దగ్గు సిరప్‌ ప్రాణాలు తీసింది

ఆఫ్రికా దేశమైన గాంబియాలో విషాదం చోటుచేసుకొంది. దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా... మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Updated : 07 Oct 2022 06:51 IST

భారత్‌లో తయారైన మందు వాడకంతో 66 మంది చిన్నారుల మృతి
గాంబియాలో తీవ్ర విషాదం
ఈ ఔషధాలను నిలిపివేయాలంటూ డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బంజుల్‌, జెనీవా, దిల్లీ: ఆఫ్రికా దేశమైన గాంబియాలో విషాదం చోటుచేసుకొంది. దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా... మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. పలువురు చిన్నారుల్లో కిడ్నీలు దెబ్బతినడానికీ ఇవే కారణమని తెలిపింది. ప్రొమెథాజైన్‌ ఓరల్‌ సొల్యూషన్‌, కొఫెక్స్‌మలిన్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాకోఫ్‌ బేబీ కాఫ్‌ సిరప్‌, మాగ్రిప్‌ ఎన్‌ కోల్డ్‌ సిరప్‌లుగా వీటిని పేర్కొంది. ఈ మందుల సరఫరా, వినియోగాన్ని తక్షణమే నిలిపివేయాలని ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసింది. మరోవైపు- దగ్గు, జలుబు సిరప్‌లను వాడొద్దంటూ గాంబియా ప్రభుత్వం ఇంటింటి ప్రచారం మొదలుపెట్టింది. రెడ్‌క్రాస్‌ సంస్థ ఇందుకు సహకరిస్తోంది.

ఇవి కలుషితం.. నాసిరకం: అధనోమ్‌

గాంబియా విషాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ మీడియాతో మాట్లాడారు. చిన్నారుల మరణం తీవ్రంగా కలచివేసిందన్నారు. దీనిపై విచారణ ప్రారంభించినట్టు చెప్పారు. ‘‘ఈ నాలుగు సిరప్‌లను ప్రస్తుతానికి గాంబియాలోనే గుర్తించాం. నాణ్యతలేని, కలుషితమైన ఈ మందులు ఇతర దేశాలకూ సరఫరా అయి ఉండొచ్చు. మరింత నష్టం జరగకుండా వీటి సరఫరాను తక్షణమే నిలిపివేయాలని అన్ని దేశాలకూ సూచించాం. ఈ సిరప్‌లను ప్రయోగశాలల్లో పరీక్షించగా... ప్రమాదకర స్థాయుల్లో డైథిలిన్‌ గ్లైకాల్‌, ఇథిలీన్‌ గ్లైకాల్‌ ఉన్నట్టు తేలింది. సిరప్‌ల నాణ్యత, భద్రతకు సంబంధించి మైడెన్‌ ఫార్మాస్యూటికల్‌ సంస్థ ఎలాంటి హామీ ఇవ్వలేదు’’ అని అధనోమ్‌ చెప్పారు. డబ్ల్యూహెచ్‌వో ఆరోపణలపై మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ ఇంతవరకూ స్పందించలేదు.

రంగంలోకి సీడీఎస్‌సీవో...

గాంబియాలో చిన్నారులు మరణించడంపై భారత డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాను ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం చేసింది. కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) రంగంలోకి దిగింది. డ్రగ్స్‌ కారణంగా చిన్నారులు ఎలా మరణించారు? ఆ సిరప్‌ల లోగోలు, తయారీ వివరాలు ఏమిటి? అన్నది డబ్ల్యూహెచ్‌వో ఇంతవరకూ తమతో పంచుకోలేదని సీడీఎస్‌సీవో వర్గాలు చెప్పాయి.


భారత్‌లో వాటి విక్రయానికి అనుమతి లేదు

హరియాణా మంత్రి

మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ తయారుచేసిన దగ్గు, జలుబు సిరప్‌లు ఎగుమతికి మాత్రమే అనుమతి పొందాయని; వాటిని భారత్‌లో విక్రయించడానికి, మార్కెటింగ్‌ చేయడానికి వీల్లేదని హరియాణా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్‌ విజ్‌ తెలిపారు. ఈ ఔషధాలను కోల్‌కతాలోని సెంట్రల్‌ డ్రగ్స్‌ లేబొరేటరీ పరీక్షించనుందని, అవసరమైన శాంపిళ్లను ఇప్పటికే పంపామని ఆయన తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో తయారైన సిరప్‌ల కారణంగానే గాంబియాలో చిన్నారులు మృతిచెందారన్న విషయమై తమకు కచ్చితమైన సమాచారం లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ అంశం కాబట్టి, కేంద్ర ప్రభుత్వమే దీన్ని పరిశీలిస్తుందని వ్యాఖ్యానించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని