సంక్షిప్త వార్తలు (8)

గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు.

Updated : 27 Nov 2022 06:09 IST

సహోద్యోగి కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల మృతి

పోర్‌బందర్‌: గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో సహోద్యోగి జరిపిన కాల్పుల్లో ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మణిపుర్‌ బెటాలియన్‌కు చెందిన వీరంతా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు పోర్‌బందర్‌ జిల్లా వచ్చినట్లు కలెక్టర్‌ ఎ.ఎం.శర్మ తెలిపారు. తుక్డా గోసా గ్రామంలో ఉన్న తుపాను సహాయక శిబిరంలో చిన్న గొడవ కారణంగా ఓ జవాను తోటి ఉద్యోగులపై కాల్పులు జరిపాడని అధికారులు తెలిపారు.


డ్రిల్లింగ్‌ మెషీన్‌తో బాలుడిని గాయపరిచిన టీచర్‌

డ్రిల్లింగ్‌ మెషీన్‌తో 11 ఏళ్ల విద్యార్థిని గాయపరిచాడు ఓ ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో జరిగింది. స్థానిక ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని ఈ నెల 24న రెండో ఎక్కం చెప్పాల్సిందిగా ఉపాధ్యాయుడు అనుజ్‌ ఆదేశించాడు. ఆ బాలుడు చెప్పకపోయేసరికి ఆగ్రహించిన అనుజ్‌.. డ్రిల్లింగ్‌ మెషీన్‌తో చేతిని గాయపరిచాడు. విషయం తెలుసుకున్న అధికారులు విచారణకు ఆదేశించారు. అనంతరం విద్యార్థిని గాయపరిచిన ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేశారు.  మరోవైపు.. ఆ పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పకుండా పనులు చేయిస్తున్నారని విచారణలో తేలింది. దీనికి కారణమైన ప్రిన్సిపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరోసారి అస్సాంలో శిందే వర్గం
కామాఖ్య దేవి ఆలయాన్ని దర్శించుకున్న మహారాష్ట్ర సీఎం

గువాహటి/ముంబయి: ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వాన్ని కూల్చిన సమయంలో అస్సాంలో తిరుగుబాటు శిబిరం నిర్వహించి మంత్రాంగం నడిపి.. అనంతరం అధికారం చేజిక్కించుకున్న శివసేనలోని ఏక్‌నాథ్‌ శిందే వర్గం.. దాదాపు 150 రోజుల తర్వాత శనివారం అస్సాంలో అడుగుపెట్టింది. కామాఖ్య దేవాలయంలో పూజలు జరిపి.. దుర్గామాత ఆశీస్సులు తీసుకుంది. ముంబయి నుంచి 170 మందితో గువాహటి చేరుకున్న మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే, ఆయన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, వారి కుటుంబసభ్యులకు అస్సాంలోని భాజపా మంత్రులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి శిందే వర్గం.. నగరంలోని నీలాచల్‌ కొండపై ఉన్న కామాఖ్య ఆలయానికి వెళ్లి.. దేవికి పూజలు నిర్వహించారు. ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబాటు చేసి అస్సాంలో శిబిరం నిర్వహించినపుడు కూడా శిందే వర్గం ఈ ఆలయాన్ని దర్శించి దుర్గాదేవి ఆశీస్సులు తీసుకుంది.


జైలు నుంచి తెల్‌తుంబ్డే విడుదల

ముంబయి: ఎల్గార్‌ పరిషద్‌ - మావోయిస్టులతో లింకుల కేసులో శిక్ష అనుభవిస్తున్న సామాజిక కార్యకర్త ఆనంద్‌ తెల్‌తుంబ్డే (73) శనివారం నవీ ముంబయిలోని తలోజా సెంట్రల్‌ జైలు నుంచి విడుదలయ్యారు. తెల్‌తుంబ్డేకు బాంబే హైకోర్టు మంజూరుచేసిన బెయిలును సవాలు చేస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు మంజూరు చేసిన బెయిలు విషయంలో జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసిన మరుసటి రోజు తెల్‌తుంబ్డే జైలు నుంచి విడుదలైనట్లు అధికారులు వెల్లడించారు. భీమా కోరెగావ్‌ కేసులో తెల్‌తుంబ్డేను ఏప్రిల్‌ 14, 2020న ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. అప్పటినుంచి ఆయన జైలులో ఉన్నారు. ఈ నెల 18న బాంబే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఎన్‌ఐఏ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.  


జైన్‌ వీడియో మరొకటి లీక్‌

దిల్లీ: తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ మంత్రి సత్యేంద్రజైన్‌కు సంబంధించిన మరో వీడియోను దిల్లీ భాజపా సామాజిక మాధ్యమ విభాగం ఇన్‌ఛార్జి హరీశ్‌ ఖురానా శనివారం బహిర్గతం చేశారు. అందులో రాత్రి 8.00 గంటల సమయంలో మంత్రిని తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌ కలిసినట్లుగా ఉంది. హవాలా కేసులో మే 31 నుంచి జైలులో ఉన్న సత్యేంద్రజైన్‌కు ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయని ఆరోపిస్తూ భాజపా వరుస వీడియోలను బయటపెడుతున్న విషయం తెలిసిందే. జైలు గదిలో జైన్‌కు ఓ వ్యక్తి మసాజ్‌ చేస్తుండటం, ఆయన మంచంపై పడుకొని సందర్శకులతో మాట్లాడుతుండటం, పక్కనే ఒక రిమోట్‌ ఉండటం వంటి దృశ్యాలు ఇప్పటిదాకా వైరల్‌ అయ్యాయి. భాజపా చౌకబారు ప్రచారాలకు తెర తీసిందని ఆప్‌ వీటిని ఖండించింది.

ప్రత్యేక భోజనం అర్జీ తిరస్కరణ

జైలులో తన మత విశ్వాసాలకు అనుగుణమైన భోజనం అందించేలా అధికారులను ఆదేశించాలని మంత్రి జైన్‌ చేసిన విజ్ఞప్తిని దిల్లీ కోర్టు శనివారం తిరస్కరించింది. మిగతా ఖైదీలకు మాదిరిగా చట్టానికి అనుగుణంగానే సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులకు స్పష్టం చేసింది. జైన్‌కు వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సూచించింది.


స్వాతంత్య్రం తర్వాత తొలిసారి దళిత యువతి పెళ్లి ఊరేగింపు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్‌ జిల్లా లోహామయ్‌ గ్రామంలో ఓ దళిత యువతి పెళ్లి ఊరేగింపునకు 60 మంది పోలీసులు రక్షణ కల్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఆ గ్రామంలో ఏ ఒక్క దళిత కుటుంబం ఇలా పెళ్లి ఊరేగింపు జరపలేదు. దీంతో ఆ దళిత కుటుంబం ఈ వేడుకను వైభవంగా నిర్వహించింది. ఊరేగింపు కోసం ఆర్జీని పెట్టుకున్న వెంటనే జిల్లా ఎస్పీ నుంచి అనుమతి లంభించిందని పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు రాజు చౌహాన్‌, ఊర్మిళ బాల్మీకి తెలిపారు.


కళాశాలల్లో ప్రవేశాలకు ఓటరు నమోదు తప్పనిసరి
మహారాష్ట్ర సర్కారు నిర్ణయం

కళాశాలల్లో ప్రవేశాల కోసం 18 ఏళ్లుపైబడిన విద్యార్థులందరికీ ఓటరు నమోదును తప్పనిసరి చేయనున్నట్లు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు వచ్చే ఏడాది జూన్‌ నుంచి జాతీయ విద్యావిధానం కింద రాష్ట్రంలో నాలుగేళ్ల డిగ్రీ కోర్సులనూ ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఇక్కడి రాజ్‌భవన్‌లో జరిగిన విశ్వవిద్యాలయాల వైస్‌- ఛాన్స్‌లర్ల సమావేశంలో రాష్ట్ర ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ మంత్రి చంద్రకాంత్‌ పాటిల్‌ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ‘‘రాష్ట్ర ఉన్నత విద్యా వ్యవస్థలోని 50 లక్షల మంది విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేయాలని లక్ష్యం నిర్దేశించుకోగా.. కేవలం 32 లక్షల మంది మాత్రమే ముందుకొచ్చారు. ఈ నేపథ్యంలో.. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు తమ ఓటరు నమోదును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఒక తీర్మానాన్ని జారీ చేయనుంది’’ అని మంత్రి తెలిపారు.  


ప్రజలకు ఆశాకిరణంగా ఆప్‌

ఆమ్‌ ఆద్మీ పార్టీ పది వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ పదేళ్లలో ప్రజల అపారమైన ప్రేమ, కార్యకర్తల కృషితో ఆప్‌ భారత రాజకీయాల్లో ఎన్నో చరిత్రలు సృష్టించింది. దేశ ప్రజలకు కొత్త ఆశాకిరణంగా మారింది.

కేజ్రీవాల్‌


నాయకత్వం అంటే సమస్యలను పరిష్కరించడమే..

నాయకత్వం అంటేనే సమస్యలను పరిష్కరించగలగడం. మీ బృంద సభ్యులు తమ సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం ఆపేశారంటే, మీరు వారికి నిజమైన నాయకుడిలా వ్యవహరించడం మానేశారని అర్థం. మీరు సహాయం చేయగలరనే విశ్వాసాన్ని వారు కోల్పోయి ఉండాలి లేదా మీరు వారిని పట్టించుకోవట్లేదని  భావిస్తుండాలి. రెండిట్లో ఏది జరిగినా మీరు నాయకుడిగా విఫలమైనట్లే లెక్క.

 హర్ష్‌ గోయెంకా


హింసను ఆపేలా ఇరాన్‌పై ఒత్తిడి తేవాలి

హిజాబ్‌ వ్యతిరేక నిరసనలు చేస్తున్నందుకు మహిళలను చంపుతున్న ఇరాన్‌ ప్రభుత్వ ఛాందసవాదాన్ని ప్రపంచ దేశాలు తప్పుపట్టడం మంచిదే. కానీ అదొక్కటే సరిపోదు. ఆ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించినా ఉపయోగం ఉండదు. లౌకిక దేశాలు ఇరాన్‌ దౌత్య కార్యాలయాలను మూసివేయాలి. మహిళలపై హింసను ఆపేలా ఇరాన్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి.

 తస్లీమా నస్రీన్‌


స్థిరమైన అభివృద్ధికి అక్షరాస్యత కీలకం

ప్రపంచవ్యాప్తంగా 77.1 కోట్ల మంది వయోజనులు ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉన్నారు. 25 కోట్ల మంది పిల్లలు ప్రాథమిక అంశాలను నేర్చుకోవడంలోనూ విఫలమవుతున్నారు. స్థిరమైన అభివృద్ధికి కీలకమైన అక్షరాస్యత శాతాన్ని పెంచడానికి ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. 

యునెస్కో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని