US Visa: భారతీయులకు ప్రతినెలా లక్ష వీసాలు

అమెరికా వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం వచ్చే 6-7 నెలల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆ దేశ రాయబార కార్యాలయం సీనియర్‌ అధికారి తెలిపారు.

Updated : 11 Nov 2022 10:03 IST

ఆ లక్ష్య సాధన దిశగా ప్రణాళికలు
నిరీక్షణ సమయాన్ని తగ్గిస్తున్నాం
అమెరికా రాయబార   కార్యాలయం వెల్లడి

దిల్లీ: అమెరికా వీసాల కోసం నిరీక్షించాల్సిన సమయం వచ్చే 6-7 నెలల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని ఆ దేశ రాయబార కార్యాలయం సీనియర్‌ అధికారి తెలిపారు. భారతీయులకు ప్రతినెలా లక్ష వీసాలను మంజూరు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. గత ఏడాది 82 వేల వీసాలివ్వగా.. వచ్చే వేసవి (జూన్‌) నాటికి 11 లక్షల నుంచి 12 లక్షల వరకు వీసాల మంజూరుకు కృషి చేస్తున్నట్లు గురువారం వెల్లడించారు. వీసాల మంజూరు విషయంలో భారత దేశమే తమ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

మంజూరు విషయంలో కొవిడ్‌కు ముందున్న పరిస్థితులను వచ్చే ఏడాది మధ్య నాటికి తీసుకురావాలనేది తమ లక్ష్యమని వివరించారు. వీసా మంజూరు, రెన్యువల్‌కు పడుతున్న సుదీర్ఘ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని సిబ్బందిని పెంచడంతో పాటు ‘డ్రాప్‌ బాక్స్‌’ విధానాన్ని అనుసరిస్తున్నట్లు చెప్పారు. డ్రాప్‌ బాక్స్‌ విధానంలో.. ఇంటర్వ్యూ లేకుండా వీసా రెన్యువల్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. నాలుగేళ్లుగా అమెరికా వీసా ఉన్నవారు ఇందుకు అర్హులు. ‘‘భారతీయులకు హెచ్‌ (హెచ్‌1బీ), ఎల్‌ కేటగిరీ వీసాల మంజూరును ప్రాధాన్య అంశంగా అమెరికా గుర్తించింది.

విద్యార్థి వీసాల జారీ సమయాన్ని.. ముఖ్యంగా రెన్యువల్‌ సమయాన్ని తగ్గించడాన్ని కూడా ప్రాధాన్యంగా పెట్టుకున్నాం. వీసా రెన్యువల్‌కు ఎదురుచూస్తున్న వారి కోసం ఇటీవల దాదాపు లక్ష స్లాట్లను విడుదల చేశాం. కొన్ని వీసాల మంజూరుకు గతంలో 450 రోజులు పడుతుండగా.. దానిని 9 నెలలకు తగ్గించాం. బీ1, బీ2 (వ్యాపారం, టూరిజం) వీసాల మంజూరు సమయాన్ని ఇంకా కుదించాం. అమెరికా వీసాలు పొందుతున్న దేశాల్లో త్వరలోనే భారత్‌ రెండో స్థానంలోకి వస్తుందని ఆశిస్తున్నాం. ప్రస్తుతం మెక్సికో, చైనా తర్వాత భారత్‌ మూడో స్థానంలో ఉంది’’ అని ఆ అధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని