యుద్ధాలు వద్దు.. సవాళ్లు ఎదుర్కొందాం

మిగతా దేశాలకన్నా ఏవో కొన్ని దేశాలు అధికమనే భావనను భారత్‌ ఒప్పుకోదని, అలాంటి ప్రపంచ వ్యవస్థను తాము కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు.

Updated : 26 Nov 2022 06:34 IST

రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: మిగతా దేశాలకన్నా ఏవో కొన్ని దేశాలు అధికమనే భావనను భారత్‌ ఒప్పుకోదని, అలాంటి ప్రపంచ వ్యవస్థను తాము కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. భారత నౌకాదళం ఏటా నిర్వహించే ఇండో - పసిఫిక్‌ ప్రాంతీయ సంప్రదింపుల సభ (ఐపీఆర్డీ) బుధవారం నుంచి ఇక్కడ జరుగుతోంది. ముగింపు రోజైన శుక్రవారం రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. పరస్పర ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. ఉగ్రవాదం, వాతావరణ తీవ్ర మార్పుల నిరోధానికి ప్రపంచ దేశాలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల బాలిలో జరిగిన జీ 20 సదస్సులో యుద్ధాలకు రోజులు చెల్లిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని ఆయన ఉటంకించారు. కొవిడ్‌ సహా ఎన్నో సమస్యలతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నదనీ, ఈ సమయంలో యుద్ధాలకు దిగడం కాకుండా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ఇండో - పసిఫిక్‌ స్వేచ్ఛా మండలంగా, పరస్పరం ఆమోదనీయ నిబంధనల ఆధారంగా నిలవడం ఈ ప్రాంతమే కాక యావత్‌ ప్రపంచం ఆర్థికంగా పురోగమించడానికి దోహదపడుతుందన్నారు. భారత నౌకా దళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ తన ప్రసంగంలో.. భారత్‌కు సముద్ర జలాల్లో ఎదురవుతున్న ముప్పులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని