సంక్షిప్త వార్తలు(4)

కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొనేందుకు బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సింగపూర్‌ చేరుకొన్నారు.

Updated : 28 Nov 2022 06:05 IST

కిడ్నీ మార్పిడికి సింగపూర్‌ చేరుకొన్న లాలూ

ఇంటర్నెట్‌డెస్క్‌: కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ చేయించుకొనేందుకు బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సింగపూర్‌ చేరుకొన్నారు. డిసెంబరు 5న ఆయనకు అక్కడ కిడ్నీ మార్పిడి చేయనున్నట్లు సమాచారం. కుమార్తె రోహిణీ ఆచార్య ఆయనకు కిడ్నీ దానం చేయనున్నారు. లాలూ సింగపూర్‌ చేరుకోగానే ఆ వీడియోను జత చేస్తూ భావోద్వేగంతో రోహిణీ ఓ ట్వీట్‌ చేశారు.


కొవిడ్‌ దెబ్బతో ‘సీనియర్‌’ ప్రయాణికులు తగ్గారు

సహ చట్టం కింద అడిగిన ప్రశ్నకు రైల్వేశాఖ వివరణ

దిల్లీ: కరోనా ప్రభావంతో రైళ్లల్లో ప్రయాణించే సీనియర్‌ సిటిజన్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. కొవిడ్‌ భయంతో 2019-20తో పోలిస్తే 2021-22లో 24శాతం మంది సీనియర్‌ సిటిజన్లు రైళ్లల్లో ప్రయాణించడం తగ్గించుకున్నారని సమాచార హక్కు చట్టం కింద అడిగిన ఒక ప్రశ్నకు రైల్వేశాఖ సమాధానం ఇచ్చింది. ప్రత్యేకించి కరోనా రెండో దశ వ్యాప్తి సందర్భంగా ప్రయాణికులు బాగా తగ్గారని.. సీనియర్‌ సిటిజన్లకు ఇచ్చే రాయితీలను కూడా ఈ సమయంలోనే రైల్వేశాఖ ఉపసంహరించుకుందని అధికారులు తెలిపారు. 2018-19లో 7.1కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లు రైళ్లలో ప్రయాణించగా 2019-20లో ఆ సంఖ్య 7.2కోట్లకు చేరింది. కొవిడ్‌ దెబ్బతో 60ఏళ్లకు పైబడ్డ వారిలో 1.9కోట్ల మంది మాత్రమే రైళ్లల్లో ప్రయాణించారు. అయితే 2021-22లో 5.5కోట్ల మంది రైళ్లను వినియోగించుకున్నారు. ఈ ప్రభావం ఆ శాఖ ఆదాయంపైనా పడింది. 2018-19లో రూ.2920కోట్లు ఆదాయం రాగా.. 2019-20లో రూ.3,010కోట్లు, 2020-21లో రూ.875కోట్లు.. 2021-22లో రూ.2,598 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.


భాజపా ఓ వీడియో తయారీ సంస్థ

ఫేక్‌ వీడియోలు విడుదల చేస్తున్న భాజపా.. ప్రతి వార్డులోనూ ఒక వీడియో దుకాణం తెరుస్తామని దిల్లీ ప్రజలకు కొత్త హామీ ఇస్తుంది. ఆ పార్టీ ఒక వీడియో తయారీ సంస్థ. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి వీడియోలు రూపొందించే పని అప్పజెబుతారు. పాఠశాలలు, ఆసుపత్రులు నిర్మించేవారికి ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత అప్పగిస్తారు.

- కేజ్రీవాల్‌


2 లక్షల ఉద్యోగాలు కల్పించాం

కేరళలో ఈ ఏడాది లక్ష సంస్థలను ప్రారంభించాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 235 రోజుల్లోనే 92 వేల కంపెనీలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వారా రూ.5655 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతోపాటు యువతకు 2లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించాం.

- పినరయి విజయన్‌


కుమార్తె పెళ్లిపై తండ్రికీ ఆ హక్కు లేదు

నా కుమార్తెలు ఎవరిని పెళ్లి చేసుకోవాలన్న విషయంతో ఎవ్వరికీ సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే, వారి తండ్రిగా నాక్కూడా దానిపై నిర్ణయం తీసుకొనే హక్కు, అధికారం లేవు. వారి జీవిత భాగస్వాములను వారే ఎంపిక చేసుకొంటారు. అందుకు నేను గర్విస్తాను.

- ఆనంద్‌ మహీంద్రా


హింసతో భవిష్యత్తు ఉండదు

హింస భవిష్యత్తును చంపేస్తుంది. పరస్పర విశ్వాసం, చర్చలు లేకుండా శాంతి ఎప్పటికీ సాధ్యం కాదు. ఇజ్రాయెల్‌, పాలస్తీనా దళాలు, రష్యా, ఉక్రెయిన్‌ ప్రభుత్వాలు దీన్ని గుర్తెరిగి తక్షణం యుద్ధం, ఘర్షణలకు స్వస్తి పలికి చర్చలకు పూనుకొంటాయని ఆశిస్తున్నాను.

- పోప్‌ ఫ్రాన్సిస్‌


ముంబయిలో రూ.50 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

ముంబయి: నిఘా వర్గాల సమాచారంతో 7.9 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నట్లు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్లు ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఇద్దరు జింబాబ్వే జాతీయులను అదుపులోకి తీసుకున్నారు. వీరు అడిస్‌ అబాబా(ఇథియోపియా) నుంచి ముంబయిలోని ఛత్రపతి శివాజీ విమానాశ్రయంలో దిగారు. వీరి ట్రాలీ బ్యాగ్‌లను అధికారులు తనిఖీ చేయగా లేత గోధుమ రంగులో హెరాయిన్‌ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. నిందితులపై నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద కేసులు నమోదు చేశామని, ప్రత్యేక కోర్టు వీరిని జ్యుడీషియల్‌ కస్టడీకి అనుమతించిందని పేర్కొన్నారు.

* కేరళలోని కోచి విమానాశ్రయంలో రూ.48.5లక్షల విలువైన బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన వ్యక్తిపై అనుమానం వచ్చిన అధికారులు సోదా చేయగా క్యాప్స్యూల్స్‌ రూపంలో శరీరంలో దాచిన 1192 గ్రాముల బంగారం లభ్యమైంది. అతని వద్ద ఉన్న మూడు బంగారు గొలుసులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని