ఇలాగైతే వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?

న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేయడంలో జాప్యం చోటుచేసుకుంటుండటంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.

Published : 29 Nov 2022 04:34 IST

కొలీజియం సిఫార్సులను ఆమోదించడంలో జాప్యంపై సుప్రీంకోర్టు ఆవేదన
కేంద్రం తీరు విసుగు తెప్పిస్తోందని వ్యాఖ్య
తామే నిర్ణయం తీసుకునేదాకా పరిస్థితిని తెచ్చుకోవద్దని హితవు

దిల్లీ: న్యాయమూర్తుల నియామకం కోసం కొలీజియం సిఫార్సు చేసిన పేర్లకు కేంద్రప్రభుత్వం ఆమోదముద్ర వేయడంలో జాప్యం చోటుచేసుకుంటుండటంపై సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో సర్కారు తీరు విసుగు తెప్పిస్తోందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ బెంగళూరు అడ్వొకేట్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకాల ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నియామకాలు ఎంత గడువులోగా పూర్తవ్వాలన్నదానిపై గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసిన సంగతిని ధర్మాసనం గుర్తుచేసింది. కేంద్రం వాటికి కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. ‘‘జాతీయ జ్యుడీషియల్‌ నియామకాల కమిషన్‌ (ఎన్‌జేఏసీ) అమల్లోకి రాకపోవడంతో ప్రభుత్వం సంతోషంగా లేనట్లు కనిపిస్తోంది. అయితే అది పట్టాలెక్కనంతమాత్రాన.. ప్రస్తుతమున్న శాసనాన్ని విస్మరించకూడదు. చట్టం ఉన్నంతవరకూ దాన్ని పాటించాల్సిందే’’ అని జస్టిస్‌ కౌల్‌ అన్నారు. సుప్రీంకోర్టు 2015లో ఎన్‌జేఏసీ చట్టం, 99వ రాజ్యాగ సవరణను కొట్టివేసింది. తద్వారా ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థను పునరుద్ధరించినట్లయింది.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను (వాటిలో పునరుద్ఘాటించిన పేర్లు కూడా ఉన్నాయి) కేంద్రం ఆమోదించకుండా కాలయాపన చేస్తున్న మాట వాస్తవమని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణితో ధర్మాసనం తాజాగా పేర్కొంది. ఇలాగైతే వ్యవస్థ ఎలా పనిచేస్తుందని ప్రశ్నించింది. ఏదైనా పేరును కొలీజియం మళ్లీ సిఫార్సు చేస్తే (పునరుద్ఘాటిస్తే) సంబంధిత నియామకం జరిగి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద కొన్ని పేర్లు దాదాపు ఏడాదిన్నరగా పెండింగులో ఉన్నాయని ధర్మాసనం గుర్తుచేసింది. నియామకాల ప్రక్రియ నత్తనడకన సాగుతుండటంతో.. జడ్జీలుగా పదోన్నతి పొందేందుకు తొలుత అంగీకరించిన కొందరు న్యాయవాదులు తర్వాత వెనక్కి తగ్గుతున్నారని తెలిపింది. సీనియారిటీని కూడా దృష్టిలో పెట్టుకొని కొలీజియం సిఫార్సులు చేస్తుంటుందని పేర్కొంది. కొన్నిసార్లు తమ వద్దకు వచ్చిన పేర్లలో ఎవరో ఒకరికి మాత్రమే ప్రభుత్వం ఆమోద ముద్ర వేస్తుండటంతో సీనియారిటీ సంబంధిత అంశాలు ఇబ్బందికరంగా మారుతున్నాయని పేర్కొంది. కొలీజియం సిఫార్సులను ఇంతలా పెండింగులో ఉంచడమంటే సాహసమేనని వ్యాఖ్యానించింది. కలిసికట్టుగా పనిచేసి ఈ సమస్యకు పరిష్కార మార్గం కనుగొనాలని అటార్నీ జనరల్‌,   సొలిసిటర్‌ జనరల్‌లకు సూచించింది. లేనిపక్షంలో న్యాయవ్యవస్థ వైపు నుంచి తామే ఈ వ్యవహారంలో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని హితవు       పలికింది. పరిస్థితి అంతవరకూ తెచ్చుకోవద్దని చెప్తూ.. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. కొలీజియం తమ సిఫార్సులను ఏకగ్రీవంగా పునరుద్ఘాటిస్తే.. సంబంధిత వ్యక్తులను 3-4 వారాల్లోగా జడ్జీలుగా నియమించాల్సిందేనని సుప్రీంకోర్టు గత ఏడాది ఏప్రిల్‌లో తమ ఉత్తర్వుల్లో పేర్కొన్న సంగతి గమనార్హం.

20 దస్త్రాలను కొలీజియానికి తిప్పిపంపిన కేంద్రం!

దిల్లీ: హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి 20 దస్త్రాలను పునఃపరిశీలన కోసం సుప్రీంకోర్టు కొలీజియానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25న వెనక్కి పంపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి! కొలీజియం సిఫార్సు చేసిన పేర్లపై కేంద్రం బలమైన అభ్యంతరాలు లేవనెత్తిందని కూడా పేర్కొన్నాయి. తిప్పిపంపిన 20 దస్త్రాల్లో 11 కొత్త సిఫార్సులని వెల్లడించాయి. మిగిలిన 9.. కొలీజియం గతంలోనే సిఫార్సు చేసి, పునరుద్ఘాటించినవని   తెలియజేశాయి. తాను స్వలింగ సంపర్కుడినంటూ బహిరంగంగా ప్రకటించిన సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌ పేరు కూడా అందులో ఉన్నట్లు సమాచారం. కిర్పాల్‌ భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఎన్‌.కిర్పాల్‌ కుమారుడు. ఆయన్ను హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని దిల్లీ హైకోర్టు 2017 అక్టోబరులో ప్రతిపాదించింది. అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఆయన నియామకం విషయంలో మూడుసార్లు సంప్రదింపులను వాయిదా వేసింది. ఎట్టకేలకు 2021 నవంబరులో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని కొలీజియం కిర్పాల్‌కు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ఆయన్ను దిల్లీ హైకోర్టు జడ్జిగా నియమించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని