రాజకీయ ప్రభావం నుంచి సీఈసీని తప్పించాలి

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అంటే.. దేశ ప్రధానమంత్రిపై ఆరోపణలొచ్చినా చర్యలు తీసుకొనేలా ఉండాలని, అలాంటి పరిస్థితి రావాలంటే నియామక ప్రక్రియలో కేంద్ర మంత్రిమండలిని మించిన వ్యవస్థ భాగస్వామ్యంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

Published : 24 Nov 2022 05:28 IST

ప్రధానిపైనా చర్యలు తీసుకునేంత సమర్థత
ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు అవసరం
అందుకే నియామక ప్రక్రియ పారదర్శకంగా జరగాలి
ఇందుకు మంత్రిమండలిని మించిన స్వతంత్ర వ్యవస్థ అవసరం
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్యలు
అరుణ్‌ గోయల్‌ ఎంపికపైనా ప్రశ్న
ఆయన నియామక దస్త్రాలను సమర్పించాలని ఆదేశం

దిల్లీ: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ అంటే.. దేశ ప్రధానమంత్రిపై ఆరోపణలొచ్చినా చర్యలు తీసుకొనేలా ఉండాలని, అలాంటి పరిస్థితి రావాలంటే నియామక ప్రక్రియలో కేంద్ర మంత్రిమండలిని మించిన వ్యవస్థ భాగస్వామ్యంగా ఉండాలని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఎన్నికల కమిషనర్‌ బలహీనంగా ఉంటే వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకానికి కొలీజియం వంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై గత కొన్నిరోజులుగా విచారిస్తున్న జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం బుధవారం కూడా తమ విచారణను కొనసాగించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘వ్యక్తుల స్వతంత్రత గురించి కాద]ు.. వ్యవస్థల స్వతంత్రత గురించి మాట్లాడుతున్నాం. ఉదాహరణకు ప్రధానమంత్రిపైనే కొన్ని ఆరోపణలు వచ్చాయనుకుందాం. సీఈసీ చర్యలు తీసుకుంటారా.. లేదా..? తీసుకోకుండా బలహీనంగా వ్యవహరిస్తే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది. రాజకీయ ప్రభావం నుంచి సీఈసీని తప్పించాలి. స్వతంత్రంగా ఉండాలి. సొంత వ్యక్తిత్వంతో పనిచేయాలి. అందుకే నియామక ప్రక్రియలో మంత్రిమండలి కంటే మరింత పెద్ద స్వతంత్ర వ్యవస్థ ఉండాలని మేం భావిస్తున్నాం. ఈ పారదర్శకత కోసం మేం మార్గాలు అన్వేషిస్తున్నాం. ఈ వ్యవస్థను మార్చాలని గతంలో చాలా కమిటీలు చెప్పాయి, రాజకీయ పార్టీలూ గొంతు చించుకున్నాయి’’ అని ధర్మాసనం పేర్కొంది. ఇటీవల కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన అరుణ్‌ గోయల్‌ నియామకంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. ఆయన్ను ఎలా నియమించారో తెలపాలంటూ కేంద్రాన్ని కోరింది. నియామక దస్త్రాలను సమర్పించాలని ఆదేశించింది. పిటిషనర్ల తరఫున ప్రశాంత్‌భూషణ్‌ వాదిస్తూ.. ‘‘ఇంతకుముందు ఎన్నికల కమిషనర్లుగా ఎంపిక చేసిన వారంతా పదవీ విరమణ చేసిన వారే. కానీ గోయల్‌ ప్రభుత్వంలో కార్యదర్శి. శుక్రవారం ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. శనివారం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం నుంచి ఆయన విధులు నిర్వహించడం ప్రారంభించారు. ఎలాంటి ప్రక్రియను అనుసరిస్తున్నారో, ఏ నిబంధనలను పాటిస్తున్నారో అర్థం కావడం లేదు’’ అని తెలిపారు. దీనిపై స్వచ్ఛంద పదవీ విరమణకు మూడు నెలల ముందు నోటీసు ఇవ్వాలి కదా.. అని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. ‘‘అందుకే న్యాయస్థానం రికార్డులు అడగాలి’’ అని భూషణ్‌ పేర్కొన్నారు. నియామకం వెనుక ఎలాంటి ఉద్దేశాలూ లేవని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి  పేర్కొన్నారు. దీనికి ‘‘నియామకాల ప్రక్రియపై మేం విచారణ చేస్తున్నప్పుడే.. ఈ నియామకమూ జరిగింది. కాబట్టి ఈ ప్రక్రియ ఎలా జరిగిందో తెలుసుకోవడంలో తప్పేముంది. ఎలాంటి చట్టబద్ధమైన అభ్యంతరాలు లేకపోతే దస్త్రాలను సమర్పించండి. లేదంటే ఆ విషయం మాకు చెప్పండి. బుధవారం వరకు సమయం ఉంది. అయినా నియామకం అక్రమం కానప్పుడు దస్త్రాలను సమర్పించడానికి భయమెందుకు’’ అని జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ అన్నారు. ఎన్నికల సంఘం తటస్థంగా ఉండాలని, అయితే సుప్రీం వ్యాఖ్యల నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో పక్షపాతంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలు కలుగుతున్నాయని కాంగ్రెస్‌, జేడీయూ, టీఎంసీ, వామపక్షాలు వ్యాఖ్యానించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని