పర్యవసానాలేమిటో తెలియాలి కదా

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) విషయంలో తప్పుడు ఫిర్యాదులు చేసే ఓటర్లకు దాని పర్యవసానాలేమిటో తప్పనిసరిగా తెలియాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 29 Nov 2022 04:34 IST

ఈవీఎంలపై తప్పుడు ఫిర్యాదులపై సుప్రీంకోర్టు వ్యాఖ్య

దిల్లీ: ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల (ఈవీఎంలు) విషయంలో తప్పుడు ఫిర్యాదులు చేసే ఓటర్లకు దాని పర్యవసానాలేమిటో తప్పనిసరిగా తెలియాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈవీఎంలు, ఓటు రసీదు యంత్రాలు (వీవీప్యాట్‌లు) పనిచేయకపోవడం గురించి నివేదించడం నేరమన్నట్లు చెబుతున్న ‘ఎన్నికల ప్రవర్తన నియమావళి’లోని 49ఎంఏ నిబంధనను రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సునీల్‌ అహ్యా అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిల ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. తాను ఒకరికి ఓటు వేస్తే వీవీప్యాట్‌లో వచ్చిన రసీదులో మాత్రం మరొకరికి పడినట్లు చూపించిందని ఓటరు ఫిర్యాదు చేస్తే ఆ మేరకు ప్రిసైడింగ్‌ అధికారి రాతపూర్వకంగా డిక్లరేషన్‌ తీసుకోవాలని ఈ నిబంధన చెబుతోంది. ఒకవేళ అది తప్పుడు ఫిర్యాదు అయితే పరిణామాలు ఎలా ఉంటాయో ముందుగా హెచ్చరించాలని దానిలో ఉంది. యంత్రాల్లో పొరపాటు చోటుచేసుకున్నా బాధ్యతను ఓటరుపై నెట్టడమంటే రాజ్యాంగబద్ధంగా లభించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛలో చొరబడడమేనని పిటిషనర్‌ ఆరోపించారు. ‘‘(ఇలాంటి అంశాల్లో) తప్పుడు ఫిర్యాదు చేస్తే దానివల్ల తలెత్తబోయే పరిణామాలేమిటో తెలుసుకుని తీరాలి’’  అని ధర్మాసనం తెలిపింది. ఈసీ నిబంధన వల్ల ఈవీఎంలపై ఫిర్యాదులు చేయడానికీ ఎవరూ ముందుకు రారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చెప్పారు. ఎన్నికల నిబంధన ఎలా ఇబ్బందికరం అవుతుందో, దానిని ఎందుకు రద్దు చేయాలో రాతపూర్వకంగా నివేదించాలని పిటిషనర్‌ను ఆదేశించిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని