గర్బా నృత్యంపై దాడి.. ఏడుగురికి గాయాలు

గుజరాత్‌లోని ఖేడ జిల్లాలో ఉంధేలా గ్రామంలో జరుగుతున్న గర్బా నృత్య కార్యక్రమంపై ముస్లిం వర్గానికి చెందిన ఓ గుంపు చేసిన దాడిలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు.

Published : 05 Oct 2022 06:13 IST

అదుపులో 13 మంది.. గుజరాత్‌లో ఘటన

ఖేడ (గుజరాత్‌): గుజరాత్‌లోని ఖేడ జిల్లాలో ఉంధేలా గ్రామంలో జరుగుతున్న గర్బా నృత్య కార్యక్రమంపై ముస్లిం వర్గానికి చెందిన ఓ గుంపు చేసిన దాడిలో ఏడుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ మేరకు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఓ దేవాలయం ఆవరణలో గర్బా నృత్యం చేస్తున్న బృందంపై సుమారు 150 మంది పెద్ద ఎత్తున రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై కేసు నమోదైన వెంటనే 13 మంది దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో కొందరిని స్థానికులు కర్రలతో చితకబాదారు. ఘటన నేపథ్యంలో భారీగా పోలీసులను గ్రామంలో మోహరించారు. ‘‘గ్రామానికి చెందిన సర్పంచ్‌ స్థానిక దేవాలయంలో గర్బా నృత్య కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానిని అడ్డుకోవడానికి  ముస్లిం వర్గానికి చెందిన ఓ గుంపు రాళ్ల వర్షం కురిపించింది. దీంతో రక్షక దళ్‌ జవాను, ఓ పోలీసు సహా ఏడుగురు గాయపడ్డారు’’ అని స్థానిక డీసీపీ వీఆర్‌ బాజ్‌పాయ్‌ వివరించారు.


మధ్యప్రదేశ్‌లో మండపంపై రాళ్లు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని మందసౌర్‌ జిల్లాలో సుర్జాని గ్రామంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో గర్బా మండపంపై కొందరు రాళ్లు విసిరిన ఘటన ఆదివారం జరిగింది. దీంతో నలుగురు గాయపడ్డారు. ఈ వ్యవహారానికి సంబంధించి 19 మందిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు  వెల్లడించారు. నిందితుల్లో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క అక్రమ నిర్మాణాలని తేలడంతో నిందితుల్లో ముగ్గురికి చెందిన 4,500 చదరపు గజాల విస్తీర్ణం గల, రూ.4.5 కోట్ల విలువ చేసే గృహాలను రెవెన్యూ విభాగం సహాయంతో కూల్చివేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts