Shashi tharoor: నన్ను పోటీ నుంచి తప్పించాలని చూశారు: శశిథరూర్‌

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొనేలా తనను ఒప్పించాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కొందరు నాయకులు కోరారని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ వెల్లడించారు.

Updated : 05 Oct 2022 07:22 IST

తిరువనంతపురం: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకొనేలా తనను ఒప్పించాలని పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కొందరు నాయకులు కోరారని కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌ వెల్లడించారు. పురాతనమైన పార్టీ లబ్ధి పొందాలంటే ఎన్నికల్లో పోటీ ఉండడమే మేలని రాహుల్‌ ఆ నేతలకు బదులిచ్చారని ఆయన చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కేరళకు వచ్చిన ఆయన తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. పార్టీ అధ్యక్ష పదవికి ఒకరికంటే ఎక్కువమంది పోటీ పడాలని గత పదేళ్లుగా రాహుల్‌ గాంధీ చెబుతున్నారని, అదే విషయాన్ని ఆయన మరోసారి గుర్తుచేశారని చెప్పారు. ఈ క్రమంలోనే తాను బరిలో కొనసాగాలని ఆయన ఆకాంక్షించినట్లు థరూర్‌ తెలిపారు. పెద్ద నాయకుల మద్దతును తాను ఎన్నడూ ఆశించలేదని, కార్యకర్తలు మాత్రం తాను పోటీలో ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల బరి నుంచి వైదొలగి తనను ఇంతవరకు బలపరుస్తున్నవారిని వంచించలేనని తేల్చిచెప్పారు. తనపై వారికి ఉన్న విశ్వాసమే తనను ముందుకు నడిపిస్తోందన్నారు. ఎవరు ఎవరికి ఓటు వేశారనేది తెలిసే అవకాశం లేదనీ, అంతా రహస్య బ్యాలెట్‌ పత్రం ప్రకారం జరుగుతుందని వివరించారు. పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు సహా పలువురు నాయకులు ఆయా పదవుల్లో కొనసాగుతూ ఈ ఎన్నికల్లో ఎవరి పక్షానా ప్రచారం చేయకూడదని ఏఐసీసీ స్పష్టం చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని