సంక్షిప్త వార్తలు(13)

దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీని పాఠ్యాంశంగా చేర్చాలని యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ సూచించారు.

Updated : 07 Oct 2022 07:04 IST

అన్ని కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీ పాఠాలు: యూజీసీ

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్నత విద్యాసంస్థలు నిర్వహించే అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో సైబర్‌ సెక్యూరిటీని పాఠ్యాంశంగా చేర్చాలని యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌ కుమార్‌ సూచించారు. ‘సైబర్‌ సెక్యూరిటీ దివస్‌’ సందర్భంగా గురువారం సాయంత్రం నిర్వహించిన వెబ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. ఈ పాఠ్యాంశాల బోధన కోసం అన్ని విద్యాసంస్థలు సైబర్‌ సెక్యూరిటీ, కంప్యూటర్‌, ఐటీ నిపుణులను నియమించుకోవాలన్నారు. ఏ అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చాలో సూచిస్తూ ఒక కరపుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు.


జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ నేతృత్వంలో పీఎఫ్‌ఐ నిషేధంపై ట్రైబ్యునల్‌

దిల్లీ: పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నిషేధానికి సంబంధించి చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేంద్రం.. ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసింది. దీనికి దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దినేశ్‌ కుమార్‌ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు న్యాయ మంత్రిత్వశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.


చిత్రవార్త


 

కోల్‌కతాలో అత్యవసరంగా దిగిన టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం

కోల్‌కతా: ఇస్తాంబుల్‌ నుంచి సింగపూర్‌ వెళ్తున్న టర్కిష్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం గురువారం అత్యవసరంగా కోల్‌కతా విమానాశ్రయంలో దిగింది. లోహవిహంగం గాల్లో ఉండగా ఓ 69 ఏళ్ల వృద్ధుడొకరికి ముక్కు, నోటి నుంచి రక్తం కారడంతో విమానాన్ని అర్ధంతరంగా ఉదయం 11.45 గంటలకు దించాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు. బాధితుడికి విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అందించి ఆపై స్థానిక ఆసుపత్రికి తరలించారు. దీంతో మిగిలిన ప్రయాణికులతో ఆ విమానం మధ్యాహ్నం 2.52 గంటలకు సింగపూర్‌కు బయలుదేరింది.


‘ఆదిపురుష్‌ చిత్రాన్ని నిషేధించాలి’

అయోధ్య: ప్రముఖ నటుడు ప్రభాస్‌ నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ను తక్షణం నిషేధించాలని అయోధ్య రామాలయ ప్రధానార్చకుడు సత్యేంద్ర దాస్‌ బుధవారం డిమాండ్‌ చేశారు. ఇటీవల విడుదల చేసిన ఆ సినిమా టీజర్‌లో రాముడు, హనుమంతుడు, రావణుడి పాత్రలను వారి గౌరవానికి భంగం కలిగేలా తప్పుగా చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘మైనారిటీ’ హోదా పిటిషన్‌పై విచారణ

దిల్లీ: అల్పసంఖ్యాకులు నిర్వహిస్తున్నారన్న కారణంతో విద్యాసంస్థకు మైనారిటీ హోదా ఇవ్వలేమంటూ అలహాబాద్‌ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఉత్తర్‌ప్రదేశ్‌(యూపీ) ప్రభుత్వం, జాతీయ మైనారిటీ విద్యాసంస్థల కమిషన్‌, జాతీయ వైద్య కమిషన్‌లకు నోటీసులు జారీ చేసింది.

సర్వీసు ఛార్జీలపై మీ వైఖరేంటి?: ఆహార బిల్లులపై సర్వీస్‌ ఛార్జీ వసూలుపై సెంట్రల్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ(సీసీపీఏ) దాఖలు చేసిన ప్రమాణపత్రానికి 2 వారాల్లో స్పందించాలని హోటల్‌, రెస్టారెంట్‌ యజమానుల సంఘానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

వృద్ధుల సంక్షేమానికి ఏం చేస్తున్నారు?: వృద్ధుల కోసం చేపడుతోన్న సంక్షేమ కార్యక్రమాలపై జిల్లాల వారీగా నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


కశ్మీర్‌లో పారదర్శకంగా ఎన్నికలు: అమిత్‌ షా

బారాముల్లా: జమ్మూకశ్మీర్‌ ప్రజలతో, ఇక్కడి యువతతో మాట్లాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఆసక్తితో ఉందని హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. ఓటర్ల జాబితా ప్రక్రియను ఎన్నికల సంఘం పూర్తి చేసిన వెంటనే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహిస్తామని భరోసానిచ్చారు. జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తున్న ఆయన బారాముల్లా జిల్లాలోని షౌకత్‌ అలీ స్టేడియంలో బుధవారం నిర్వహించిన సభలో ప్రసంగించారు. ‘పాకిస్థాన్‌తో చర్చలు జరపాలని కొందరు చెబుతున్నారు. ఆ దేశంతో మనం ఎందుకు చర్చలు జరపాలి? అది జరగని పని. మేం బారాముల్లా ప్రజలతో మాట్లాడతాం. జమ్మూకశ్మీర్‌ ప్రజలతో మాట్లాడతాం’అని అమిత్‌ షా అన్నారు.


అంబానీ కుటుంబానికి మరో బెదిరింపు కాల్‌

ముంబయి: రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుటుంబానికి మరోసారి బెదిరింపులు వచ్చాయి. ఆయనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తానంటూ రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి ఓ గుర్తుతెలియని దుండగుడు ఫోన్‌ చేశాడు. హాస్పిటల్‌ ల్యాండ్‌లైన్‌ నంబరుకు బుధవారం మధ్యాహ్నం 12.57 గంటలకు ఓ గుర్తు తెలియని ఫోన్‌ నుంచి కాల్‌ వచ్చిందని ముంబయి పోలీసులు తెలిపారు. ముకేశ్‌ అంబానీ, ఆయన భార్య నీతా, కుమారులు ఆకాశ్‌, అనంత్‌లను హతమారుస్తానని, ఆసుపత్రితోపాటు వారి నివాస గృహం అంటిలియానూ పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడని పోలీసులు వెల్లడించారు. ఇందుకు సంబంధించి బిహార్‌లోని దర్భాంగాలో నిందితుడు రాకేశ్‌ కుమార్‌ మిశ్రను ముంబయి పోలీసులు అరెస్టు చేశారు.


ఉత్తర్‌కాశీ హిమపాతం ఘటన.. మరో 12 మృతదేహాల వెలికితీత

దేహ్రాదూన్‌: ఉత్తర్‌కాశీ హిమపాతం దుర్ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. గురువారం 12 మంది పర్వతారోహకుల మృతదేహాలను సహాయ బృందాలు వెలికితీశాయి. వీటిలో 14 భౌతికకాయాలు శిక్షణ పొందుతున్నవారివని, మరో రెండు శిక్షకులవని నెహ్రూ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మౌంటైనీరింగ్‌(ఎన్‌ఐఎం) వెల్లడించింది. ఇంకా 15 మంది గల్లంతయ్యారని పేర్కొంది.


24 రాష్ట్రాల్లో భారత్‌ సిరీస్‌తో వాహనాల రిజిస్ట్రేషన్‌ అమలు

దిల్లీ: దేశ వ్యాప్తంగా వాహనదారులు నిరాటంకంగా ప్రయాణించడానికి వీలుకల్పించే భారత్‌ (బీహెచ్‌)- సిరీస్‌తో వాహన రిజిస్ట్రేషన్‌ విధానం 24 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతోందని రవాణా అభివృద్ధి మండలి(టీడీసీ) వెల్లడించింది. ఇప్పటి వరకూ 20వేలకు పైగా వాహనాల రిజిస్ట్రేషన్‌ ఈ విధానంలో జరిగిందని తెలిపింది. దీనివల్ల వాహన యజమానులు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి లేదా కేంద్ర ప్రాంతానికి మారినప్పుడు వారి వాహనాలకు మళ్లీ అక్కడ రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు.


రూ.కోటి లంచం కేసులో డీజీఎఫ్‌టీపై సీబీఐ కేసు

దిల్లీ: నూట పద్దెనిమిది కోట్ల రూపాయల మోసం కేసులో ఓ వ్యాపారవేత్త నుంచి రూ.కోటి లంచం తీసుకున్న ఆరోపణలపై జాయింట్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌(డీజీఎఫ్‌టీ) శంభాజీ ఏ చవాన్‌పై సీబీఐ గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. డిప్యూటీ డీజీఎఫ్‌టీ ప్రకాశ్‌ ఎస్‌ కాంబ్లే, వ్యాపారి రమేశ్‌ మనోహర్‌ చవాన్‌పైనా అభియోగాలు మోపింది. ఈ మేరకు అధికారులు తెలిపారు.


ముందస్తు బెయిల్‌ పిటిషన్లు మనీ రికవరీ ప్రొసీడింగ్స్‌ కావు: సుప్రీం

దిల్లీ: ముందస్తు బెయిల్‌ పిటిషన్లు ‘మనీ రికవరీ ప్రొసీడింగ్స్‌’ కావనీ... ఈ ఉపశమనం కోసం బాధితురాలికి మధ్యంతర పరిహారం చెల్లించాలని నిందితులకు షరతు విధించడం అన్యాయమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. భార్యాభర్తల వివాదం కేసులో- భర్త, అతని కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్‌ కోరుతూ ఝార్ఖండ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ముగ్గురికి బెయిల్‌ మంజూరుచేసిన న్యాయస్థానం.. ఒక్కొక్కరూ రూ.25 వేల పూచీకత్తు, బాధితురాలికి రూ.7.5 లక్షల మధ్యంతర నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. దీంతో బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ బేలా త్రివేదిల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టింది. ఝార్ఖండ్‌ హైకోర్టు ఆదేశాల్లో మార్పులు చేసింది. ముందస్తు బెయిల్‌ నిమిత్తం నిందితులు రూ.25 వేల చొప్పున పూచీకత్తు సమర్పించాలని పేర్కొంది. పిటిషన్‌దారుకు రూ.7.5 లక్షల మధ్యంతర పరిహారం చెల్లించాలన్న ఆదేశాన్ని రద్దు చేస్తున్నట్టు తెలిపింది.


వాహనం పైపులో 23 కిలోల బంగారం అక్రమ రవాణా

దిల్లీ: మయన్మార్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న రూ.11.65 కోట్ల విలువైన 23 కిలోల బంగారాన్ని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు ఈశాన్య ప్రాంత సరిహద్దులో స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగుర్ని అరెస్ట్‌ చేశారు. అధికారుల సమాచారం ప్రకారం.. గత నెల 28-29న డీఆర్‌ఐ అధికారులు శిలిగుడి- గువాహటి ప్రాంతంలో ఆపరేషన్‌ చేపట్టారు. ఆ సమయంలో రెండు అనుమానిత వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు. వాహనం లోపలి భాగంలో 23 కిలోల బంగారాన్ని 21 భాగాలు చేసి దాచినట్లు గుర్తించారు. వాహనం వెనుక భాగంలో ఉన్న రెండు చక్రాలను కలిపే మెటల్‌ పైపు లోపల బంగారాన్ని దాచినట్లు తేలింది.


కొచ్చిలో రూ.200 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

కొచ్చి, ముంబయి: కేరళలోని కొచ్చి తీరంలో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ, ఇండియన్‌ నేవీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించి ఇరాన్‌ నుంచి వచ్చిన ఓ పడవలో రూ.200 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పడవలో ఉన్న ఆరుగురు విదేశీ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారిలో ఇరాన్‌తోపాటు పాకిస్థాన్‌కు చెందిన వారు ఉన్నట్లు తెలుస్తోంది.


ముంబయిలో రూ.100 కోట్ల డ్రగ్స్‌ సీజ్‌

మహారాష్ట్రలోని ముంబయి విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు 16 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మలావి నుంచి వస్తున్న ఓ ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న ఈ సరకు విలువ రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న ఘనాకు చెందిన మరో మహిళనూ డీఆర్‌ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.


Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని