ఐదుగురు ఉగ్రవాదులకు జీవిత ఖైదు

దేశంలోని పలు ప్రాంతాల్లో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, వారికి ఆయుధాలు సమకూర్చుతున్న ఐదుగురు జైషే మహమ్మద్‌ టెర్రరిస్టులకు దిల్లీ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది.

Published : 29 Nov 2022 04:51 IST

దిల్లీ: దేశంలోని పలు ప్రాంతాల్లో యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించి, వారికి ఆయుధాలు సమకూర్చుతున్న ఐదుగురు జైషే మహమ్మద్‌ టెర్రరిస్టులకు దిల్లీ న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఆ సంస్థ యువతను పెద్ద సంఖ్యలో నియమించుకుని.. వారికి ఉగ్రవాదం, ఉగ్ర కార్యకలాపాల్లో శిక్షణ ఇస్తున్నట్టు విచారణలో తేలింది. జాతీయ దర్యాప్తు సంస్థ 2019 మార్చిలో ఈ కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం న్యాయమూర్తి శైలేందర్‌ మాలిక్‌ సోమవారం తీర్పును వెలువరించారు. జీవిత ఖైదు పడినవారిలో సాజిద్‌ అహ్మద్‌ ఖాన్‌, బిలాన్‌ అహ్మద్‌ మిర్‌, ముజఫర్‌ అహ్మద్‌ భట్‌, ఇష్ఫాఖ్‌ అహ్మద్‌ భట్‌, మెహ్రాజుద్దీన్‌ చోపన్‌లు ఉన్నారు. ఇదే కేసులో తన్వీర్‌ అహ్మద్‌ గనీ అనే మరో వ్యక్తికి న్యాయమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు.

‘‘దోషులంతా కలిసి దేశ ఐక్యత, సమగ్రతలను దెబ్బతీసేందుకు కుట్ర పన్నారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌లో సభ్యులుగా ఉంటూ.. యువతకు ఉగ్ర శిక్షణ ఇస్తున్నారు. తర్వాత వారికి ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నిధులను అందిస్తున్నారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ యువతను ఉగ్రవాదంవైపు ఆకర్షిస్తున్నారు’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. భారత్‌పై యుద్ధం సాగించేందుకు జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజ్‌హర్‌ సోదరుడు ముఫ్తీ అబ్దుల్‌ రౌఫ్‌ అష్రఫ్‌, మరికొందరు సీనియర్లు భారీ కుట్ర రచించినట్టు న్యాయస్థానం పేర్కొంది. పాకిస్థాన్‌కు చెందిన కరి ముఫ్తీ యాసిర్‌ భారత్‌లోకి అక్రమంగా చొరబడి, కశ్మీర్‌ యువతను ఉగ్రవాదంవైపు నడిపించేందుకు ప్రయత్నించినట్టు పేర్కొంది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని