క్షుణ్నంగా ఆలోచించాకే పెద్దనోట్ల రద్దు

క్షుణ్నంగా ఆలోచించిన తర్వాతే రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలనే నిర్ణయాన్ని గతంలో తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.

Published : 17 Nov 2022 07:27 IST

సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం

దిల్లీ: క్షుణ్నంగా ఆలోచించిన తర్వాతే రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయాలనే నిర్ణయాన్ని గతంలో తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. నకిలీ నోట్లు, ఉగ్ర నిధులు, నల్లధనం, పన్ను ఎగవేతలను నివారించే విస్తృత వ్యూహంతోనే 2016లో పెద్దనోట్ల చలామణీని రద్దు చేసినట్లు వివరించింది. ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంది. రిజర్వు బ్యాంకుతో విస్తృతంగా సంప్రదింపులు జరిపి, ముందస్తు ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాకే నోట్లరద్దును అమలు చేసినట్లు తెలిపింది. నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన 58 పిటిషన్లపై జస్టిస్‌ ఎస్‌.ఎ.నజీర్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌, జస్టిస్‌ బి.వి.నాగరత్నల రాజ్యాంగ ధర్మాసనం విచారణ కొనసాగిస్తోంది. దీనిపై వారం క్రితమే కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేయాల్సి ఉండగా అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ఒక వారం అదనపు సమయం కోరారు. ఆ ప్రకారం కేంద్రం తరఫున బుధవారం ప్రమాణపత్రం దాఖలు చేశారు. ‘ప్రజలకు కష్టాలు ఎదురుకాకుండా వీలైనన్ని చర్యలన్నీ తీసుకున్నాం. రైలు, బస్సు, విమాన టికెట్లు తీసుకునేందుకు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్సలకు, ఎల్పీజీ సిలిండర్ల కొనుగోలు వంటివాటికి ఆ నోట్లను వాడుకునే వెసులుబాటు కల్పించాం. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం, పన్ను చెల్లించేవారి సంఖ్యను పెంచడం వంటివి కూడా ప్రభుత్వ ఆర్థిక ఎజెండాలో భాగం’ అని దానిలో వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు