నోట్ల రద్దుపై న్యాయ సమీక్ష అనవసరం

దాదాపు ఆరేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అనవసరమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. వెనక్కి వెళ్లి స్పష్టమైన ఉపశమనాలేవీ కలిగించలేనప్పుడు దానిపై న్యాయస్థానం విచారణ చేపట్టడం తగదని తెలిపింది.

Published : 26 Nov 2022 06:54 IST

ఆ నిర్ణయాన్ని విస్తృత కోణంలో చూడాలి
సుప్రీంలో కేంద్రం వాదనలు

దిల్లీ: దాదాపు ఆరేళ్ల క్రితం నాటి నోట్ల రద్దు నిర్ణయంపై న్యాయ సమీక్ష అనవసరమని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం వాదించింది. వెనక్కి వెళ్లి స్పష్టమైన ఉపశమనాలేవీ కలిగించలేనప్పుడు దానిపై న్యాయస్థానం విచారణ చేపట్టడం తగదని తెలిపింది. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన 58 పిటిషన్లపై విచారణ జరుపుతున్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం తరఫున అటార్నీ జనరల్‌ (ఏజీ) ఆర్‌.వెంకటరమణి శుక్రవారం ఈ మేరకు వాదనలు వినిపించారు. ‘‘కేవలం నల్లధనం కోణంలోనే కాకుండా, విస్తృత కోణంలో నాటి నిర్ణయాన్ని చూడాలి. ఏదైనా పనిలో ఒక వ్యక్తి విఫలమైనంత మాత్రాన.. ఆయన ఉద్దేశం లోపభూయిష్టమైనదని చెప్పడం సరికాదు’’ అని పేర్కొన్నారు. అంతకుముందు- 2016లో నోట్ల రద్దు నిర్ణయం తీసుకునేముందు రిజర్వు బ్యాంకు సెంట్రల్‌ బోర్డును ప్రభుత్వం సంప్రదించిందా అని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఆర్‌బీఐ చట్టంలోని సెక్షన్‌-26(2)కు అనుగుణంగా కేంద్రం వ్యవహరించడం లేదంటూ పిటిషనర్లు చేస్తున్న వాదనపై స్పందించాలని కోరింది. ‘‘నోట్ల రద్దుతో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నట్లు మీరు చెబుతున్నారు. కానీ, మీరు అనుసరించిన విధానం లోపభూయిష్టంగా ఉందని పిటిషనర్లు వాదిస్తున్నారు. దానిపై మీ స్పందనేంటి?’’ అని ధర్మాసనం అడిగింది. వచ్చే నెల 5న ఈ వ్యవహారంలో తదుపరి విచారణ కొనసాగనుంది. మరోవైపు- నోట్ల రద్దుకు బాధ్యులైన అధికారులపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. అవసరమైతే ఈ విషయంపై బాంబే హైకోర్టును సంప్రదించాలని పిటిషనర్‌కు సూచించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని