సంక్షిప్త వార్తలు (14)

దేశంలో పాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. గత 8 ఏళ్లలోనే 83 టన్నుల ఉత్పత్తి పెరిగింది.

Updated : 29 Nov 2022 06:28 IST

సౌరశక్తిని అధికంగా గ్రహించే సరికొత్త కిరణ జన్య సంయోగ వ్యవస్థ

దిల్లీ: సూర్యుడి నుంచి శక్తిని గ్రహించేందుకు మొక్కల్లో జరిగే కిరణ జన్య సంయోగ క్రియను అనుకరించడం ద్వారా... కాంతిని సమర్థంగా గ్రహించే కృత్రిమ వ్యవస్థను ఐఐఎస్‌ఈఆర్‌ (తిరువనంతపురం), ఐఐటీ (ఇందోర్‌) పరిశోధకులు రూపొందించారు. ఈ వివరాలను ప్రతిష్ఠాత్మక రాయల్‌ కెమికల్‌ సొసైటీ-కెమికల్‌ సైన్స్‌ పత్రిక ప్రచురించింది. ఎండ తగిలే మొక్క భాగాల్లోని క్రోమోఫోర్‌లు... సూర్యకాంతి నుంచి శక్తిని గ్రహించి, పక్కనున్న ఇతర క్రోమోఫోర్‌లకు దాన్ని అందిస్తాయి. అలా అన్ని క్రోమోఫోర్‌లకూ ఈ శక్తి సరఫరా అవుతుంది. ఇదే పద్ధతిని అనుసరించి, వీలైనంతగా కాంతిని గ్రహించేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పాలిమెరిక్‌ నిర్మాణాలు, డిటర్జెంట్‌ రకం అణువులు, వెసికిల్స్‌, జెల్‌, జీవ పదార్థాలను వినియోగిస్తున్నారు. కానీ, ఇవన్నీ కలగలిసిపోవడం వల్ల కాంతిని గ్రహించడం, దాన్ని విద్యుత్తుగా మార్చుకోవడం ఆశించినంత స్థాయిలో లేదు. ఈ సమస్యపై దృష్టి సారించిన ఐఐఎస్‌ఈఆర్‌, ఐఐటీ శాస్త్రవేత్తలు- ‘‘పరమాణు నానో క్లస్టర్లను ఉపయోగించడం ద్వారా సూర్యరశ్మిని అధిక స్థాయిలో గ్రహించడమే కాకుండా, 93% సామర్థ్యంతో శక్తిని బదిలీ చేయగలిగాం. ఈ విధానంలో సౌర విద్యుత్తును హెచ్చుస్థాయిలో ఉత్పత్తిచేసే అవకాశముంది’’ అని తెలిపారు. 2070 నాటికి ఉద్గారాలకు తావులేని విద్యుత్తు సరఫరా చేపట్టాలని భారత్‌ సంకల్పించింది. ఈ క్రమంలో ఈ పరిశోధన ప్రాధాన్యం సంతరించుకొంది.


పాఠశాల మరుగుదొడ్డిలో బిడ్డకు జన్మ

రాజస్థాన్‌లోని కోటాలో ఓ మైనర్‌.. పాఠశాలలోని మరుగుదొడ్డిలో బిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం నవజాత శిశువును నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నవజాతశిశువును ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శిశువు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితురాలు కూడా  చికిత్స పొందుతోందని పేర్కొన్నారు. బాధితురాలిపై 11 నెలలుగా 21 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడుతున్నాడు. నిందితుడు.. బాధితురాలికి బంధువే. మైనర్‌ తన అమ్మమ్మ ఇంటికి వెళ్తుండేది. అదే గ్రామానికి చెందిన యువకుడు ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది.


దిల్లీ ఎయిమ్స్‌పై హ్యాకర్ల పంజా..200 కోట్లకు డిమాండ్‌

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఏఐఐఎంఎస్‌)పై హ్యాకర్లు పంజా విసిరారు. రూ.200 కోట్లను క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారని తెలిసింది. గత ఆరు రోజులుగా ఆసుపత్రిలోని ప్రక్రియ అంతా మాన్యువల్‌గానే జరుగుతోంది. సమస్యను తొలుత బుధవారం గుర్తించారు. సుమారు 3-4 కోట్ల మంది రోగుల సమాచారం సర్వర్లలో నిక్షిప్తమై ఉంది. ఇందులో పలువురు వీఐపీలు, మాజీ ప్రధానులు, మంత్రులకు సంబంధించి ఆరోగ్య సమాచారం ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది.


పాత పింఛను విధానాన్ని పునరుద్ధరించండి

సీతారామన్‌కు కార్మిక సంఘాల వినతి

దిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛను విధానాన్ని(ఓపీఎస్‌) తిరిగి పునరుద్ధరించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అసంఘటిత రంగంలోని కార్మికులను విశ్వసనీయ సామాజిక భద్రత ఛత్రం కిందకు తీసుకురావాలని కోరాయి. అంతేకాకుండా కనీస పింఛను మొత్తాన్ని పెంచాలని సూచించాయి. ముందస్తు బడ్జెట్‌ చర్చల్లో భాగంగా సోమవారం సీతారామన్‌తో ఏర్పాటు చేసిన వర్చువల్‌ భేటీకి 10 కార్మిక సంఘాల మండలి నేతలు హాజరు కాలేదు. ఈ క్రమంలో వారు ఈ-మెయిల్‌ ద్వారా కేంద్రమంత్రికి వినతి పత్రం పంపారు.


మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం లేదు: రాందేవ్‌ బాబా

ముంబయి: మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో రాందేవ్‌ క్షమాపణలు తెలిపారు. దుస్తులు ధరించకపోయినా మహిళలు అందంగానే ఉంటారంటూ గతవారం రాందేవ్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో మహారాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ‘‘మహిళలను అగౌరవపర్చాలన్న ఉద్దేశం నాకు లేదు. నా వ్యాఖ్యల వల్ల బాధపడిన వారికి బేషరతుగా క్షమాపణలు తెలియజేస్తున్నా’’ అని రాందేవ్‌ ఆ నోటీసులకు సమాధానమిచ్చారు.


పాల ఉత్పత్తిలో రికార్డు స్థాయి వృద్ధి

దేశంలో పాల ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైంది. గత 8 ఏళ్లలోనే 83 టన్నుల ఉత్పత్తి పెరిగింది. అంతకు ముందు 63 ఏళ్ల కాలంలో 121 టన్నుల వృద్ధి మాత్రమే సాధ్యమైంది. నారీశక్తిని మరింత బలోపేతం చేయడానికి డెయిరీ రంగం ఓ గొప్ప మార్గం. 

నరేంద్ర మోదీ


మహిళలకు ఇంట్లోనే నిత్య నరకం

చాలా మంది మహిళలకు వారి ఇల్లే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం. 2021లో హత్యకు గురైన మహిళల్లో 56 శాతం మంది వారి సన్నిహిత భాగస్వాములు లేదా కుటుంబ సభ్యుల చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, బాలికలపై హింసను అరికట్టడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి.

ఐరాస మహిళా విభాగం


కశ్మీరీ పండిట్ల ఆవేదన పట్టని కేంద్రం

కశ్మీరీ పండిట్లు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. వారికి ఇంకా పునరావాసం కల్పించనే లేదు. వారికి నేటికీ ఉగ్ర దాడుల ముప్పు పొంచి ఉంది. అయినప్పటికీ కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు ఉన్నాయని భ్రమింపజేసేందుకు కశ్మీరీ పండిట్లను ఇంకా సున్నిత ప్రాంతాల్లోనే ఉంచారు. వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ప్రియాంకా చతుర్వేది


మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవాలి

మనుషులు ఈ లోకంలోకి ఓ మట్టిముద్దలా వస్తారు. మీకు కావాల్సినట్లు మిమ్మల్ని మీరే తీర్చిదిద్దుకోవాలి. లేకపోతే ఈ సమాజం, ఇతరులు మిమ్మల్ని వారికి తోచినట్లు మలుచుకుంటారు. అదే జరిగితే మీరు అనాకారిగా మారిపోతారు.

జగ్గీ వాసుదేవ్


శబరిమల అయ్యప్పకు 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం

ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దేవస్థానానికి భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కె.అనంత గోపన్‌ తెలిపారు. అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్ల ఆదాయం రాగా అరవణ విక్రయంతో రూ.23.57 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. దేవస్థానంలో హుండీల ద్వారా రూ. 12.73 కోట్ల ఆదాయం వచ్చినట్లు అనంత గోపన్‌ పేర్కొన్నారు.


విద్యార్థినులకు శానిటరీ ప్యాడ్‌ల ఉచిత పంపిణీకి ఆదేశించండి
సుప్రీంలో పిటిషన్‌ దాఖలు

దిల్లీ: దేశవ్యాప్తంగా సర్కారు పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదివే విద్యార్థినులకు ప్రభుత్వాలు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు ఇచ్చేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీంకోర్టులో పిల్‌ దాఖలైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌, జస్టిస్‌ పి.ఎస్‌. నరసింహతో కూడిన ధర్మాసనం దీనిపై సోమవారం విచారణ చేపట్టింది. కేంద్రానికి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్‌కు చెందిన సామాజిక కార్యకర్త జయ ఠాకుర్‌ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికల వ్యక్తిగత పరిశుభ్రతపై కీలక అంశాన్ని పిటిషనర్‌ లేవనెత్తారని పేర్కొన్న ధర్మాసనం.. ఈ విషయంలో సహకారం అందించాల్సిందిగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరింది.


రహస్య విచారణపై తేజ్‌పాల్‌ అభ్యర్థన కొట్టివేత

దిల్లీ: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న పాత్రికేయుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ దానిపై రహస్య విచారణ (ఇన్‌ కెమెరా ప్రొసీడింగ్స్‌) జరపాలని చేసుకున్న అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2013 నాటి కేసులో తనను నిర్దోషిగా విడుదల చేయడంపై బాంబే హైకోర్టులో దాఖలైన అప్పీలులో తేజ్‌పాల్‌ ఈ అభ్యర్థన చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం దీనిపై విచారణ జరిపింది. తేజ్‌పాల్‌ ప్రతిష్ఠను, ప్రైవసీని పరిరక్షించడానికి విచారణను ప్రైవేటుగా జరపాలని సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అమిత్‌ దేశాయ్‌ వాదించారు. బాధిత మహిళలు నిర్భీతిగా వాంగ్మూలం ఇచ్చేందుకే రహస్య విచారణను అనుమతిస్తామనీ, నిందితులకు, లేదా పురుషులకు దీనిని విస్తరింపజేయలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. కావాలంటే వర్చువల్‌ విధానంలో కాకుండా నేరుగా వాదోపవాదాలు జరపాల్సిందిగా హైకోర్టును అభ్యర్థించుకునేందుకు అనుమతించింది.


వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి వినియోగదారు ఫిర్యాదుల ఈ-ఫైలింగ్‌ తప్పనిసరి

దిల్లీ: వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి వినియోగదారుల ఫిర్యాదులను ప్రభుత్వం తప్పనిసరిగా ఈ-ఫైలింగ్‌ చేయనుంది. వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించే ఉద్దేశంతోనే ఈ విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు సీనియర్‌ అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ప్రజలు ప్రస్తుతం వినియోగదారుల న్యాయస్థానాలను, కమిషన్లలో నేరుగా, లేదంటే ఆన్‌లైన్‌ విధానంలో ఫిర్యాదుచేసే అవకాశముంది. వీటిని ఎలక్ట్రానిక్‌ ఫైలింగ్‌ చేసే విధానం 2020 సెప్టెంబరులోనే అందుబాటులోకి వచ్చింది. కానీ, ఫిర్యాదులను ఈ-ఫైలింగ్‌ చేయడం మాత్రం తప్పనిసరి కాదు. అయినప్పటికీ ఈ విధానంతో సత్ఫలితాలు వస్తున్నందున 2023, ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని తప్పనిసరి చేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాలశాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు. ఇది అందుబాటులోకి వస్తే న్యాయవాదుల సహాయం అవసరం లేకుండానే వినియోగదారులు సంబంధిత కోర్టు లేదా కమిషన్‌లకు ఫిర్యాదుచేసే అవకాశం ఉంటుంది.


ఒకే వేదికపై ఒక్కటైన వెయ్యికిపైగా జంటలు

గోరఖ్‌పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌లో సోమవారం సామూహిక వివాహ కార్యక్రమం వైభవంగా జరిగింది. ‘ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన’ పథకంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకలో వెయ్యికి పైగా జంటలు ఒక్కటయ్యాయి. వధూవరులను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆశీర్వదించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కుటుంబాలకు చెందిన ఆడపిల్లలకు గౌరవప్రదంగా పెళ్లిళ్లు చేసే ఉద్దేశంతో 2017లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. సామూహిక వివాహ పథకం కింద ఒక్కో జంటకు రూ. 51 వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు 2లక్షల వివాహాలు చేసినట్లు వెల్లడించారు.


6 నెలల్లో 34 కిలోల బరువు తగ్గిన సిద్ధూ

పటియాలా: జైలు శిక్ష అనుభవిస్తున్నవారు బరువు తగ్గడం సహజమే. కానీ, చాలా సందర్భాల్లో అక్కడి భోజనం నచ్చక బరువు తగ్గుతుంటారు. కానీ, 34 ఏళ్ల క్రితం జరిగిన ఓ ఘర్షణ కేసులో జైలుకు వెళ్లిన పంజాబ్‌ కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్‌ నవజోత్‌ సింగ్‌ సిద్ధూ ఓ ప్రణాళిక ప్రకారం తన బరువు తగ్గించుకున్నారు. కేవలం ఆరు నెలల్లో 34 కిలోల బరువు తగ్గినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పటియాలా కేంద్రకారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన్ని కలిసేందుకు వెళ్లిన సన్నిహితులు, మాజీ ఎమ్మెల్యే నవతేజ్‌ సింగ్‌ చీమా.. సిద్ధూ ఆరోగ్య పరిస్థితిని గురించి చెప్పుకొచ్చారు. సిద్దూ ప్రస్తుతం 99 కిలోల బరువు ఉన్నట్లు నవతేజ్‌ చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో క్రికెటర్‌గా ఉన్నప్పుడు సిద్దూ ఎలా ఉండేవారో ఇప్పుడు అలాగే కనిపిస్తున్నారని అన్నారు. రోజులో ఆయన కనీసం 4 గంటల పాటు ధ్యానం, మరో రెండు గంటలు యోగా, వ్యాయామాలు చేస్తున్నారట. వివిధ పుస్తకాలు చదివి, కేవలం నాలుగు గంటలపాటే నిద్రపోతున్నారని నవతేజ్‌ చెప్పారు.  


ఎంపీ కాన్వాయ్‌ ఢీ.. రెండో తరగతి బాలుడి మృతి

భాజపా ఎంపీ కాన్వాయ్‌ కింద పడి ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బస్తీ జిల్లా బసియా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరిగింది. రెండో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలుడు.. స్థానిక ప్రైమరీ స్కూల్‌ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా.. భాజపా ఎంపీ హరీశ్‌ ద్వివేది కాన్వాయ్‌ ఢీకొట్టింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ ఘటన జరిగిందని బాలుడి కుటుంబసభ్యులు తెలిపారు. ‘‘రోడ్డు దాటుతుండగా నా కుమారుడిని ఎంపీ కారు ఢీకొట్టింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. ప్రాథమిక చికిత్స అనంతరం లఖ్‌నవూలోని మరో ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు పోయాయి’’ అని బాలుడి తండ్రి శత్రుఘన్‌ రాజ్‌భర్‌ తెలిపారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో నమోదయ్యాయి. బాలుడిని ఢీకొట్టగానే ఎంపీ కిందకు దిగి.. ఘటనాస్థలిని పరిశీలించడం వీడియోలో కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో ఎంపీతో పాటు పలువురిపై ఫిర్యాదు నమోదైనట్లు డీఎస్పీ అలోక్‌ ప్రసాద్‌ చెప్పారు.  


రెస్టారెంట్లలో చికెన్‌కు బదులు పావురం బిర్యానీ!
ముంబయి పోలీసులకు విశ్రాంత సైనికాధికారి ఫిర్యాదు

ఓ వ్యక్తి పావురాలను పెంచి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లకు అమ్ముతున్నాడని ముంబయి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆయా చోట్ల చికెన్‌కు బదులు పావురం మాంసంతో బిర్యానీ వండి వడ్డిస్తున్నారంటూ విశ్రాంత సైనికాధికారి ఒకరు ఆరోపించారు. పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు. సియోన్‌ ఠాణా పరిధిలో అభిషేక్‌ సావంత్‌ పావురాలను పెంచి బార్‌, రెస్టారెంట్లలో అమ్ముతున్నాడని రిటైర్డ్‌ ఆర్మీ కెప్టెన్‌ హరీశ్‌(71) పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. ‘‘అభిషేక్‌ అనే వ్యక్తి అపార్ట్‌మెంట్‌పై పావురాలను పెంచుతున్నాడు. తన డ్రైవర్‌ సహాయంతో వాటిని ముంబయిలోని బార్‌, రెస్టారెంట్స్‌కు అమ్ముతున్నాడు. అపార్ట్‌మెంట్‌ సొసైటీ వాచ్‌మేన్‌ ఆ పావురాలకు నీళ్లు పోసేందుకు వెళ్లేవాడు. ఈ విషయాన్ని అపార్ట్‌మెంట్‌ సొసైటీలో కొంతమందికి చెప్పాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు’’ అని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో హరీశ్‌ పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, సొసైటీలో కొంతమందిపై కేసులు పెట్టారు. హరీశ్‌ చెప్పిన విషయాలు నిజమా కాదా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


 

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని