రాజ్యాంగ మౌనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు పెదవి విరిచింది. కలవరపరిచే ధోరణిగా దాన్ని పేర్కొంది.

Published : 23 Nov 2022 05:53 IST

72 ఏళ్లయినా ఎన్నికల కమిషనర్ల నియామకంపై చట్టం చేయలేదు
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

దిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామక ప్రక్రియపై రాజ్యాంగ మౌనాన్ని ప్రభుత్వాలు తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయంటూ సుప్రీంకోర్టు పెదవి విరిచింది. కలవరపరిచే ధోరణిగా దాన్ని పేర్కొంది. ఈసీ, సీఈసీల నియామకాలకు సంబంధించి ప్రభుత్వాలు 72 ఏళ్లుగా చట్టం తీసుకురాకపోవడాన్ని ప్రశ్నించింది. సీఈసీ నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగి, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ‘‘2004 నుంచి యూపీఏ పదేళ్ల పాలనలో ఆరుగురు సీఈసీలు, ఎన్డీయే హయాంలో 8 ఏళ్లలోనే ఎనిమిది మంది సీఈసీలు మారారు. ఇది దేశాన్ని కలవరపెట్టే ధోరణి. రాజ్యాంగంలో నిర్దిష్ట నిబంధనలేమీ లేకపోవడంతో.. దాని మౌనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో చట్టమంటూ ఏదీ లేదు కాబట్టి వారు చేసింది చెల్లుబాటవుతోంది’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటు చట్టం చేయాలని రాజ్యాంగ పరిషత్‌ కోరుకుందని జస్టిస్‌ జోసెఫ్‌ పేర్కొన్నారు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 72 ఏళ్లవుతున్నా ఇప్పటికీ చట్టాన్ని తీసుకురాలేదని గుర్తుచేశారు. సీఈసీ, ఈసీల నియామకాల్లో ప్రభుత్వం ఏమైనా నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తోందో తమకు తెలియజేయాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణిని కోర్టు కోరింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.

టి.ఎన్‌.శేషన్‌ లాంటివారు కావాలి

సీఈసీ, ఈసీల సున్నితమైన భుజాలపై రాజ్యాంగం మహత్తర అధికారాలను ఉంచిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. బలమైన వ్యక్తిత్వమున్న దివంగత టి.ఎన్‌.శేషన్‌లాంటివారు సీఈసీగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు చాలామంది సీఈసీ పదవిని అలంకరించారని, కానీ టి.ఎన్‌.శేషన్‌లాంటివారు అరుదుగా వస్తుంటారని పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు