విద్యుత్‌ సబ్సిడీ పథకంపై విచారణ

ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై దిల్లీ లెఫ్టినెంట్‌(ఎల్‌జీ) గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా విచారణకు ఆదేశించారు.

Published : 05 Oct 2022 05:53 IST

దిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ షాక్‌
గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలోనే అడ్డంకులు: కేజ్రీవాల్‌

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం అందిస్తున్న విద్యుత్‌ సబ్సిడీ పథకంలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలపై దిల్లీ లెఫ్టినెంట్‌(ఎల్‌జీ) గవర్నర్‌ వినయ్‌ కుమార్‌ సక్సేనా విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేష్‌కుమార్‌ ఈ వ్యవహారంపై విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు ఎల్‌జీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. దిల్లీ విద్యుత్‌ నియంత్రణ కమిషన్‌ 2018లో ఆదేశించినట్లు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా వినియోగదారులకు విద్యుత్‌ సబ్సిడీ అందించకపోవడంపైనా విచారణ జరపాలని ప్రధాన కార్యదర్శిని ఎల్‌జీ కోరారు. అయితే, గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలోనే.. తమ ఉచిత విద్యుత్‌ పథకంపై బురద చల్లేందుకు కేంద్రంలోని భాజపా సర్కారు ఇలా చేస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. ప్రభుత్వ విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుకు సంబంధించి డిస్కంల నుంచి రూ.21,200 కోట్ల బకాయిలను వసూలు చేసుకోవడానికి బదులు, సబ్సిడీలతో వాటిని సర్దేశారన్నది దిల్లీ ప్రభుత్వంపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఆలస్యంగా చెల్లించినందుకు వినియోగదారుల నుంచి 18% సర్‌ఛార్జి వసూలుచేసిన దిల్లీ ప్రభుత్వం.. తాను మాత్రం విద్యుదుత్పత్తి కంపెనీలకు 12 శాతమే చెల్లిస్తోందని, దీంతో డిస్కంలకు ఏకంగా రూ.8,500 కోట్ల లాభం వచ్చిందన్నది ఆరోపణల సారాంశం.


ఆపేది లేదు: కేజ్రీవాల్‌

మ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్‌ పథకానికి అడ్డంకులు కలిగించాలన్నదే భాజపా ధ్యేయమని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోపించారు. గుజరాత్‌ ప్రజల్లో తమ పథకానికి మంచి ఆదరణ కనిపిస్తోందని, అందుకే దిల్లీలో దాన్ని ఆపాలని భాజపా యత్నిస్తోందని అన్నారు. కానీ, ఉచిత విద్యుత్తును ఎట్టి పరిస్థితుల్లో ఆపేది లేదని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని