ఇమామ్‌లకు ప్రభుత్వ పారితోషికం తప్పు

మసీదుల్లోని ఇమామ్‌లకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వడాన్ని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) తీవ్రంగా తప్పుపట్టింది.

Published : 27 Nov 2022 03:09 IST

ప్రజల సొమ్మును ఒక మతానికి వినియోగించడం సమంజసమా?
1993 సుప్రీంకోర్టు ఉత్తర్వులూ రాజ్యాంగ ఉల్లంఘనే
కేంద్ర సమాచార కమిషన్‌ తీవ్ర వ్యాఖ్యలు

దిల్లీ: మసీదుల్లోని ఇమామ్‌లకు ప్రభుత్వం పారితోషికం ఇవ్వడాన్ని కేంద్ర సమాచార కమిషన్‌(సీఐసీ) తీవ్రంగా తప్పుపట్టింది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనేనని పేర్కొంది. 1993లో ఇమామ్‌లకు గౌరవ వేతనం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపైనా సునిశిత వ్యాఖ్యలు చేసింది. ఈ తీర్పు సమర్థనీయం కాదని, ఇదో తప్పుడు విధానానికి నాంది పలికిందని, అనవసర రాజకీయ వివాదాలను, సామాజిక వైషమ్యాలను సృష్టించిందని తెలిపింది. ‘‘ఇమామ్‌లకు పారితోషికం ఇవ్వడమంటే.. హిందూ సమాజానికి, ముస్లిమేతర అల్పసంఖ్యాక మతాలకు ద్రోహం చేయడమే. పన్ను చెల్లింపుదారుల సొమ్ము నుంచి ఇమామ్‌కు నెలకు రూ.18,000 పారితోషికం లభిస్తోంది. ఆలయ ట్రస్టు నుంచి హిందూ పూజారికి నెలకు కేవలం రూ.2000 వేతనం మాత్రమే వస్తోందని దరఖాస్తుదారుడు చెబుతున్నారు. మతపరమైన అల్పసంఖ్యాకుల రక్షణ పేరుతో ఇలాంటి చర్యలను సమర్థించేవారు.. మెజారిటీ మతానికి కూడా రక్షణ పొందే హక్కు ఉందన్న విషయాన్ని గమనించాలి’’ అని కేంద్ర సమాచార కమిషనర్‌ ఉదయ్‌ మాహుర్కర్‌ పేర్కొన్నారు. ఇమామ్‌లకు దిల్లీ ప్రభుత్వం, దిల్లీ వక్ఫ్‌బోర్డు చెల్లిస్తున్న జీతాల వివరాలను కోరుతూ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద దాఖలైన దరఖాస్తు విచారణ సందర్భంగా మాహుర్కర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. పన్ను చెల్లించేవారి డబ్బును ఒక మతానికి అనుకూలంగా వాడకూడదని పేర్కొన్నారు. 1993లో ఆల్‌ఇండియా ఇమామ్‌ ఆర్గనైజేషన్‌ వేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఇమామ్‌లకు పారితోషికం ఇవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను కమిషనర్‌ తప్పుపట్టారు. ఈ తీర్పు ప్రతిని కేంద్ర న్యాయశాఖ పరిశీలించి, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆర్టీఐ దరఖాస్తు దాఖలు చేసిన అగర్వాల్‌కు రూ.25,000 చెల్లించాలని దిల్లీ వక్ఫ్‌బోర్డును కమిషన్‌ ఆదేశించింది. ఇమామ్‌లకు వేతనాలిస్తున్నామన్న విషయాన్ని వక్ఫ్‌బోర్డు దాచిపెట్టడాన్ని కమిషనర్‌ తప్పుపట్టారు. అగర్వాల్‌ దరఖాస్తుకు సమాధానమివ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ఆదేశించారు.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని