Sabarimala: శబరిమల పోలీసులకిచ్చిన మార్గదర్శకాలపై వివాదం

శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం ముద్రించిన చేతి పుస్తకం(హ్యాండ్‌బుక్‌)పై వివాదం తలెత్తడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది.

Updated : 18 Nov 2022 08:48 IST

హ్యాండ్‌బుక్‌ను ఉపసంహరించుకున్న కేరళ ప్రభుత్వం

పథనంతిట్ట: శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద విధులు నిర్వహించే పోలీసుల కోసం ముద్రించిన చేతి పుస్తకం(హ్యాండ్‌బుక్‌)పై వివాదం తలెత్తడంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వం దానిని ఉపసంహరించుకుంది. ఆలయంలోకి భక్తులను అనుమతించే విషయంలో భద్రతా సిబ్బంది అనుసరించాల్సిన మార్గదర్శకాలను తెలియజేయడం కోసం ఆ పుస్తకాన్ని రాష్ట్ర హోంశాఖ ముద్రించింది. అయితే, అందులోని ఒక నిబంధన..‘సుప్రీంకోర్టు 2018లో ఇచ్చిన తీర్పు ప్రకారం భక్తులందరికీ ఆలయంలో ప్రవేశార్హత ఉంటుంద’ని పేర్కొంది. మహిళలకు అనుమతి విషయాన్ని నేరుగా ప్రస్తావించలేదు. ఈ అంశంపైనే రాష్ట్ర భాజపా నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశంతోనే ‘అందరికీ ప్రవేశం’ సూచనను చేసిందని దుయ్యబట్టారు. వెంటనే స్పందించిన రాష్ట్ర దేవాలయాల శాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ వివరణ ఇచ్చారు. ప్రభుత్వానికి ఎలాంటి దురుద్దేశంలేదని, పాత పుస్తకాన్ని యథాతథంగా తిరిగి ముద్రించడం వల్ల ఈ అనుమానానికి తావిచ్చినట్లయ్యిందని, దానిని ఉపసంహరించుకుంటున్నామని తెలిపారు. లోపాలను సవరించి కొత్త హ్యాండ్‌ బుక్‌ను పోలీసులకు అందజేస్తామని రాష్ట్ర అదనపు డీజీపీ ఎం.ఆర్‌.అజిత్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఏడాదికి సంబంధించిన మండలం మకరవిలక్కు యాత్ర గురువారం ప్రారంభమైంది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో శబరిమలకు చేరుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు