UP: రూ.45 చోరీ.. 24 ఏళ్లకు తీర్పు.. 4 రోజుల శిక్ష..

ఇదేదో సరదాగా రాసింది కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కేసు డైరీ సంక్షిప్త రూపమిది. ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 దొంగతనం చేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది.

Updated : 05 Oct 2022 07:09 IST

నేరం జరిగిన తేదీ: 1998 ఏప్రిల్‌ 17
చోరీ అయిన సొమ్ము: రూ.45.  విచారణ సమయం: 24 ఏళ్లు
తీర్పు వెలువడిన తేదీ: 2022 సెప్టెంబర్‌ 28
శిక్షా కాలం: 4 రోజులు

దేదో సరదాగా రాసింది కాదు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ కేసు డైరీ సంక్షిప్త రూపమిది. ఓ వ్యక్తి జేబులో నుంచి రూ.45 దొంగతనం చేసిన కేసులో ఏకంగా 24 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడింది. నేరం తానే చేశానని అంగీకరించిన వృద్ధుడికి న్యాయస్థానం 4 రోజుల జైలు శిక్ష విధించింది. 1998 ఏప్రిల్‌ 17న ఉత్తర్‌ప్రదేశ్‌ మైన్‌పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాథం పోలీసులకు ఓ ఫిర్యాదు చేశాడు. లైన్‌గంజ్‌ దగ్గర తన జేబులోని రూ.45ను ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్‌ అనే వ్యక్తి కాజేశాడని అందులో పేర్కొన్నాడు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గరున్న రూ.45ను స్వాధీనం చేసుకున్నారు. మైన్‌పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాలతో 1998 ఏప్రిల్‌ 18న మన్నన్‌ను జైలుకు పంపారు. విచారణ ఖైదీగా జైలులో 2 నెలల 21 రోజులు ఉన్న మన్నన్‌ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడు. కొంతకాలానికి పోలీసులు అభియోగ పత్రం సమర్పించారు. విచారణకు హాజరు కావాలని కోర్టు నుంచి సమన్లు వెళ్లినా నిందితుడికి అందలేదట. మరోవైపు, ఎలాగైనా ఈ కేసు నుంచి బయటపడాలని భావించిన మన్నన్‌ గత నెల 28న కోర్టులో హాజరై నేరాన్ని అంగీకరించాడు. దీంతో న్యాయమూర్తి అతనికి నాలుగు రోజుల జైలు శిక్ష విధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని