బలవంతపు మతమార్పిళ్లు మతస్వేచ్ఛ కాదు

ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది.

Published : 29 Nov 2022 04:34 IST

సుప్రీంకు నివేదించిన కేంద్రం

దిల్లీ: ఇతరులను బలవంతంగా మతం మార్పించడమన్నది మతస్వేచ్ఛ పరిధిలోకి రాదని సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. మోసం, బలప్రయోగం, ఆకర్షణల ద్వారా మతమార్పిళ్లకు పాల్పడితే మతస్వేచ్ఛను ఉల్లంఘించినట్లేనని పేర్కొంది. అలాంటి చర్యలను నిరోధించేందుకు అవసరమైన చట్టాలు చేయాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పింది. భయపెట్టడం, బహుమతులు అందజేయడం, ఆర్థిక ప్రయోజనాలు కల్పించడం ద్వారా దేశంలో మతమార్పిళ్లు చోటుచేసుకుంటున్నాయని.. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని న్యాయవాది అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తాజా వివరాలతో కోర్టులో సంక్షిప్తంగా ఓ ప్రమాణపత్రాన్ని సమర్పించింది. బలవంతపు మతమార్పిళ్ల సమస్య తీవ్రత గురించి తమకు తెలుసని అందులో పేర్కొంది. అశ్వినీకుమార్‌ పిటిషన్‌లో ప్రస్తావించిన అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ.. మతస్వేచ్ఛను పరిరక్షించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చింది.

ఈ అంశంపై విచారణ జరుపుతున్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ సి.టి.రవికుమార్‌ల ధర్మాసనం స్పందిస్తూ.. మతమార్పిళ్లకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది. అయితే బలవంతపు మతమార్పిళ్లు ఎంతమాత్రమూ సముచితమైనవి కావని పేర్కొంది. ఈ అంశంపై రాష్ట్రాల నుంచి సమాచారాన్ని సేకరించి సమగ్ర ప్రమాణపత్రం సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. మరోవైపు- ఒడిశా, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, కర్ణాటక, హరియాణా వంటి రాష్ట్రాలు బలవంతపు మతమార్పిళ్లను నిరోధించేందుకు ఇప్పటికే ప్రత్యేక చట్టాలను ఆమోదించాయని సర్వోన్నత న్యాయస్థానానికి సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలియజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని