దేశవ్యాప్తంగా 20 వేల స్కూళ్ల మూత

దేశంలో ఒక ఏడాది కాలానికి 20,000కు పైగా స్కూళ్లు మూతపడ్డాయని, ఉపాధ్యాయుల సంఖ్యలోనూ 1.95 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.

Updated : 04 Nov 2022 06:28 IST

టీచర్ల సంఖ్యలో 1.95% తగ్గుదల  
  కేంద్ర విద్యాశాఖ 2021-22 నివేదిక 

దిల్లీ: దేశంలో ఒక ఏడాది కాలానికి 20,000కు పైగా స్కూళ్లు మూతపడ్డాయని, ఉపాధ్యాయుల సంఖ్యలోనూ 1.95 శాతం తగ్గుదల నమోదైనట్లు కేంద్ర విద్యాశాఖ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పాఠశాల విద్య తీరుతెన్నులపై 2021-22 కాలానికిగాను ఏకీకృత జిల్లా విద్యాసమాచార విధానం (యూడైస్‌+)పై విడుదల చేసిన ఈ నివేదిక 44.85 శాతం స్కూళ్లకు మాత్రమే కంప్యూటర్‌ సౌకర్యం ఉన్నట్లు తెలిపింది. దాదాపు 34% స్కూళ్లకు ఇంటర్నెట్‌ వసతి ఉంది. ‘2020-21లో మొత్తం పాఠశాలల సంఖ్య 15.09 లక్షలు ఉండగా, 2021-22 నాటికి ఇది 14.89 లక్షలకు తగ్గింది. ఎక్కువగా ప్రయివేటు యాజమాన్యాల పరిధిలోని స్కూళ్లు మూతపడ్డాయి’ అని గురువారం విడుదల చేసిన నివేదిక పేర్కొంది. విద్యార్థుల చేరికపై కొవిడ్‌ ప్రభావం గురించి వివరిస్తూ.. ‘ఈ మహమ్మారి ప్రభావం బాగా ఉంది. ఎక్కువగా యువత, ప్రీ ప్రైమరీ తరగతులకు చెందిన దుర్బల చిన్నారులపై దీని ప్రభావం మెండు’ అని వివరించింది. కొవిడ్‌-19 కారణంగా ప్రవేశాలను వాయిదా వేయడం ఈ క్షీణతకు కారణంగా అంచనా వేశారు. 2021-22లో ప్రాథమిక స్థాయి నుంచి ప్రాథమికోన్నత పాఠశాలల్లోకి ప్రవేశాలు దాదాపు 25.57 కోట్ల మేర ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థుల నమోదులో పెరుగుదల ఆశాజనక అంశంగా చెప్పవచ్చు. ప్రైమరీ నుంచి హయ్యర్‌ సెకండరీ విద్యకు వెళ్లిన బాలికల సంఖ్య 12.29 కోట్లు. 2020-21తో పోల్చితే 8.19 లక్షలు పెరిగారు.

* దేశంలో 2020-21 ఏడాదిలో ఉపాధ్యాయుల సంఖ్య 97.87 లక్షలు ఉండగా.. 2021-22 నాటికి ఈ సంఖ్య 95.07 లక్షలకు తగ్గింది. ఈ తగ్గుదల ప్రభుత్వ పాఠశాలల్లో 0.9 శాతం, ప్రభుత్వ ఎయిడెడ్‌ స్కూళ్లలో 1.45 శాతంగా ఉంది. ప్రయివేటు పాఠశాలల్లో 2.94 శాతం టీచర్లు తగ్గారు. ఇతరత్రా స్కూళ్లలో ఇది 8.3% ఉంది. 2021-22లో విద్యార్థులు - ఉపాధ్యాయ నిష్పత్తి ప్రాథమిక స్థాయిలో 26 ఉండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 19, సెకండరీ స్కూళ్లలో 18, హయ్యర్‌ సెకండరీ స్కూళ్లలో 27గా ఉంది.

* ప్రత్యేక అవసరాల విద్యార్థుల కోసం 27 శాతం స్కూళ్లలో మాత్రమే ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 49 శాతానికి పైగా పాఠశాలలకు రెయిలింగుతో కూడిన ర్యాంపులు ఉన్నాయి. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఈ నివేదిక అధ్యయనంలో పాఠశాలల గ్రంథాలయాల్లో పుస్తక లభ్యత, సహ అభ్యాసం తదితర అంశాల అదనపు సమాచారం కూడా సేకరించారు.

ఉన్నత ప్రదర్శన రాష్ట్రాల్లో ఏపీ

కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ ప్రకటించిన పెర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌ (పీజీఐ)లో 6 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతం లెవల్‌-2 దశకు చేరుకున్నాయి. లెవల్‌-1 స్థాయిలో ఒక్క రాష్ట్రం కూడా లేకపోవడం గమనార్హం. ఎల్‌-2 స్థాయికి చేరుకొన్నవాటిలో ఆంధ్రప్రదేశ్‌ సహా కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు.. చండీగఢ్‌ ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని