ప్రపంచ మహిళలపై ద్రవ్యోల్బణ భారం

ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు స్త్రీలతో అధిక పని చేయిస్తూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ‘ది అసాల్ట్‌ ఆఫ్‌ ఆస్టరిటీ’ పేరిట ఆక్స్‌ఫాం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది.

Published : 26 Nov 2022 05:02 IST

కొవిడ్‌తో పరిస్థితుల తారుమారు: ఆక్స్‌ఫాం

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు స్త్రీలతో అధిక పని చేయిస్తూ వారిని ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ‘ది అసాల్ట్‌ ఆఫ్‌ ఆస్టరిటీ’ పేరిట ఆక్స్‌ఫాం విడుదల చేసిన తాజా నివేదిక పేర్కొంది. కరోనా మహమ్మారి మహిళల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపిందని, 2020తో పోల్చితే 2021లో ఉపాధి పొందిన మహిళల సంఖ్య తగ్గిందని నివేదిక వెల్లడించింది. ఈ మహమ్మారి కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చుకొంటూ ఆర్థికవృద్ధి సాధించడం, ద్రవ్యోల్బణం నుంచి గట్టెక్కడం కోసం ప్రభుత్వాలు చేయిస్తున్న పనులతో మహిళలు, బాలికలు చెమటోడ్చుతున్నారని తెలిపింది. ఫలితంగా మహిళలు పేదరికంలోకి జారిపోతున్నారని, కొన్ని సందర్భాల్లో అకాల మరణాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలు నీటి సరఫరా వంటివి ప్రజలకు అందించే సేవల్లో కోత పెడతున్న ప్రభావం కూడా మహిళలపైనే పడుతున్నట్లు చెప్పింది. ఈ కోతల ద్వారా 2023లో ప్రభుత్వాలు పొదుపు చేయాలని చూస్తున్న మొత్తం కంటే.. ప్రపంచ కుబేరుల నుంచి సేకరించే ప్రగతిశీల సంపద పన్ను రూ.81,69,325 కోట్లు (ఒక ట్రిలియన్‌ డాలర్లు) అధికమవుతుందని నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్య సమితి విభాగాల నుంచి ఇటీవల అందిన నివేదికల ప్రకారం మహిళలు, బాలికలు ఇప్పటికే దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు, బాలికల స్వేదం, భద్రత పణంగా పెట్టి కరోనా అనంతర పరిణామాల నుంచి బయటపడాలని చూడటం లింగవివక్షతో కూడిన హింసేనని ఆక్స్‌ఫాం జెండర్‌ జస్టిస్‌ అండ్‌ రైట్స్‌ హెడ్‌ అమీనా హెర్సీ పేర్కొన్నారు. ఈ విధమైన వివక్ష అనివార్యం కాదని, ప్రభుత్వాలు ఓ ఎంపికగా భావిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని