమానిక దళం ఇక ప్రచండం

దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) సోమవారం భారత వాయుసేనలో చేరాయి. సియాచిన్‌, తూర్పు లద్దాఖ్‌ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో శత్రువుపై భీకరంగా విరుచుకుపడే సత్తా కలిగిన ఈ లోహవిహంగాల వల్ల మన రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది.

Updated : 04 Oct 2022 12:03 IST

అమ్ములపొదిలోకి తేలికపాటి పోరాట హెలికాప్టర్‌

దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన తేలికపాటి పోరాట హెలికాప్టర్లు (ఎల్‌సీహెచ్‌) సోమవారం భారత వాయుసేనలో చేరాయి. సియాచిన్‌, తూర్పు లద్దాఖ్‌ వంటి ఎత్తయిన పర్వత ప్రాంతాల్లో శత్రువుపై భీకరంగా విరుచుకుపడే సత్తా కలిగిన ఈ లోహవిహంగాల వల్ల మన రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుంది. కార్గిల్‌ యుద్ధంలో ఇలాంటి హెలికాప్టర్‌ అవసరాన్ని గుర్తించిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ దీన్ని అభివృద్ధి చేసింది.

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జరిగిన వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, త్రిదళాధిపతి జనరల్‌ అనిల్‌ చౌహాన్‌, వాయుసేనాధిపతి ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌధరి ఈ హెలికాప్టర్లను లాంఛనంగా వాయుసేనలో ప్రవేశపెట్టారు. ఈ లోహవిహంగానికి ‘ప్రచండ్‌’ అని రాజ్‌నాథ్‌ పేరు పెట్టారు. ఇందులో ఆయన గగనవిహారం కూడా చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమ పోరాట హెలికాప్టర్లలో ఒకటని ఆయన పేర్కొన్నారు. ఇది శత్రువుపై అత్యంత కచ్చితత్వంతో దాడి చేయగలదని తెలిపారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడంలో భారత వాయుసేన కీలక పాత్ర పోషిస్తోందన్నారు. భద్రతకు తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ఈ సందర్భంగా హెలికాప్టర్లకు జల ఫిరంగులతో వందన సమర్పణ చేశారు. అనంతరం సర్వమత ప్రార్థనలు జరిగాయి.

* ప్రచండ్‌.. గాల్లో అద్భుత విన్యాసాలు చేయగలదు. దీని ధాటికి శత్రువు అయోమయంలో పడిపోవడం ఖాయం. 16,400 అడుగుల ఎత్తులో ల్యాండింగ్‌, టేక్‌ ఆఫ్‌ కాగలదు.

* శత్రు రాడార్లను బోల్తా కొట్టించే స్టెల్త్‌ సామర్థ్యం దీని సొంతం. రాత్రిపూట, అన్నిరకాల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు. అకస్మాత్తుగా నేలకూలినా తట్టుకోగల దృఢ ల్యాండింగ్‌ గేర్‌ దీని సొంతం. 

* తొలిదశలో లద్దాఖ్‌, జమ్మూ-కశ్మీర్‌లోని అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఈ హెలికాప్టర్లను మోహరించనున్నారు.

- జోధ్‌పుర్‌

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని