సంక్షిప్త వార్తలు(5)

ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులకు 128 మంది కళాకారులు ఎంపికయ్యారు. 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను వీరిని ఎంపిక చేసినట్లు అకాడమీ శుక్రవారం వెల్లడించింది.

Updated : 26 Nov 2022 05:13 IST

128 మంది కళాకారులకు సంగీత నాటక అకాడమీ అవార్డులు

దిల్లీ: ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ అవార్డులకు 128 మంది కళాకారులు ఎంపికయ్యారు. 2019, 2020, 2021 సంవత్సరాలకుగాను వీరిని ఎంపిక చేసినట్లు అకాడమీ శుక్రవారం వెల్లడించింది. 10 మంది ప్రముఖులకు ఫెలోషిప్‌ అందజేయనున్నట్లు కూడా తెలిపింది. మరోవైపు- సంగీత నాటక అకాడమీ అమృత అవార్డులు 75 మందికి దక్కాయి. వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కళాకారులు ఉన్నారు. వీరంతా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా పురస్కారాలను స్వీకరించనున్నారు.


తెల్‌తుంబ్డే బెయిలుపై జోక్యం చేసుకోం

ఎన్‌ఐఏ వ్యాజ్యాన్ని కొట్టివేసిన సుప్రీంకోర్టు

దిల్లీ: ఎల్గార్‌ పరిషద్‌ - మావోయిస్టులతో లింకుల కేసులో సామాజిక కార్యకర్త ఆనంద్‌ తెల్‌తుంబ్డే (73)కు బాంబే హైకోర్టు మంజూరుచేసిన బెయిలును సవాలు చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. తెల్‌తుంబ్డేకు హైకోర్టు మంజూరుచేసిన బెయిలు విషయంలో జోక్యం చేసుకోబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిలు మంజూరుకు సంబంధించి హైకోర్టు తీర్పులోని పరిశీలనాంశాలే విచారణలో నిర్ణయాత్మక తుది అంశాలుగా పరిగణించడం లేదని పేర్కొంది. ‘ఆయన దళితుల సమీకరణలో పాల్గొంటున్నట్లు చెబుతున్నారు. ఇది నిజంగా ఉగ్రవాద చర్యకు సన్నాహకమా?’ అని ఎన్‌ఐఏ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ (ఏఎస్‌జీ) ఐశ్వర్య భాటిని ధర్మాసనం ప్రశ్నించింది. ‘ఆయన విద్యావేత్త. ఇది బహిర్ముఖం. ఆ వేషంలో ఏం చేస్తున్నారన్నదే అసలు సమస్య’ అని భాటి తెలిపారు. తెల్‌తుంబ్డే తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించారు.  


జీ-20 ఏర్పాట్లపై  5న అఖిలపక్ష భేటీ

దిల్లీ: వచ్చే ఏడాది మన దేశంలో నిర్వహించే అత్యంత శక్తిమంతమైన జీ-20 కూటమి శిఖరాగ్ర సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్ల వివరాలను వెల్లడించేందుకు కేంద్రం డిసెంబరు 5న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఓ రాజకీయ పార్టీకి చెందిన సీనియర్‌ నేత శుక్రవారం వెల్లడించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ భేటీకి మొత్తం 40 పార్టీల అధ్యక్షులను ఆహ్వానించినట్లు తెలిపారు. దీనికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి, విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ హాజరుకానున్నారు.


ఆకలి బాధలు తాళలేక అవయవాలు అమ్ముకుంటున్నారు

అఫ్గానిస్థాన్‌లో ప్రజలు క్షుద్బాధతో అలమటిస్తున్నారు. ఆకలితో ఏడుస్తున్న పిల్లలను నిద్రపుచ్చడానికి మత్తుని కలిగించే ఔషధాలు ఇస్తున్నారు. దీనివల్ల వారు తీవ్ర అనారోగ్యం బారినపడే ముప్పు పొంచి ఉంది. మరికొందరు కుటుంబాన్ని పోషించుకోవడానికి అవయవాలు అమ్ముకుంటున్నారు. కడుపు నింపుకోవడానికి కన్నపిల్లలను విక్రయిస్తున్న ఘటనలూ చోటుచేసుకుంటున్నాయి.

- యోగితా లిమయే


చరిత్ర తిరగరాయాలనడం సావర్కర్‌ను కీర్తించేందుకే..

భారత దేశ చరిత్రను చరిత్రకారులు తిరగరాయాలని, అందుకు ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుందని అమిత్‌ షా పేర్కొనడం చారిత్రక నైతికతపై దాడి చేయడమే. సావర్కర్‌ను కీర్తిస్తూ నెహ్రూను కించపరిచేందుకు, భారత్‌ అనే ఆలోచనను అణగదొక్కడానికి సత్యాలను వక్రీకరించేందుకే ఆయన ఈ పిలుపునిచ్చారు. చరిత్రపై అవగాహన ఉన్న చరిత్రకారులు దీన్ని ప్రతిఘటిస్తారు.

- బినోయ్‌ విశ్వం


ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరికి వేధింపులు

ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు శారీరక లేదా లైంగిక దాడికి గురవుతున్నారు. భర్త, ప్రేమికుడు, స్నేహితుడు, తండ్రి, సహోద్యోగి, అపరిచితుడు.. ఇలా ప్రతి రూపంలోనూ వారికి వేధింపులు ఎదురవుతున్నాయి. వేధింపులు ఆగాలంటే మహిళలు మౌనాన్ని వీడి వాటి గురించి ధైర్యంగా మాట్లాడాలి.

- ఐక్యరాజ్య సమితి


భాజపా తీరు అది.. మా దారి ఇది

భాజపా నేతలు సద్దాం హుసేన్‌, ఔరంగజేబ్‌, అలెగ్జాండర్‌ల గురించి మాట్లాడుతుంటారు. మేము పంటలకు కనీస మద్దతు ధర, ద్రవ్యోల్బణం గురించి నిలదీస్తుంటాం. వారు నైతికత గురించి వాదిస్తుంటారు. మేము ఉపాధి కల్పనకు కట్టుబడి ఉంటాం.

- కన్నయ్య కుమార్‌


ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లుపై గవర్నర్‌కు వివరణ ఇచ్చాం

తమిళనాడు మంత్రి రఘుపతి

చెన్నై (ప్యారిస్‌), న్యూస్‌టుడే: ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధ బిల్లు గురించి గవర్నర్‌కు వివరణ ఇచ్చినట్లు మంత్రి రఘుపతి తెలిపారు. బిల్లు రాజ్యాంగంలోని అంశాల పరిధిలోకి వస్తుందా? లేదా? అనే విషయంపై ప్రశ్నించగా... ‘రాజ్యాంగం ప్రకారమే రూపొందించాం. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ జూదాలను బిల్లులో వేరు చేశాం. నైపుణ్యం ఆధారంగా ఆడే ఆటల గురించి హైకోర్టు అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకున్నాం...’ అని వివరణ ఇచ్చామన్నారు. ఈ వివరణలతో ఏకీభవించి గవర్నర్‌ బిల్లుకు ఆమోదం తెలుపుతారనే నమ్మకం ఉందన్నారు. ఆయనను కలిసేందుకు సమయం కోరి వారం అవుతున్నా ఇంకా అనుమతి రాలేదని మంత్రి రఘుపతి చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని