పర్వతారోహకులపై హిమపంజా

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం భారీ హిమపాతంలో చిక్కి 10 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు.

Published : 05 Oct 2022 05:53 IST

ఉత్తరకాశీలో 10 మంది దుర్మరణం
24 మంది ఆచూకీ కోసం గాలింపు

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో మంగళవారం భారీ హిమపాతంలో చిక్కి 10 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. ద్రౌపదీ కా డాండా - 2 పర్వత శిఖరంపై ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. నెహ్రూ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటనీరింగ్‌ (ఎన్‌ఐఎం)కు చెందిన శిక్షకులు, శిక్షణ పొందుతున్న పర్వతారోహకులు మొత్తం 42 మందితో కూడిన బృందం కిందికి దిగుతున్న సమయంలో ఈ ప్రమాదంలో చిక్కుకొన్నట్లు ఎన్‌.ఐ.ఎం. ప్రిన్సిపల్‌ కల్నల్‌ అమిత్‌ బిష్త్‌ తెలిపారు. ఉదయం 8.45 గంటల ప్రాంతంలో జరిగిన ఈ దుర్ఘటనలో పదిమంది మృతిచెందగా, ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకొన్నట్లు ఉత్తరాఖండ్‌ డీజీపీ అశోక్‌కుమార్‌ వెల్లడించారు. ఈ బృందంలోని 8 మందిని తమ సిబ్బంది కాపాడినట్లు ఉత్తరకాశీ విపత్తుల నిర్వహణ అధికారి దేవేంద్ర పట్వాల్‌ తెలిపారు. ఇంకా 24 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మొత్తం నాలుగు బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్‌ ధామి ట్వీట్‌ చేశారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో ఫోనులో మాట్లాడిన సీఎం సహాయక చర్యల్లో ఆర్మీ సాయం కోరారు. భూమికి 14 వేల అడుగుల ఎత్తులో పర్వతారోహకులు ప్రమాదానికి గురి కాగా.. మిగిలినవారి కోసం భారత వాయుసేనకు చెందిన రెండు చీతా హెలికాప్టర్లతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా కురుస్తున్న మంచుతో ఈ చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు