హింసాకాండకు ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయరేం?

పనిగట్టుకుని హింసాకాండకు పాల్పడిన కేసులలో ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడమనేది దేశంలో ఎన్నడూ జరగలేదని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఆమె గిరీష్‌ పటేల్‌ స్మారకోపన్యాసం చేశారు.

Published : 04 Oct 2022 04:49 IST

సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌

అహ్మదాబాద్‌: పనిగట్టుకుని హింసాకాండకు పాల్పడిన కేసులలో ప్రభుత్వాన్ని జవాబుదారీ చేయడమనేది దేశంలో ఎన్నడూ జరగలేదని సామాజిక ఉద్యమకారిణి తీస్తా సీతల్వాడ్‌ వ్యాఖ్యానించారు. ఆదివారం అహ్మదాబాద్‌లో ఆమె గిరీష్‌ పటేల్‌ స్మారకోపన్యాసం చేశారు. విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రసంగాలు, రచనలతో కొందరు వ్యక్తులు హింసాత్మక దాడులను ప్రేరేపిస్తారన్నారు. హింసా బాధితులు తమపై దాడులకు దిగినవారికి శిక్ష పడేటట్లు చేయడంలో తీవ్ర అవరోధాలను, ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సీతల్వాడ్‌ గుర్తుచేశారు. 1984, 1992, 2002లో జరిగిన అల్లర్లకు కారకులలో ఎంతమందికి శిక్షలు పడ్డాయని ప్రశ్నించారు. అల్లర్ల బాధితులు న్యాయం కోసం చేసే పోరాటంలో ఎదుర్కొనే కష్టాలు, వారికి మద్దతుగా నిలిచే పౌరులకు ఎదురయ్యే సమస్యలు అన్నీఇన్నీ కావన్నారు. సమాజాన్ని భిన్న వర్గాలుగా విభజించడంలో సామాజిక మాధ్యమాల ప్రభావం చాలా విస్తృతంగా ఉందని, అధికారంలో ఉన్న వ్యక్తులు సామాజిక మాధ్యమాలను నడిపిస్తున్నారని చెప్పారు. సమాచార సాధనాలు, సామాజిక మాధ్యమాలు కొందరు వ్యక్తులపై, ఉద్యమాలపై గురి ఎక్కుపెడుతున్నాయనీ, పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు విభజనవాద అజెండా వల్ల ముప్పును ఎదుర్కొంటున్నాయని తీస్తా హెచ్చరించారు. దళితులపై యుగాలుగా జరిగిన అత్యాచారాలకు సనాతన హిందూ ధర్మం పశ్చాత్తాపం చెందాలని అన్నందుకు, భారత్‌ను లౌకిక దేశంగా నిలపాలని ప్రబోధించినందుకు గాంధీజీని హతమార్చారని తీస్తా ఆరోపించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని