China: చైనాకు నేరుగా విమానాలు ఇప్పట్లో కష్టమే!

భారత్‌-చైనా మధ్య నేరుగా విమాన సేవలు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడంలేదు. ఇప్పటికీ కొవిడ్‌-19 కేసుల విషయంలో ఆ దేశం కఠిన నిబంధనలు పాటిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుతున్నారు.

Updated : 12 Oct 2022 07:19 IST

 కొవిడ్‌-19 నిబంధనలు సడలించే యోచన లేని బీజింగ్‌

అక్కడ చదువుతున్న 23 వేల మంది భారతీయ విద్యార్థులపై ప్రభావం

బీజింగ్‌: భారత్‌-చైనా మధ్య నేరుగా విమాన సేవలు ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడంలేదు. ఇప్పటికీ కొవిడ్‌-19 కేసుల విషయంలో ఆ దేశం కఠిన నిబంధనలు పాటిస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. దాదాపు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనాలో చదువుతున్నారు. కొవిడ్‌-19 ప్రారంభం నుంచి చైనా వీసాలను బ్యాన్‌ చేయడంతో విద్యార్థులంతా భారత్‌లోనే ఉండిపోయారు. అక్కడ పనిచేస్తున్న భారతీయుల కుటుంబాలు సైతం ఇబ్బందులు పడుతున్నాయి. చైనా ఇటీవల వీసా బ్యాన్‌ని ఎత్తివేయడంతో.. విద్యార్థులు  తిరిగి చైనా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నేరుగా విమాన సౌకర్యం లేకపోవడంతో హాంకాంగ్‌, ఇతర దేశాల మీదుగా వెళ్లాల్సి వస్తోంది. ఆయా సర్వీసులకు తీవ్ర డిమాండ్‌ నెలకొనడంతో ప్రయాణం ఆర్థికంగా తీవ్ర భారంగా మారింది. ఇలా వెళ్లే వారంతా చైనాలో మళ్లీ వారం రోజులు కొవిడ్‌-19 క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నెల 16 నుంచి బీజింగ్‌లో పాలక కమ్యూనిస్ట్‌ పార్టీ 20వ కాంగ్రెస్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల అనంతరం సైతం ‘జీరో కొవిడ్‌ పాలసీ’లో చైనా మార్పులు తెచ్చే యోచనలో లేదని పరిశీలకులు చెబుతున్నారు. దీంతో భారత్‌ నుంచి నేరుగా పరిమిత సంఖ్యలోనైనా విమాన సర్వీసుల పునరుద్ధరణపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం దక్షిణాసియా ప్రాంతంలోని నేపాల్‌, శ్రీలంక, పాకిస్థాన్‌ సహా పలు దేశాల నుంచి చైనాకు పరిమిత సంఖ్యలో షరతులకు లోబడి విమానాలు నడుస్తున్నాయి. చైనాలో దిగాక ఎవరైనా కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలితే.. ఆయా దేశాలకు కొంతకాలం పాటు విమాన సర్వీసులను చైనా నిలిపివేస్తోంది. విమానయాన సంస్థలకు ఈ షరతు ఇబ్బందికరంగా మారింది. భారత్‌-చైనా అధికారుల చర్చల్లోనూ ఈ అంశం ప్రతిబంధకంగా మారింది. ప్రస్తుతం భారత్‌ నుంచి చైనా వెళ్లే ప్రయాణికులకు ఆ దేశ రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించి అనుమతిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని