సంక్షిప్త వార్తలు(9)

భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో దిల్లీ మంత్రి రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది.

Updated : 08 Oct 2022 06:12 IST

మత మార్పిడి వివాదంలో ఆప్‌ మంత్రి రాజేంద్ర పాల్‌

పదవి నుంచి తొలగించాలని భాజపా, వీహెచ్‌పీ డిమాండ్‌

దిల్లీ: భారీ సంఖ్యలో హిందువులు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తున్న కార్యక్రమంలో దిల్లీ మంత్రి రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ పాల్గొనడంపై తీవ్ర వివాదం ముసురుకుంది. మతం మారుతున్న వ్యక్తులు హిందూ దేవుళ్లు, దేవతలను దూషిస్తున్నట్లుగా ఉన్న వీడియో దృశ్యాలు శుక్రవారం వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యక్రమం మంత్రి నేతృత్వంలో జరగడం తీవ్ర ఆక్షేపణీయమంటూ భాజపా, వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌతమ్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆప్‌ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు. కేజ్రీవాల్‌ ప్రభుత్వంలో గౌతమ్‌ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.  దసరా రోజున(ఈ నెల 5న) దిల్లీలోని కరోల్‌ బాగ్‌లో నిర్వహించిన మత మార్పిడి కార్యక్రమంలో దాదాపు పది వేల మంది పాల్గొన్నారు. వీరు హిందూ మతాన్ని వీడి బౌద్ధాన్ని స్వీకరించారు. కులం, అస్పృశ్యత నిర్మూలనకు పాటుపడతామని ప్రతిజ్ఞ చేశారు. అదే రోజు ఈ దృశ్యాలను గౌతమ్‌ ట్విటర్‌లో పోస్టు చేశారు.మంత్రి రాజేంద్ర పాల్‌ గౌతమ్‌ హిందువుల మనోభావాలను గాయపరిచేలా వ్యాఖ్యలు చేశారని భాజపా జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్‌ భాటియా ఆరోపించారు. మత మార్పిడిపై అభ్యంతరం లేదని, అయితే, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా దేవతలను దూషించడం ఆమోదయోగ్యం కాదని వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సల్‌ తెలిపారు. భాజపా, వీహెచ్‌పీ ఆరోపణలను మంత్రి గౌతమ్‌ తోసిపుచ్చారు.


చిత్రవార్త


విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పించాలి
‘విద్య 4.0 ఇండియా’ నివేదిక వెల్లడి

దిల్లీ: పాఠశాల విద్యార్థి ఓ నిపుణుడైన ఉద్యోగిగా మారే ప్రక్రియ భారత్‌లో పలు అడ్డంకులను ఎదుర్కొంటోందని ‘విద్య 4.0 ఇండియా’ శీర్షికతో ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) వెలువరించిన నివేదిక పేర్కొంది. నాలుగో పారిశ్రామిక విప్లవ సాంకేతికతలు.. అభ్యసనాన్ని ఎలా మెరుగుపరచగలవో, విద్యాపరమైన అసమానతలను ఎలా తొలగించగలవో ఈ నివేదిక ఏకరవు పెట్టింది. 2020 మే నెలలో ప్రారంభమైన ‘విద్య 4.0’ పథకం కింద 40 ఆధునిక విద్యా సాంకేతిక సంస్థలు, అంకుర సంస్థలు, ప్రభుత్వ, విద్యాలయాలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. డబ్ల్యూఈఎఫ్‌, ఐక్యరాజ్యసమితి బాలల విద్యా నిధి (యూనిసెఫ్‌), యువా (జనరేషన్‌ అన్‌ లిమిటెడ్‌ ఇండియా) సంస్థలు సమష్టిగా ‘విద్య 4.0 ఇండియా’ నివేదికను వెలువరించాయి. డిజిటల్‌, ఇతర ఆధునిక సాంకేతికతలు విద్యాపరమైన అసమానతలను ఎలా తొలగించగలవో నివేదిక వివరించింది. భారత్‌లో 6 కోట్ల మందికి పైగా సెకండరీ, హయ్యర్‌ సెకండరీ విద్యార్థులు ఉన్నప్పటికీ, 85 శాతం పాఠశాలలు తమ పాఠ్య ప్రణాళికల్లో వృత్తి విద్యా కోర్సులను ముఖ్య భాగం చేయలేకపోయాయని తెలిపింది. ఎప్పటికప్పుడు మారిపోతున్న ఉపాధి విపణిలో విద్యార్థులను ఉద్యోగాలకు సన్నద్ధులను చేయడాన్ని ‘పాఠశాల నుంచి పనికి రూపాంతరీకరణ’గా వ్యవహరిస్తున్నారు. శిక్షకుల కొరత, అరకొర వనరులు, వసతులు, స్థానికంగా అందుబాటులో ఉన్న నిపుణ ఉద్యోగాలకు వృత్తి విద్య ద్వారా విద్యార్థులను సన్నద్ధం చేయలేకపోవడం వంటి సమస్యలు పాఠశాల నుంచి పని ప్రక్రియకు అడ్డుతగులుతున్నాయి.

ప్రాధాన్యం దక్కని వృత్తి విద్య

వృత్తి విద్యకు విద్యార్థులు, తల్లిదండ్రులు ద్వితీయ ప్రాధాన్యం ఇవ్వడం పెద్ద లోపమని ‘విద్య 4.0 ఇండియా’ నివేదిక పేర్కొన్నది. విద్యార్థులు పనిలో రాణించే నైపుణ్యాలను అలవర్చుకోవాలనీ, మంచి సంభాషణా నైపుణ్యం, జట్టుగా పనిచేసే స్వభావం, సమస్యా పరిష్కార శక్తి, విమర్శనాత్మక ఆలోచనా శక్తిని పెంపొందించుకోవాలని కంపెనీలు ఆశిస్తాయి. సంప్రదాయ విద్య నుంచి వృత్తి విద్యకు మారడం విద్యార్థులకు కష్టమైపోతోందని నివేదిక తెలిపింది. ఈ అడ్డంకిని తొలగించి ఇంటర్న్‌ షిప్‌, అప్రెంటిస్‌ షిప్‌ అవకాశాలను కల్పించాలని సిఫార్సు చేసింది. స్టెమ్‌ కోర్సులు, భాషా నైపుణ్యం, జీవితంలో రాణించడానికి తోడ్పడే నైపుణ్యాలను విద్యార్థులకు అందించాలని సూచించింది.


రైల్వే నియామకాల కుంభకోణంలో లాలూ, రబ్రీపై అభియోగపత్రం

దిల్లీ: రైల్వే ఉద్యోగాల కుంభకోణానికి సంబంధించి ఆ శాఖ మాజీ మంత్రి లాలూప్రసాద్‌, ఆయన భార్య రబ్రీదేవి, మరో 14 మందిపై సీబీఐ శుక్రవారం అభియోగపత్రాన్ని దాఖలు చేసింది. ఈ కేసులో ఉద్యోగ నియామకాలకు ప్రతిగా లాలూ కుటుంబసభ్యులు లేదా వారికి సంబంధించిన సంస్థలకు అభ్యర్థుల నుంచి ఉచితంగా లేదా తక్కువ ధరకు భూములు అందాయని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. అభియోగపత్రంలో లాలూ కుమార్తె మీసా భారతి, మధ్య రైల్వే మాజీ జీఎం సౌమ్య రాఘవన్‌, మాజీ సీపీవో కమల్‌దీప్‌ తదితరుల పేర్లనూ పేర్కొంది. పట్నాలో లాలూ క్యాంపు కార్యాలయం నుంచి హార్డ్‌ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఆయన రైల్వే మంత్రిగా పనిచేసినప్పుడు నియమితులైన 1,458 మంది అభ్యర్థుల పేర్లు అందులో ఉన్నాయని వివరించింది.


ముగ్గురు రిజిస్ట్రార్లను మాతృశాఖలకు తిప్పిపంపిన సీజేఐ

దిల్లీ: డిప్యుటేషన్‌పై వచ్చి సుప్రీంకోర్టులో సేవలందిస్తున్న ముగ్గురు రిజిస్ట్రార్లను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ యు.యు.లలిత్‌ వారి మాతృశాఖలకు/ కేడర్‌కు తిప్పి పంపించారు. దీనికి సంబంధించి విడివిడిగా ఆదేశాలు జారీ అయ్యాయని సర్వోన్నత న్యాయస్థాన వర్గాలు వెల్లడించాయి. దిల్లీ హయ్యర్‌ జ్యుడీషియరీకి చెందిన రాజేశ్‌ గోయెల్‌ గత ఆరేడేళ్లుగా సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా ఉన్నారు. ఆయనను న్యాయాధికారిగా తిరిగి మాతృశాఖకు పంపించారు. తొలుత సుప్రీంకోర్టు అదనపు రిజిస్ట్రార్‌గా, ఆ తర్వాత రిజిస్ట్రార్‌గా నియమితులైన ప్రసన్నకుమార్‌ సూర్యదేవరకు ఆలిండియా రేడియోకు తిరిగి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. గత నాలుగేళ్లుగా సుప్రీంకోర్టు సాధారణ పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన న్యాయాధికారి అవనిపాల్‌ సింగ్‌ కూడా మాతృశాఖకు తిరిగి వెళ్లనున్నారు. రిజిస్ట్రార్‌ దీపక్‌ జైన్‌ సుప్రీంకోర్టులోని మరో శాఖకు బదిలీ అయ్యారు.


ఎఫ్‌ఐఆర్‌ ప్రతి కోసం హైకోర్టులో పీఎఫ్‌ఐ కార్యకర్త పిటిషన్‌

దిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తనను ఎందుకు అరెస్టు చేసిందో తెలపాలని, తనపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రతిని ఇవ్వాలని కోరుతూ ఇస్లామిక్‌ సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) కార్యకర్త, న్యాయవాది మహమ్మద్‌ యూసుఫ్‌ దిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని విచారించిన ధర్మాసనం తమ స్పందన తెలపాలని ఎన్‌ఐఏను ఆదేశించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం కింద సెప్టెంబరు 22న చెన్నైలో మహమ్మద్‌ యూసుఫ్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. తనతోపాటు వివిధ రాష్ట్రాల్లో మరో 200 మందిని అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. దీని ప్రతితో పాటు ప్రతి కార్యకర్త అరెస్టుకు కారణాలేమిటో వివరించాలని కోరుతూ యూసుఫ్‌ పిటిషన్‌లో కోరారు. ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. పీఎఫ్‌ఐకి ఐసిస్‌ వంటి అంతర్జాతీయ ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయంటూ కేంద్రం ఆ సంస్థను అయిదేళ్లపాటు నిషేధిస్తూ సెప్టెంబరు 28న ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.


అంగన్‌వాడీల్లో ఆహారం నాణ్యంగా ఉండాలి
కేంద్ర మహిళాశిశు అభివృద్ధి శాఖ ఉత్తర్వులు

ఈనాడు, దిల్లీ: గర్భిణులు, చిన్నారులకు అంగన్‌వాడీల్లో అందించే ఆహార పదార్థాలన్నీ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం 2006లోని నిబంధనల ప్రకారం ఉండాలని కేంద్ర మహిళాశిశు అభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈమేరకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర ప్రభుత్వ జనరల్‌ ఫైనాన్షియల్‌ రూల్స్‌-2017, విజిలెన్స్‌ మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రాలు ఆహార పదార్థాలను పారదర్శక పద్ధతిలో సేకరించాలని నిర్దేశించింది. గర్భిణులు, చిన్నారులకు అందించే ఆహార పదార్థాల నమూనాలను ఏడాదిలో కనీసం ఒక్కసారైనా పరీక్షించాలని నిర్దేశించింది. ఇంటికి ఇచ్చే రేషన్‌ (టేక్‌ హోం రేషన్‌)ను భారత ఆహార భద్రత, ప్రమాణాల సాధికార సంస్థ ద్వారా కానీ, నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డ్‌ వద్ద పేర్లు నమోదు చేసుకున్న ప్రయోగశాలల ద్వారా కానీ పరీక్షింపజేయాలని పేర్కొంది. అంగన్‌వాడీ కేంద్రాలకు ఆహార వస్తువుల స్టాక్‌ అందిన వెంటనే అక్కడి ఉద్యోగులు వాటి నమూనాలను ర్యాండంగా తీసుకొని అధీకృత ప్రయోగశాలల్లో పరీక్షింపజేయాలని సూచించింది. ఒకవేళ భోజనం వండి వడ్డిస్తున్నట్లయితే ఆ వంటశాల పరిశుభ్రంగా, రక్షిత మంచినీటి సౌకర్యంతో ఉండాలని పేర్కొంది.


శివలింగాకృతికి కాల నిర్ణయ పరీక్ష అభ్యర్థనపై స్పందన తెలపండి
జ్ఞానవాపి మసీదు కమిటీకి కోర్టు ఆదేశం

వారణాసి: కాశీలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణం లోపల శివలింగాకృతిలో ఉన్న నిర్మాణానికి కాల నిర్ణయ పరీక్ష(కార్బన్‌-డేటింగ్‌) నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థనపై స్పందనేమిటో తెలియజేయాలని అంజుమన్‌ ఇంతెజమియా మసీదు కమిటీని వారణాసి కోర్టు శుక్రవారం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. మే 16వ తేదీన నిర్వహించిన సర్వే సందర్భంగా మసీదు ప్రాంగణంలోని వాజూఖానాలో శివలింగాకృతిలో ఉన్న ఓ నిర్మాణాన్ని గుర్తించారు. హిందూ పిటిషనర్లు ఆ ఆకృతిని శివలింగమని పేర్కొంటుండగా....మసీదు కమిటీ ఫౌంటెయిన్‌గా అభివర్ణించడంతో జ్ఞానవాపి-శృంగార్‌ గౌరి కేసులో అదీ ఓ భాగమయ్యింది. శివలింగం ఎప్పటిదో తేల్చేందుకు కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించాలని పిటిషనర్లు కోర్టును అభ్యర్థించారు.


కొత్తగా 1,997 కొవిడ్‌ కేసులు

దిల్లీ: దేశంలో గత 24 గంటల్లో (శుక్రవారం ఉదయం 8 గంటల వరకు) కొత్తగా 1,997 మంది కరోనా బారిన పడగా.. 9 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 4,46,06,460కి చేరగా.. మహమ్మారి బారినపడి ఇంతవరకు 5,28,754 మంది ప్రాణాలు కోల్పోయారు.


బహిరంగ శిక్షలపై గుజరాత్‌ ప్రభుత్వానికి నోటీసులు  

అహ్మదాబాద్‌: గుజరాత్‌లో పోలీసులు కొందరు యువకులకు బహిరంగంగా శిక్ష అమలు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి, డీజీపీకి ఓ స్వచ్ఛంద సంస్థ (మైనారిటీ కోఆర్డినేషన్‌ కమిటీ/ఎంసీసీ) లీగల్‌ నోటీసులు ఇచ్చింది. ఖేడ్‌ జిల్లా ఉంధేలా గ్రామ ఆలయం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన గర్బా నృత్య ప్రదర్శనపై రాళ్లు రువ్విన కొందరు యువకులను విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టినట్లున్న వీడియో వైరల్‌ అయింది. ఈ నేపథ్యంలో ఎంసీసీ పై మేరకు స్పందించింది. ఈ ఘటనపై విచారణకు గుజరాత్‌ డీజీపీ ఆదేశించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని