EPFO: ఈపీఎఫ్‌వో పింఛను పెంపునకు అడ్డుచక్రం

ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కనీస పింఛను ప్రస్తుతం ఉన్న రూ.1000 నుంచి మరికొంత పెంచేందుకు కార్మికశాఖ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తిరస్కరించింది.

Updated : 04 Nov 2022 12:40 IST

కార్మికశాఖ ప్రతిపాదనకు ఆర్థికమంత్రి తిరస్కరణ

దిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) కనీస పింఛను ప్రస్తుతం ఉన్న రూ.1000 నుంచి మరికొంత పెంచేందుకు కార్మికశాఖ పంపిన ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ తిరస్కరించింది. ఇందుకు గల కారణాలు తెలపాలని ఆర్థికశాఖను పార్లమెంటరీ స్థాయీ సంఘం వివరణ కోరనుంది. కార్మికశాఖ ఎంతమేర పెంచాలని సిఫార్సు చేసిందనే విషయం మాత్రం వెల్లడి కాలేదు. ఈపీఎఫ్‌ పింఛను పథకం, కార్పస్‌ఫండ్‌ నిర్వహణకు సంబంధించి బిజూ జనతా దళ్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ముందు గురువారం కార్మిక మంత్రిత్వశాఖకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కనీస పింఛను మొత్తం పెంపునకు  కార్మికశాఖ చేసిన సిఫార్సులకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలుపలేదని కమిటీకి వారు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తిరస్కారానికి గల కారణాలపై ఆర్థిక మంత్రిత్వశాఖ ఉన్నతాధికారులను వివరణ కోరాలని కమిటీ నిర్ణయించింది. ఈపీఎఫ్‌ చందాదారులకు ఇప్పుడు ఇస్తున్న రూ.వెయ్యి పింఛను ఎంతమాత్రం సరిపోదని, ఆ మొత్తాన్ని పెంచాలని కార్మిక మంత్రిత్వశాఖకు ఈ ఏడాది మొదట్లో కమిటీ సూచించింది. ఈ మేరకు ఆర్థిక మంత్రిత్వశాఖకు కార్మికశాఖ సిఫార్సు చేయగా.. అట్నుంచి తిరస్కారం ఎదురైంది. కనీస పింఛను పెంపు కోసం దేశంలో లక్షలాది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని