భారత గగనతలంలో ‘హైడ్రామా’

భారత గగనతలంలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మన గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం ఉదయం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాసేపు కలకలం రేగింది.

Updated : 04 Oct 2022 10:06 IST

ఇరాన్‌ విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు

దాన్ని అనుసరించిన ఐఏఎఫ్‌ ఫైటర్‌ జెట్లు

చైనా వైపు వెళ్లిపోయిన విహంగం

దిల్లీ: భారత గగనతలంలో సోమవారం నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. మన గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో సోమవారం ఉదయం దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాసేపు కలకలం రేగింది. అధికారులు హుటాహుటిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. ఫైటర్‌ జెట్లు, అగ్నిమాపక యంత్రాలను రంగంలోకి దించారు. టెహ్రాన్‌ నుంచి చైనాలోని గ్వాంఘ్జుకు వెళ్తున్న మహన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో బాంబు ఉన్నట్లు లాహోర్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ) సిబ్బందికి బెదిరింపు కాల్‌ రావడంతో వారు దిల్లీ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఆ విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్‌ కావొచ్చన్న సమాచారం మేరకు విమానాశ్రయ అధికారులు అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేసి రెండు అగ్నిమాపక యంత్రాలను సిద్ధంగా ఉంచారు. భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) రంగంలోకి దించిన రెండు ఫైటర్‌ జెట్లు ఆ విమానాన్ని అనుసరించాయి. అయితే కాసేపటికే విమానం దిల్లీలో దిగడం లేదని తెలిసింది. దాన్ని జైపుర్‌ లేదా చండీగఢ్‌లో ల్యాండ్‌ చేయాలని అధికారులు పైలట్లకు సూచించారు. అయితే వారు అందుకు నిరాకరించి, భారత గగనతలం వదిలి చైనా గగనతలంలోకి వెళ్లిపోయారు. బాంబు బెదిరింపు ఉత్తిదే అని తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని