దేశానికి స్ఫూర్తి రాజ్యాంగమే

మన రాజ్యాంగమే దేశానికి స్ఫూర్తి అనీ, రాజ్యాంగ పీఠికలో ‘భారతదేశ ప్రజలమైన మేం..’ అనే తొలి మూడు పదాలు ఒక పిలుపు, విశ్వాసం, ప్రతిజ్ఞలాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Updated : 27 Nov 2022 06:00 IST

రాజ్యాంగ దినోత్సవంలో ప్రధాని మోదీ  
అందరం కలిసి భారత్‌ ప్రతిష్ఠను పెంచుదామని పిలుపు
కోర్టులే పౌరుల్ని చేరుకునేలా మార్పులు రావాలి: సీజేఐ

దిల్లీ: మన రాజ్యాంగమే దేశానికి స్ఫూర్తి అనీ, రాజ్యాంగ పీఠికలో ‘భారతదేశ ప్రజలమైన మేం..’ అనే తొలి మూడు పదాలు ఒక పిలుపు, విశ్వాసం, ప్రతిజ్ఞలాంటివని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం సుప్రీంకోర్టులో నిర్వహించిన వేడుకల్లో ఆయన ప్రసంగించారు. ప్రాథమిక విధులను నిర్వర్తించడమే పౌరులకు తొలి ప్రాధాన్యం కావాలని, దేశాన్ని సమున్నత శిఖరాలకు చేర్చడానికి ఇది అవసరమని చెప్పారు. ఆర్థికంగా వృద్ధి చెందుతున్న భారత్‌వైపు యావత్‌ ప్రపంచం చూస్తోందన్నారు. ‘‘ప్రపంచ యవనికపై మన దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేయడానికి టీం ఇండియాలా పనిచేయాలి. ఇది మన ఉమ్మడి బాధ్యత. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి వంటి భారతదేశ అస్తిత్వాన్ని బలోపేతం చేయాలి. సమానత్వం, సాధికారతలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు రాజ్యాంగం పట్ల యువతలో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది’’ అని ప్రధాని చెప్పారు. రాజ్యాంగ రూపకల్పనలో దుర్గాబాయ్‌ దేశ్‌ముఖ్‌ సహా 15 మంది మహిళలు చేసిన కృషి గురించి పెద్దగా చర్చ జరగలేదని అన్నారు. రాజ్యాంగం, సంస్థల మనుగడ యువత భుజస్కంధాలపై ఉందని చెప్పారు. ‘వర్చువల్‌ జస్టిస్‌ క్లాక్‌’, ‘జస్ట్‌ఐఎస్‌’ మొబైల్‌ యాప్‌ 2.0, డిజిటల్‌ కోర్ట్‌, ‘ఎస్‌3డబ్ల్యూఏఏఎస్‌’ వెబ్‌సైట్లను ఆయన ప్రారంభించారు.

కోర్టుల్లో ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించాలి: రిజిజు

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ప్రసంగిస్తూ- న్యాయశాస్త్ర సంబంధ పదాలు, పుస్తకాలు సామాన్యులకు అర్థమయ్యే భాషలో లభ్యం కావడం లేదని చెప్పారు. సివిల్‌, క్రిమినల్‌, రాజ్యాంగపరమైన కేసులలో ఎక్కువగా వాడే పదాలు, పదబంధాలతో ఉమ్మడి శబ్దకోశాన్ని తయారు చేసేందుకు ప్రయత్నం జరుగుతోందని తెలిపారు. ప్రాంతీయ భాషల్ని కోర్టుల్లో ప్రోత్సహించాలన్నారు.

పౌరులు కేంద్రంగా న్యాయప్రక్రియ

కోర్టుల్లో వ్యాజ్య ప్రక్రియను సరళతరం చేయడానికి, పౌరులు కేంద్రంగా ఉండేలా న్యాయప్రక్రియను మార్చడానికి సంస్థాగత సంస్కరణలు చేపట్టడంతోపాటు సాంకేతికతను తప్పనిసరిగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ ఈ సమావేశంలో చెప్పారు. న్యాయాన్ని అర్థిస్తూ ప్రజలు న్యాయస్థానాలకు రావడం కాకుండా కోర్టులే పౌరులను చేరుకునేలా వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. న్యాయం, స్వేచ్ఛ-సమానత్వాల పరిరక్షణలో రాజ్యాంగ దార్శనికతను దేశవ్యాప్తంగా న్యాయమూర్తులు ప్రతిబింబించాలని ఆకాంక్షించారు. కేసుల లిస్టింగులో, విచారణల్లో సాంకేతికతను వాడడం ద్వారా కాలహరణాన్ని నివారిస్తున్నట్లు చెప్పారు.

అందరికీ అందుబాటులో న్యాయం: ద్రౌపదీ ముర్ము

ముగింపు సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మాట్లాడుతూ-దేశం, ప్రజల విషయాల్లో శాసన, కార్యనిర్వాహక, న్యాయవ్యవస్థ.. ఈ మూడింటి ఆలోచనలు ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా చూసే బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. జైళ్లు కిక్కిరిసిపోతున్న నేపథ్యంలో కొత్త కారాగారాలను నిర్మించేబదులు.. చిన్నాచితకా నేరాల్లో ఏళ్లతరబడి జైళ్లలోనే మగ్గిపోతున్న పేదలకు సాయపడే విషయాన్ని ఆలోచించాలని కోరారు. వారిలో చాలామందికి ప్రాథమిక హక్కుల గురించి తెలియదని, వారిని ఖైదులో ఉంచడం ప్రభుత్వానికీ భారమే కాబట్టి ఏం చేయాలో ఆలోచించాలని సూచించారు. ‘‘కొందరు హత్యలు చేసి స్వేచ్ఛగా తిరుగుతుంటే, మరికొందరు తమవారిని జైలు నుంచి బయటకు తీసుకురావాలంటే సర్వస్వాన్నీ అమ్ముకోవాల్సి వస్తుందని చేతులెత్తేస్తున్నారు. వ్యాజ్యాల ఖర్చు.. న్యాయం అందజేతలో ప్రధాన అవరోధంగా నిలుస్తోంది’’ అని ముర్ము పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని