గూడు గోడుపై ఎవరూ స్పందించక.. 15 ఏళ్లుగా అడవిలో నివాసం

ఓ కుటుంబం 15 ఏళ్లుగా అడవిలోనే నివసిస్తోంది. జనారణ్యంలో అవసరమైన సాయం అందక అడవి బాట పట్టింది.

Updated : 28 Nov 2022 10:23 IST

కటక్‌, న్యూస్‌టుడే: ఓ కుటుంబం 15 ఏళ్లుగా అడవిలోనే నివసిస్తోంది. జనారణ్యంలో అవసరమైన సాయం అందక అడవి బాట పట్టింది. అక్కడ జంతువుల మధ్య బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతోంది. ఒడిశాలోని నువాపడ జిల్లా బోడెన్‌ సమితిలోని కైరా గ్రామానికి చెందిన పగున మాఝి కుటుంబంతో పూరి గుడిసెలో నివసించేవారు. ఓ రోజు వర్షాలకు గుడిసె కూలిపోవడంతో కొన్ని రోజులు చెట్టు కింద తలదాచుకున్నారు. కార్యాలయాల చుట్టూ తిరిగి అధికారులవద్ద గోడు వెళ్లబోసుకున్నారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో విసిగిపోయి గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవిలోకి వెళ్లిపోయారు. దొరికిన కర్రలు, రేకులు, విరిగిన పెంకులతో చిన్న గూడు ఏర్పాటు చేసుకొని 15 ఏళ్లుగా కుటుంబంతో అందులోనే నివసిస్తున్నారు. దీనిపై ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. రాత్రయితే చీకట్లోనే కాలం గడుపుతున్నామని, జంతువుల భయంతో తీవ్ర ఆందోళన చెందుతున్నామని బాధితులు వాపోయారు. అధికారులు ఇప్పటికైనా తమపై దయ చూపాలని, ఇంటి నిర్మాణానికి సాయం చేయాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దారు రాకేశ్‌ ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు