హత్యాచార కేసులో ఆ ముగ్గురూ నిర్దోషులు

సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది.

Updated : 08 Nov 2022 04:49 IST

వారి మరణశిక్షలు కొట్టివేత 

2012 నాటి ఘటనపై తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

దిల్లీ: సామూహిక అత్యాచార కేసులో ఉరిశిక్ష పడిన ముగ్గురు వ్యక్తులు నిర్దోషులని సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఉత్తరాఖండ్‌కు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లోని సైబర్‌సిటీలో పనిచేస్తూ దిల్లీలో నివాసం ఉండేది. 2012 ఫిబ్రవరిలో కార్యాలయం నుంచి వస్తుండగా ఇంటికి సమీపంలోనే అపహరణకు గురైంది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపారు. ముగ్గురు వ్యక్తులు ఆమెను కారులో తీసుకుపోయి, సామూహిక అత్యాచారానికి పాల్పడి, అత్యంత పాశవికంగా గాజు సీసాలతో, లోహపు వస్తువులతో చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు దానిలో వెల్లడైంది. వారిలో ఒకరి ప్రేమ ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతోనే ఒక పథకం ప్రకారం ఇదంతా చేసినట్లు తేలింది. ఛిద్రమైన స్థితిలో ఆమె మృతదేహాన్ని హరియాణాలోని ఓ పొలంలో మూడు రోజుల తర్వాత గుర్తించారు. దర్యాప్తు చేపట్టిన దిల్లీ పోలీసులు ఉత్తరాఖండ్‌కు చెందిన ముగ్గురు యువకులపై కేసు నమోదు చేశారు. దిగువ న్యాయస్థానం ఆ ముగ్గురినీ దోషులుగా తేల్చి, మరణ శిక్ష విధించింది. అప్పీలుకు వెళ్లినప్పుడు ఈ హత్యాచార ఘటనను ‘అత్యంత దారుణమైనది’గా అభివర్ణించిన హైకోర్టు.. నిందితులకు ఈ శిక్ష ఖరారు చేస్తూ 2014లో తీర్పు వెలువరించింది. దాంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వయసు, కుటుంబ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శిక్షపై తీర్పు వెలువరించాలని నిందితుల తరఫు న్యాయవాదులు కోరారు.

బతకాలని లేదన్న బాధితురాలి తల్లి

తీర్పు వినడానికి న్యాయస్థానానికి వచ్చిన బాధితురాలి కుటుంబం నిర్ఘాంతపోయింది. తమకు నోటమాట రాలేదని, పూర్తిగా ఖిన్నులమయ్యామని తెలిపింది. అపీలుకు వెళ్లి న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపింది. కేసులో ఓటమితో ఇక తమకు జీవించాలనే కోరికే లేదని బాధితురాలి తల్లి కన్నీళ్లతో చెప్పారు. 11 ఏళ్లు పోరాడి, న్యాయవ్యవస్థపై నమ్మకం కోల్పోయామని బాధితురాలి తండ్రి ఆవేదన చెందారు. తాము పేదలు కావడంతోనే ఈ విధంగా జరిగిందని విలపించారు. తీర్పును మహిళా సంఘాలు విమర్శించాయి. నిందితులకు ఇది మరింత ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నాయి. మహా అయితే మరణశిక్షను యావజ్జీవ శిక్షగా మారుస్తారని అనుకున్నామనీ, తీర్పు వెలువడుతున్నప్పుడు తన చెవుల్ని నమ్మలేకపోయానని యోగితా భయానా అనే ఉద్యమకర్త అన్నారు. మంగళవారం తదుపరి కార్యాచరణ రూపొందించుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పుతో రేపిస్టులు నైతిక బలాన్ని పొందుతారని దిల్లీ మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు స్వాతి మలివాల్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని