తమిళనాడులో ఆన్‌లైన్‌ జూదంపై నిషేధం

విద్యార్థులు, యువతలో తీవ్ర దుష్ప్రభావాల్ని కలిగించి, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్‌లైన్‌ జూదాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది.

Published : 08 Oct 2022 04:05 IST

చెన్నై, న్యూస్‌టుడే: విద్యార్థులు, యువతలో తీవ్ర దుష్ప్రభావాల్ని కలిగించి, వారిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న ఆన్‌లైన్‌ జూదాన్ని తమిళనాడు ప్రభుత్వం నిషేధించింది. ఈ విషయమై ప్రభుత్వ ప్రతిపాదనకు తమిళనాడు గవర్నర్‌ రవి ఆమోదం తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్‌ విడుదల చేసింది. ‘మానసికంగా ఇబ్బంది కలిగించే జూదం ఏ రూపంలో ఉన్నా దానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆన్‌లైన్‌ జూదం రాష్ట్ర అభివృద్ధికి ఆటంకంగా మారింది. చాలా కుటుంబాలు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాయి. దీర్ఘకాలంలో ఇది రాష్ట్ర జనాభాపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదముంది. దీనివల్ల పాఠశాల విద్యార్థులు తమ నైపుణ్యాల్ని కోల్పోతున్నారు. ఈ దుష్ప్రభావాలపై హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్‌ కె.చంద్రు నేతృత్వంలో నియమించిన కమిటీ పలు కీలక ప్రతిపాదనల్ని ప్రభుత్వానికి అందించింది. పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిర్వహించిన సర్వేలో వచ్చిన ఫలితాల్లో నష్టాలు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. వీరి సూచనల మేరకు ఆన్‌లైన్‌ జూదాన్ని నిషేధిస్తున్నాం’ అని తమిళనాడు ప్రభుత్వం గెజిట్‌లో ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని