26/11 ముంబయి మృతులకు నివాళులు

దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై ఉగ్రమూకలు విరుచుకుపడి సృష్టించిన నరమేధంలో అసువులుబాసిన ప్రజలకు, అమరులైన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం నివాళులర్పించారు.

Published : 27 Nov 2022 04:27 IST

ఉగ్రమూకలపై పోరులో భద్రతా సిబ్బంది త్యాగాలు అనన్యం: రాష్ట్రపతి
కుట్రదారులను శిక్షిస్తేనే బాధితులకు న్యాయం: జైశంకర్‌

దిల్లీ: దేశ వాణిజ్య రాజధాని ముంబయిపై ఉగ్రమూకలు విరుచుకుపడి సృష్టించిన నరమేధంలో అసువులుబాసిన ప్రజలకు, అమరులైన భద్రతా సిబ్బందికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం నివాళులర్పించారు. అమాయక పౌరులను రక్షించే క్రమంలో ముంబయి పోలీసులు, భారత సైనికులు సాహసోపేతంగా పోరాడారని, వారి త్యాగాలు అసమానమైనవని కొనియాడారు. 2008, నవంబరు 26న పాకిస్థానీ ముష్కరులు ముంబయిపై విద్రోహ దాడికి పాల్పడి శనివారానికి సరిగ్గా 14ఏళ్లు గడిచాయి. దాదాపు 60 గంటల పాటు సాగిన ఆ మారణహోమంలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 18 మంది భద్రతా సిబ్బంది. మృతుల్లో భారతీయులే కాకుండా మరో 14 దేశాలకు చెందిన పౌరులూ ఉన్నారు.

‘ఆ భయానక క్షణాలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉన్నాయి. కానీ, ఆ ఘోరానికి కుట్రపన్నిన వారు మాత్రం శత్రు దేశంలో స్వేచ్ఛగా తిరుగుతూనే ఉన్నారు. వారిని చట్టం ముందుకు తీసుకొస్తేనే బాధిత కుటుంబాలకు న్యాయం జరుగుతుంద’ని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘26/11 ఉగ్రదాడి మిగిల్చిన విషాద స్మృతులను భారత్‌తో కలిసి యావత్‌ ప్రపంచం గుర్తుచేసుకుంటోంది. ఉగ్రవాదం కారణంగా బాధపడుతున్న ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందే’నని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా దాడులకు సంబంధించిన చిత్రాలున్న ఓ వీడియోను పంచుకున్నారు. దాని చివర్లో...‘ఉగ్రదాడి ఒక్కటైనా..ఎన్నో జరిగినట్లే. ఒక్క ప్రాణం పోయినా ఎన్నో ప్రాణాలను కోల్పోయినట్లే. ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టేంత వరకూ విశ్రమించం’ అని ఇటీవల ఓ వేదికపై ప్రధాని మోదీ చెప్పిన సందేశాన్ని జత చేశారు.

హింసకు వ్యతిరేకంగా భారత్‌ పోరాడుతోంది: రాహుల్‌

ముంబయిపై ఉగ్రదాడిలో మృతులకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. ఉగ్రవాదం, హింసకు వ్యతిరేకంగా భారత్‌ పోరాడుతూనే ఉంటుందని ట్వీట్‌ చేశారు.

మహారాష్ట్ర గవర్నర్‌పై విమర్శలు

ముంబయిలోని పోలీస్‌ అమరవీరుల స్మారకం వద్ద మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే 26/11 మృతులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ తన పాదరక్షలను తొలగించలేదని, ఇది పోలీస్‌ అమరులను అవమానించడమేనని కాంగ్రెస్‌ పార్టీ నేత సచిన్‌ సావంత్‌ విమర్శించారు. అయితే, ఈ ఆరోపణలను రాజ్‌భవన్‌ తోసిపుచ్చింది. ఇటువంటి కార్యక్రమాల సమయంలో పాదరక్షలు తొలగించాల్సిన అవసరంలేదని గవర్నర్‌కు పోలీసు అధికారులు చెప్పారని ఒక ప్రకటనలో పేర్కొంది.

కాంగ్రెస్‌ ఎన్నడూ ఆ దాడులను ఖండించలేదు: అమిత్‌ షా

మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా కొనసాగిన పదేళ్లలో (2004-2014) దేశంలో ఎన్నో ఉగ్రదాడులు జరిగాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తెలిపారు. అయినప్పటికీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఆ దాడులను ఖండించలేదన్నారు. గుజరాత్‌లోని తలాజాలో నిర్వహించిన ఎన్నికల సభలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ హయాంలో 26/11 వంటి దాడులు జరగబోవని తెలిపారు. ఉరి, పుల్వామా ఘటనల తర్వాత మన సైన్యం జరిపిన మెరుపు దాడులు ముష్కరులకు వణుకుపుట్టించాయన్నారు. ముంబయి దాడుల మృతులకు అమిత్‌ షా నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని